బయటకు పొక్కిన టిఆర్ఎస్ రెండో లిస్ట్ ఇదే

తెలంగాణలో ఎన్నికల రణరంగంలో ముందున్న టిఆర్ఎస్ పార్టీ రెండో జాబితాను రెడీ చేసింది. అసెంబ్లీ రద్దు చేసిన రోజే మీడియా సమావేశంలో గులాబీ దళపతి కేసిఆర్ 105 మంది అభ్యర్థులతో భారీ లిస్ట్ ప్రకటించారు. అయితే ఆ లిస్టులో ఉన్న కొందరిని మార్చాలంటూ అధిష్టానంపై వత్తిళ్లు తీవ్రమవుతున్నాయి. కానీ ఎవరు ఎంతగా వత్తిడి చేసినా డోంట్ కేర్ అంటున్నారు కేసిఆర్ అండ్ కేటిఆర్.

105 సీట్లు పోగా మరో 14 సీట్లలో మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది టిఆర్ఎస్ పార్టీ. ఈ పద్నాలుగులో కొన్ని బిజెపి సిట్టింగ్ సీట్లున్నాయి. మరికొన్ని ఎంఐఎం సిట్టింగ్ సీట్లున్నాయి. ఎలాగూ ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీ అని టిఆర్ఎస్ ప్రకటించింది కాబట్టి ఎంఐఎం సిట్టింగ్ సీట్లలో బలహీనమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నది టిఆర్ఎస్.

ఇక బిజెపి సిట్టింగ్ సీట్లలో కూడా అభ్యర్థులను ప్రకటించలేదు. కేవలం ఉప్పల్ లో మాత్రం సుభాష్ రెడ్డిని అనౌన్స్ చేశారు. ఇక్కడ బిజెపి సిట్టింగ్ ఎన్ విఎస్ఎస్ ప్రభాకర్ ఉన్నారు. ఈ స్థానంలో సుభాష్ రెడ్డి తెలంగాణ ఉద్యమ కాలం నుంచీ టిఆర్ఎస్ లో పనిచేస్తున్నారు. అందుకే ఆయనకు 2014లో టికెట్ ఇచ్చారు కేసిఆర్. కానీ అప్పుడు బిజెపి మీద ఓడిపోయారు. తిరిగి ఆయనకే ఈసారి కూడా టికెట్ అనౌన్స్ చేశారు కేసిఆర్. అయితే బేతి మీద సొంత పార్టీలోనే నిరసన గళాలు వినబడుతున్నాయి. ఆయనను మార్చాలంటూ వత్తిళ్లు వస్తున్నాయి.

ఇక మిగిలిన 14 సీట్లలో 12 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారని ఒక లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.  వైరల్ అవుతున్న ఆ  జాబితా కింద ఉంది చూడండి.

తెరాస 12 మందితో కూడిన రెండో జాబితా అత్యంత విశ్వసనీయ సమాచారం ద్వారా తెలిసింది.
వరంగల్ తూర్పు — నన్నపనేని నరేందర్
ఖైరతాబాద్ — దానం నాగేందర్
మేడ్చెల్ — మల్లారెడ్డి (ఎంపి)
చొప్పదండి — రవి శంకర్
హుజుర్ నగర్ — సైదిరెడ్డి
జహీరాబాద్ — ఎర్రోళ్ల శ్రీనివాస్
కోదాడ — వేనేపల్లి చందర్ రావ్
ముషీరాబాద్ — ముఠా గోపాల్
గోశామహల్ — ప్రేమ్ సింగ్ రాథోడ్
వికారాబాద్ — రామచందర్
అంబర్ పేట — ఎడ్ల సుధాకర్ రెడ్డి
మల్కాజిగిరి — మైనంపల్లి హన్మంతరావు

ఈ లిస్ట్ చూస్తే ముగ్గురు సిట్టింగ్ లకు మొండిచేయి చూపినట్లే కనబడుతున్నది. అందులో చొప్పదండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బొడిగె శోభకు సీటు లేదని ఈ లిస్ట్ ను చూస్తే అర్థమవుతున్నది. ఆమె స్థానంలో రవిశంకర్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ఇక మేడ్చల్ సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ని కూడా పక్కన పెట్టారు. ఆయన సర్వేల్లో వెనుకబడ్డారని పార్టీ అధిష్టానం తేల్చి చెప్పింది. అంతేకాకుండా అవినీతి ఆరో్పనలు కూడా ఆయన మీద వినబడ్డాయి. దీంతో ఆయనను పక్కన పెట్టి ఆయన స్థానంలో ఎంపిగా ఉన్న మల్లారెడ్డిని బరిలోకి దింపాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. 

మూడో సిట్టింగ్ అయిన మల్కాజ్ గిరిలో కనకారెడ్డికి కూడా మొండిచేయి చూపే అవకాశాలే కనబడుతున్నాయి. ఆయనకు టికెట్ ఇవ్వకపోతే ఆయన స్థానంలో ఆయన కోడలు కు టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ వారిద్దరినీ కాదని టిఆర్ఎస్ నేత మైనంపల్లి హన్మంతరావు పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 

ఇక ఖైరతాబాద్ సీటులో మాజీ మంత్రి, కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరిన దానం నాగేందర్ పేరునే ఖరారు చేసినట్లు అర్థమవుతున్నది. ఆ స్థానంలో ఆశాహుల జాబితాలో మన్నె గోవర్దన్ రెడ్డి, పిజెఆర్ కూతరు విజయారెడ్డి కూడా ఉన్నారు. అయితే దానం కు టిఆర్ఎస్ లో సీటిస్తే పిజెఆర్ కూతురు విజయారెడ్డి తిరిగి కాంగ్రెస్ వెళ్తారన్న ప్రచారం కూడా పార్టీలో బలంగా వినబడుతున్నది.

ఇక టిఆర్ఎస్ మీద నిప్పులు చెరిగి కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి కొండా సురేఖ సిట్టింగ్ స్థానంలో వరంగల్ మేయర్ నన్నపనేని నరేందర్ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అందుకోసమే నన్నపనేని నరేందర్ పదే పదే కొండా వర్గంతో గతంలో వైరం నడిపారు. ఆయనకు అధిష్టానం అండదండలు ఉండబట్టే కొండా కుటుంబంతో వైరం నడిపినట్లు వార్తలొచ్చాయి.

హుజూర్ నగర్ సీటును ఆశించిన తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతచారి తల్లి శంకరమ్మకు చాన్స్ లేనట్లే కనబడుతున్నది. ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎన్నారై సైదిరెడ్డి పేరునే ఖరారు చేసినట్లు జాబితా చూస్తే అర్థమవుతున్నది. అయితే సైదిరెడ్డికి ఇవ్వొద్దని శంకరమ్మ ఘాటుగా హెచ్చరించారు. సైదిరెడ్డికి టికెట్ ఇస్తే హుజూర్ నగర్ పొలిమేరలు దాటేవరకు తరిమికొడతామన్నారు. తనకు కానీ లేదంటే అప్పిరెడ్డికి కానీ టికెట్ ఇస్తే అభ్యంతరం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో సైదిరెడ్డి పేరు ఖరారు చేస్తే శంకరమ్మ టిఆర్ఎస్ లోనే ఉంటారా పార్టీకి రాజీనామా చేస్తారా అన్నది చూడాల్సి ఉంది.

ముషీరాబాద్ సీటును ఆశించిన హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డికి, ఆయన అల్లుడు శ్రీనివాసరెడ్డికి ఇద్దరికి కూడా భంగపాటు తప్పలేదని ఈ లిస్టు వెల్లడిస్తున్నది. వారు ఆ సీటు తమకే కావాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. తన అల్లుడికి ఇవ్వకపోతే తనకు ఇవ్వాలని నాయిని గట్టిగానే కొట్లాడారు. కానీ వారిద్దరినీ పక్కనపెట్టి టిడిపి నుంచి టిఆర్ఎస్ లో చేరిన ముఠా గోపాల్ కు టికెట్ ఇచ్చినట్లు లిస్ట్ చెబుతున్నది.

ఎంఐఎం ఖాతాలో ఉన్న మరో రెండు నియోజకవర్గాలకు టిఆర్ఎస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

అయితే ఈ జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. పరిస్థితి చూస్తే ఈ జాబితాలో చాలా పేర్లు ఖరారైనట్లే కనబడుతున్నది. దీన్ని అధికారికంగా వెల్లడించిన తర్వాతే టిఆర్ఎస్ రెండో జాబితాగా చెప్పొచ్చు. 

 

దసరా సెలవుల్లో ఎంజాయ్ చేయాలంటే లక్నవరం ఫ్యామిలీ ట్రిప్ వేయండి. ఈ వార్త కోసం క్లిక్ చేయండి