బ్రేకింగ్ : రేవంత్ కు జూబ్లిహిల్స్ పోలీసుల నోటీసులు

జూబ్లిహిల్స్ పోలీసులు రేవంత్ రెడ్డికి నోటీసులు పంపారు. 15 రోజుల్లోగా తమ ముందు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తప్పుడు పత్రాలతో 2001లో ప్లాట్లు కేటాయించారని రేవంత్ మీద ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలు చేస్తూ న్యాయవాది ఎస్.రామారావు జూబ్లీహిల్స్ పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశారు. 2001లో రేవంత్ రెడ్డి జూబ్లిహిల్స్ హౌసింగ్ కో ఆపరేటీవ్ సొసైటీకి పాలక మండలి సభ్యుడిగా పోటీ చేసి గెలిచారు. ఆ పాలకమండలిలో ప్రస్తుత మహబూబ్ నగర్ ఎంపి ఎపి జితేందర్ రెడ్డి సోదరి కూడా కీలక పదవిలో ఉన్నారు. ఆ సమయంలో తప్పుడు పత్రాలతో ఇళ్ల స్థలాలు కేటాయించారంటూ రామారావు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో నాలుగు రోజుల కిందట రేవంత్ కు జూబ్లిహిల్స్ పోలీసులు నోటీసులు పంపారు.  ఈ కేసులో 15 రోజుల్లోగా తమ ముందు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే దానికి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ రిప్లై కూడా ఇచ్చినట్లు తెలిసింది. తను ఈ సమయంలో చాలా బిజీగా ఉన్నానని, ఇప్పట్లో విచారణకు రానని తేల్చి చెప్పినట్లు తెలిసింది. అయితే ఈ నోటీసులు అందడం, దానికి రేవంత్ రిప్లై ఇవ్వడం కూడా జరిగి నాలుగు రోజులైందని చెబుతున్నారు. తాజాగా ఇప్పుడు ఈ అంశం వెలుగులోకి వచ్చింది. రామారావు కేసు పెట్టి కూడా రెండు నెలలు గడుస్తున్నది. జులై రెండో వారంలో రామారావు రేవంత్ మీద ఆరోపణలు చేస్తూ జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రామారావు ఆరోపణల్లో ప్రధానమైన విషయాలేమంటే 2002లో రేవంత్ రెడ్డి 7 ప్లాట్లను అక్రమంగా అమ్మేశాడని ఆరోపించారు. అంతేకాకుండా దీనిపై అప్పట్లో కేసు ఫైల్ అయితే కోర్టులో ఫైల్ కూడా మాయమైందని, దానికి రేవంతే బాధ్యుడంటూ రామారావు ఆరోపణలు చేశారు. ఈమేరకు ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీ హిల్స్ పోలీసులు ఇప్పుడు రంగంలోకి దిగి నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో కలవరం రేపుతున్నది.

రామారావు ఆరోపణల నేపథ్యంలో రేవంత్ వివరణ కూడా ఇచ్చారు. ఎక్కడైనా హౌసింగ్ సొసైటీల్లో పాలక వర్గంలోని ప్రసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ మాత్రమే కీలకంగా ఉంటారని, బోర్డు మెంబర్ ఎలాంటి అధికారాలు ఉండవని తెలిపారు. అయినా తన ఒక్కడి మీదే ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టడం వివక్ష అని ఆరోపించారు. తాను పాలకవర్గం బోర్డు మెంబర్ గా ఉన్న సమయంలో ఇప్పటి టిఆర్ఎస్ పెద్దలకు అత్యంత సన్నిహితులే ఆనాడు కీలక హోదాల్లో ఉన్నారని గుర్తు చేశారు. వారందరినీ వదిలేసి తన మీదనే కేసులు పెట్టడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

ఒకవైపు 14 ఏండ్ల క్రితం నాటి కేసును తిరగదోడి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని హైదరాబాద్ నార్త్ జోన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ పరిస్థితుల్లో రేవంత్ కు నోటీసులు ఇవ్వడం, అది కూడా 16 ఏండ్ల క్రితం నాటి కేసులో రామారావు ఫిర్యాదుపై జూబ్లిహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే జగ్గారెడ్డి అరెస్టు తర్వాత ఇంకెవరిని అరెస్టు చేస్తారోనని కాంగ్రెస్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో రేవంత్ కు నోటీసులు జారీ చేయడం సంచలనం రేపింది.

రేవంత్ మీద రామారావు చేసిన ఆరోపణలపై సందిళ్ల శ్రీకాంత్ రెడ్డి అనే సోషల్ యాక్టివిస్ట్ తెలుగురాజ్యం కోసం రాసిన కథనం కింద ఉంది చూడొచ్చు.

రేవంత్ పై భూకబ్జా ఫిర్యాదుల వెనుక ‘గులాబీ’ మతలబు ఇదే