రేవంత్ రెడ్డి శిబిరంలో కొత్త టెన్షన్

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ఉన్న రేవంత్ రెడ్డికి కొత్త భయం పట్టుకున్నది. తన ఏకైక ప్రత్యర్థిగా చెప్పుకునే కేసిఆర్ మీద శషబిషలు లేకుండా నిప్పులు చెరిగే స్వభావం ఉన్న రేవంత్ రెడ్డికి ఇంత భయం ఎందుకు పట్టుకున్నది. ఆయన శిబిరంలో ఎందుకు కలవరం రేగుతున్నది? అసలు ఏ విషయంలో రేవంత్ శిబిరం టెన్షన్ పడుతున్నది తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.

తెలంగాణ వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి టిడిపిలో ఉన్నా, కాంగ్రెస్ లో ఉన్నా సింగిల్ అజెండాతో పనిచేస్తున్నారు. అదేమంటే కేసిఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేయడం, కేసిఆర్ ఫ్యామిలీ చేస్తున్న మంచి చెడ్డలను జనాలకు వివరించడం. ఆమాటకొస్తే మంచి చెడ్డల కంటే నిత్యం కేసిఆర్ కుటుంబంపై తీవ్రమైన విమర్శలు, అవసరమైతే వ్యక్తిగత తిట్లు తిట్టడం రేవంత్ పనిగా పెట్టుకున్నారు.

ఈ విషయంలో ఒకటి రెండుసార్లు మాత్రమే రేవంత్ విమర్శలకు ప్రతి  విమర్శలు వచ్చాయి. కానీ మెజార్టీ సమయాల్లో రేవంత్ విమర్శలపై టిఆర్ఎస్ సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. ఒకసారి బాల్క సుమన్ రేవంత్ రెడ్డికి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ చేశారు. తర్వాత రేవంత్ సై అనగానే పలాయనం చిత్తగించారు. ఇలా కారణాలేమైనా రేవంత్ ను ఎదుర్కోవడంలో టిఆర్ఎస్ ఎక్కువసార్లు విఫలమైందనే చెప్పాలి.

తన నోటితో ఇంతగా అధికార పార్టీని కలవరపెడుతూ, టెన్షన్ కు గురిచేస్తూ ఉన్న రేవంత్ రెడ్డికి భయం పట్టుకోవడమేంటి అనుకుంటున్నారా? అవును పెద్ద భయమే ఉంది రేవంత్ కు. అదేమంటే తెలంగాణ రాష్ట్రంలో తన ప్రాణాలకు హాని ఉందని రేవంత్ భయపడుతున్నారు. తనకు ప్రాణహాని ఎందుకుందో కూడా రేవంత్ వివరించారు. రేవంత్ చెబుతున్న అంశాలివి.

1  తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొద్దిరోజుల్లోనే అసెంబ్లీలో సిఎం కేసిఆర్ రేవంత్ మీద ఆపరేషన్ బ్లూ స్టార్ చేస్తా అని వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే ఏమిటో ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదు. ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే తన ప్రాణాలకు హాని కల్పించేదే అని రేవంత్ ఆరోపణ.

2 ఇటీవల కాలంలో హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి, టిఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపి బాల్క సుమన్ లు పలు సందర్భాల్లో రేవంత్ వైఖరి మార్చుకోకపోతే టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ మీద అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు మానుకోకపోతే భౌతిక దాడులు జరుగుతాయని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలే భౌతిక దాడులు చేస్తారని వారు హెచ్చరించారు. భౌతికంగా అంతమొందిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.

3 తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డిజిపి రక్షణ కల్పిస్తాడన్న నమ్మకం రేవంత్ కు లేదు. ఎందుకంటే గతంలో నాగార్జున సాగర్ లో జరిగిన టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో హైదరాబాద్ సిటీ కమిషనర్ హోదాలో ఉన్న సమయంలో మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఆ కార్యకర్తల శిక్షణా శిబిరంలో డిజిపి మాట్లాడారు. అందుకే డిజిపి టిఆర్ఎస్ పక్షపాతిగా వ్యవహరిస్తున్నాడు. అందుకే రక్షణ విషయంలో ఆందోళన ఉంది.

4 డిజిపి మహేందర్ రెడ్డి మీద రేవంత్ కు అనుమానాలున్నాయి.  రాష్ట్ర పోలీసు సెక్యూరిటీ విషయంలో తనకు నమ్మకం లేదు. అందుకే కేంద్ర సెక్యూరిటీ ఏజెన్సీల ద్వారా రక్షణ కల్పించాలి. అని రేవంత్ కోరుతున్నారు. సెక్యూరిటీ అంశంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ కు ఫిర్యాదు చేశారు.

రేవంత్ సెక్యూరిటీ విషయమై ఆయన సన్నిహితుడొకరు ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. ‘‘తెలంగాణలో నాలుగున్నరేళ్లలో సర్కారును ఉక్కిరిబిక్కిరి చేసిన మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి… కేసిఆర్ కుటుంబ అవినీతిని బయటపెట్టింది కూడా రేవంతే. కేటిఆర్ మామ తప్పుడు పత్రాలతో ఉద్యోగం కొట్టేసిన విషయాన్ని, కేటిఆర్ బామ్మార్ది రాజ్ పాకాల డ్రగ్ కేసులో ఇన్వాల్వ్ అయిన విషయాన్ని, నయీం ఆస్తులు కొట్టేసిన విషయాన్ని, మియాపూర్ భూముల కుంభకోణాన్ని, మై హోం రామేశ్వరరావు అక్రమాలను రేవంత్ అన్న బయట పెట్టిండు… ఈ విషయంలో రేవంత్ అన్నను ఏమీ చేయలేకపోయిర్రు. టిఆర్ఎస్ నేతలను గుక్క తిప్పుకోకుండా చేసినా ప్రజాస్వామ్యబద్ధంగా వారు ఏమీ చేయలేకపోయిర్రు కాబట్టి ఇక రేవంత్ తో ఏగలేకపోతున్నాం కాబట్టి భౌతిక దాడులకు దిగడం తప్ప టిఆర్ఎస్ వాళ్లకు వేరే  చాన్స్ లేదేమో? అందుకే వాళ్ల మాటలు అలా ఉన్నాయి’’ అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి రక్షణ విషయంలో గతంలో అనేకమార్లు ఆందోళన వ్యక్తం చేశారు. అయినా పోలీసు వర్గాలు పట్టించుకోలేదు. తెలంగాణ రాజకీయాల్లో ిఇప్పుడు అత్యంత కీలకమైన సమయం కాబట్టి రేవంత్ మరోసారి తన భద్రత అంశాన్ని తెర మీదకు తెచ్చినట్లు కనబడుతున్నది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రసిడెంట్ గా ఉన్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ప్రచారం చేపట్టారు.

తెలంగాణలోని దక్షిణ తెలంగాణలో రేవంత్ విషయంలో ఉన్నంత పాజిటీవ్ ఒపీనియన్ ఉత్తర తెలంగాణలో లేదన్న చర్చ ఉంది. దీంతో ప్రచారంలో భాగంగా ఎక్కడైనా టిఆర్ఎస్ వర్గాలు దాడి చేస్తాయేమో అన్న అనుమానాలు కాంగ్రెస్ పార్టీలోనూ నెలకొన్నాయి. మరి రేవంత్ రక్షణ విషయంలో ఎన్నికల కమిషన్ ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది.