ఎన్నారై సైదిరెడ్డికి టిఆర్ఎస్ టికెట్ ఇస్తే తరిమి కొడతాం (వీడియో)

హుజూర్ నగర్ టిఆర్ఎస్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. అసెంబ్లీ రద్దైన రోజే కేసిఆర్ 105 మందితో భారీగా అభ్యర్థుల జాబితా రిలీజ్ చేశారు. అందులో పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిథ్యం వహించిన హుజూర్ నగర్ సీటును కేసిఆర్ ప్రకటించలేదు. ఈ స్థానంలో 2014 ఎన్నికల్లో తెలంగాణ అమరుడు శ్రీకాంత చారి తల్లి శంకరమ్మను పోటీకి దించారు కేసిఆర్. అయితే ఆమె ఉత్తమ్ చేతిలో ఓడిపోయింది.

ఈసారి హుజూర్ నగర్ సీటు ఎవరికి ఇస్తారన్నదానిపై పీఠముడి పడింది. గతంలో పోటీ చేసిన శంకరమ్మ మళ్లీ తాను పోటీకి సై అంటున్నది. వందకు వంద శాతం తనకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నది. అయితే జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి అనుచరుడు అయిన సైదిరెడ్డికి టికెట్ ఇచ్చేందుకు కసరత్తు జరుగుతున్నది. సైదిరెడ్డి మంచి ఆర్థిక పరిపుష్టి ఉన్న నాయకుడిగా ముద్ర పడ్డారు. ఆయనకు సీటు ఇప్పించేందుకు మంత్రి జగదీష్ రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో సైదిరెడ్డికి టికెట్ ఇస్తే హుజూర్ నగర్ పొలిమేరల దాకా తరిమికొడతామని శంకరమ్మ వార్నింగ్ ఇచ్చారు. హుజూర్ నగర్ లో ఎంతో మంది ఎన్నారైలు ఉండగా సైదిరెడ్డికి ఎందుకు టికెట్ ఇవ్వాలంటున్నారని ఆమె నిలదీశారు. ఆయన  సైదిరెడ్డి కాదు సైకో రెడ్డి అని కూడా శంకరమ్మ మండిపడ్డారు. అవినీతిపరుడైన సైదిరెడ్డి తెలంగాణ కోసం ఏం చేసిండో చెప్పాలని ఆమె సవాల్ విసిరారు.

టిఆర్ఎస్ అధినేత, మంత్రి జగదీష్ రెడ్డితో శంకరమ్మ

అయితే శంకరమ్మ హుజూర్ నగర్ సీటు తనకే ఇవ్వాలంటూనే మరో కొత్త ప్రతిపాదన కూడా తెర మీదకు తెచ్చారు. తనకు ఇచ్చినా సరే.. లేదంటే ఇతర ఈక్వేషన్లు సరిపోకపోతే అప్పిరెడ్డికి ఇచ్చినా సరే గెలిపించుకుంటామని ఆమె శపథం చేశారు. కానీ సైదిరెడ్డికి టికెట్ ఇస్తే మాత్రం తరిమి కొడతామని ఘాటుగా హెచ్చరించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఓడించే సత్తా తనకే ఉందని స్పష్టం చేశారు. సైదిరెడ్డి కాదుగదా ఆయన అయ్య దిగొచ్చినా ఉత్తమ్ ను ఓడించలేరన్నారు.

అప్పి రెడ్డి ఎవరంటే..?

అన్నపరెడ్డి అప్పిరెడ్డి గత 16 సంవత్సరాలుగా ఐటి, వ్యాపారంలో ఉన్నారు. అప్పిరెడ్డి అమెరికా, బ్రిటన్, దక్షిణాఫ్రికా లాంటి దేశాల్లో వివిధ సంస్థల్లో పనిచేశారు. స్కైరెక్ ఇండియా అనే సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ గా అప్పిరెడ్డి పనిచేస్తున్నారు. ఇందులో 500 మంది పనిచేస్తున్నారు. అప్పిరెడ్డి సూర్యాపేట జిల్లా వాస్తవ్యుడు. అందుకే ఈయనకు టికెట్ ఇవ్వాలని శంకరమ్మ డిమాండ్ చేస్తున్నారు.

శంకరమ్మ డిమాండ్ తో ఇరకాటంలో టిఆర్ఎస్ పెద్దలు 

అమరుడు శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ డిమాండ్ తో టిఆర్ఎస్ అధిష్టానం ఇరకాటంలోకి నెట్టబడ్డది. నిన్నమొన్నటి వరకు అక్కడ సైదిరెడ్డికి టికెట్ ఖాయం అన్న ప్రచారం సాగింది. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి అండదండలు సైదిరెడ్డికి పుష్కలంగా ఉండడంతో టికెట్ కు ఢోకా లేదనుకున్నారు సైదిరెడ్డి అనుచరులు. కానీ శంకరమ్మ సీరియస్ వార్నింగ్ ఇవ్వడం టిఆర్ఎస్ వర్గాల్లో కలవరం రేగింది. టిఆర్ఎస్ పార్టీ 105 సీట్లు ప్రకటించగా మిగిలిన 14 సీట్లలో క్లిష్టంగా ఉన్న తొలి సీటు హుజూర్ నగరే అని చెబుతున్నారు. మరి అటు చూస్తే మంత్రి అండదండలు, ఇటు చూస్తే ఉద్యమకారుల హెచ్చరికలు.. లాస్టు కు హుజూర్ నగర్ సీటు విషయంలో  ఏం జరుగుుతందో చూడాలి.

శంకరమ్మ మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.

shankaramma warning