కేసిఆర్ కొత్త స్కెచ్, 107 మంది టిఆర్ఎస్ అభ్యర్థులకు టెన్షన్

టిఆర్ఎస్ లో ఎన్నికల కోలాహలం జోరందుకున్నది. ఇప్పటికే 107 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు కేసిఆర్.

వారంతా ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. అంతేకాదు ప్రచారమంతా ఏకపక్షంగా సాగుతున్నది. ప్రత్యర్థి పార్టీ ఏదో తెలియదు, ప్రత్యర్థి నేత ఎవరో తేలలేదు. దీంతో ఫీల్డులో టిఆర్ఎస్ అభ్యర్థులు ఒక్కరే బ్యాటింగ్, బౌలింగ్ చేసుకుంటున్నారు.

ఆదివారం సాయంత్రం 107 మంది అభ్యర్థులకు కేసిఆర్ బి ఫారాలు అందజేయనున్నారు. ఇప్పటికే 107 బిఫామ్స్ మీద పార్టీ అధినేత హోదాలో కేసిఆర్ సంతకాలు కూడా చేసి సిద్ధం చేశారు. అసెంబ్లీ రద్దు అనంతరం 105 మంది అభ్యర్థులను కేసిఆర్ ప్రకటించారు. తర్వాత మరో ఇద్దరిని ఖరారు చేశారు. వారంతా ఆదివారం సాయంత్రం బి ఫారాలు అందుకోబోతున్నారు.

అయితే బి ఫారాలు తీసుకున్న వారిని ఒక విషయం కొద్దిగా కలవర పెడుతున్నట్లు కనబడుతున్నది. చాలా అంటే చాలా చాలా ముందు చూపుతో కేసిఆర్ ఈ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఆ స్కెచ్ ఏంటబ్బా అనుకుంటున్నారా? బిఫారాలు చేతికి అందగానే కేసిఆర్ 107 మంది అభ్యర్థుల చేత తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహం ముందు అభ్యర్థుల చేత ప్రమాణం చేయిస్తారట. ఈ ప్రమాణం చేయించే పద్ధతి గతంలో లేదు. కొత్తగా ఈ పద్ధతి ఎందుకు ప్రవేశ పెట్టారబ్బా అన్న చర్చ టిఆర్ఎస్ అభ్యర్థుల్లో మొదలైంది.

ప్రమాణ కార్యక్రమం కొత్తగా ఏర్పాటు చేసినా ఈ ప్రమాణంలో ఏ అంశాలు ఉంటాయి? అన ఆందోళన కూడా అభ్యర్థుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రయోజనాల కోసం కట్టుబడి పనిచేస్తాం, తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణ ద్రోహుల పట్ల అప్రమత్తతతో ఉంటామని ప్రమాణం చేయించే అవకాశాలున్నట్లు పార్టీలో టాక్ నడుస్తోంది.

ఇలా ప్రమాణం చేయించడం ద్వారా రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ పూర్తిస్థాయిలో మెజార్టీ వస్తే ఏ చిక్కూ లేదు. లేదంటే ఒకవేళ  హంగ్ వచ్చినా, టిఆర్ఎస్ అధికారం కోల్పోయినా అభ్యర్థులు క్షణం ఆలస్యం చేయంకుడా వేరే పార్టీలోకి గోడ దూకే ప్రయత్నం చేయకుండా ఉండేందుకే ఈ ముందస్తు ప్రమాణాల పర్వానికి తెర తీస్తున్నట్లు సమాచారం అందుతోంది.

నిజానికి 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ కు వచ్చిన సీట్లు 63 మాత్రమే. కానీ బొటి బొటి మెజార్టీతో ఉన్న టిఆర్ఎస్ సర్కారును ఆంధ్రాశక్తులు కుట్ర చేసి కూలదోస్తాయన్న భయంతో ఆపరేషన్ ఆకర్ష్ కు కేసిఆర్ తెర తీశారు. దీంతో ఈ పార్టీ ఆ పార్టీ అన్న తేడా లేకుండా ఆకర్ష్ వలలో చిక్కిపోయారు. వైసిపి, కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, బిఎస్పీ, పార్టీల సభ్యులు ఆకర్ష్ మంత్రంలో చిక్కి గులాబీ గూటికి చేరిపోయారు. వారు చేరికకు పెట్టుకున్న అందమైన పేరే బంగారు తెలంగాణ. ఆ లక్ష్యంతోనే తాము టిఆర్ఎస్ లోకి వచ్చినట్లు వారు చెప్పుకున్నారు.

ప్రస్తుతం టిఆర్ఎస్ లో రెండు బలమైన వర్గాలు ఉన్నాయి. అందులో ఒకటి ఉద్యమ తెలంగాణ బ్యాచ్ గా, మరొకటి బంగారు తెలంగాణ (బిటి) బ్యాచ్ గా ఉన్నాయి. ఉద్యమ తెలంగాణ బ్యాచ్ లో ఉన్న నేతలంతా కేసిఆర్ తో కలిసి ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. కానీ బిటి బ్యాచ్ సంఖ్య పార్టీలో పెరిగిపోయింది. ఆకర్ష్ దెబ్బతో వచ్చిన వారంతా బిటి బ్యాచ్ నేతలే.

రేపు ఒకవేళ ఏదైనా జరిగి కిందా మీద అయితే ఉద్యమ తెలంగాణ బ్యాచ్ కేసిఆర్ తో ఉంటుందో ఉండదో కానీ బిటి బ్యాచ్ మాత్రం క్షణం ఆలస్యం చేయకుండా ప్లేట్ ఫిరాయించి పక్క పార్టీల్లోకి జంప్ చేసే చాన్స్ లు ఉన్నాయి. ఎందుకంటే వారికి టిఆర్ఎస్ విధానాలు కానీ, టిఆర్ఎస్ కమిట్ మెంట్ తో కానీ పనిలేదు. కేవలం అధికార పార్టీలో ఉండడం అదొక పాషన్ గా భావించి వచ్చి చేరారు. రేపు వారంతా ఏ పార్టీ అధికారంలో ఉంటే అటు జంప్ చేయరన్న గ్యారెంటీ లేదు.

అందుకోసమే కేసిఆర్ బిఫారాలు చేతిలో పడిన వెంటనే తెలంగాణ తల్లి ముందు అందరి చేత ప్రమాణం చేయించబోతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది.

మరి ఈ ప్రమాణాలు ఏమేరకు సక్సెస్ అవుతాయన్నది వేచి చూడాలి. ఇవాళ ప్రమాణం చేసిన వారు రేపు పార్టీ మారడానికి ఇంకో కారణమేదో చూసుకుని జంప్ చేయరన్న గ్యారెంటీ ఏంటన్న చర్చ కూడా ఉంది.

ఏది ఏమైనా కొత్త సాంప్రదాయాన్ని తీసుకురావడం మాత్రం మంచిదే అంటున్నారు గులాబీ నేతలు.