తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కాళేశ్వరం మళ్లీ హాట్ టాపిక్ అయింది. ఈ ప్రాజెక్టుపై న్యాయ విచారణ జరుపుతున్న కమిషన్ ముందు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాజరై, తన వైఖరిని స్పష్టంగా చెప్పిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. “నా కణతపై తుపాకీ పెట్టినా కూడా నిజమే మాట్లాడతా” అని ఆయన చేసిన వ్యాఖ్యలు సుదీర్ఘంగా గంపెడాశలతో కూడిన రాజకీయ దుమారం పుట్టిస్తున్నాయి.
ఈటల స్పష్టంగా చెప్పారు.. “కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావులకే తెలియని అంశం లేదన్నంతగా ఉన్నది. నేను ఆర్థిక మంత్రిగా ఉన్నా ఆ ప్రాజెక్టులో నాకు ఎలాంటి పాత్ర లేదు.” ప్రాజెక్టు రీడిజైనింగ్ బాధ్యతలను హరీశ్ రావు నేతృత్వంలోని సబ్ కమిటీకి అప్పగించారని గుర్తుచేశారు.
ప్రాజెక్టు ఖర్చుల విషయానికొస్తే, మొదట రూ.63 వేల కోట్లతో ప్రారంభమైన ప్రతిపాదనలు, తర్వలోనే రూ.82 వేల కోట్ల దాకా వెళ్లాయని వెల్లడించారు. కమిషన్ రుణాలపై ఆర్థికశాఖ ప్రమేయాన్ని ప్రశ్నించగా, తాను స్పష్టంగా ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉన్న అంశమేనని సమాధానం ఇచ్చినట్టు వెల్లడించారు. అంతేకాదు, రాజకీయ నాయకులకు ఆనకట్టల నిర్మాణంపై సాంకేతిక అవగాహన ఉండకపోవడం సహజమేనని తెలిపారు.
ఈటల తేల్చిచెప్పిన మరో అంశం.. “ఏ పదవిలో ఉన్నా, నైతిక విలువలు పాటించాను. ఈ అంశాన్ని ఎవరూ రాజకీయ లబ్దికోసం వాడుకోకూడదు. ప్రాజెక్టు నష్టాలకు కారణమైన వారిని తప్పించవద్దు. వారిపై చర్యలు తీసుకోవాలి.” ఆయన వ్యాఖ్యలు కేసీఆర్ ప్రభుత్వ వ్యవస్థపై ప్రశ్నార్థకాన్ని మిగిల్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం జరిపే న్యాయ విచారణలో నిజాలు వెలుగులోకి వస్తే, కాళేశ్వరం పై తెర వెనక దాగిన కధలు బయటపడే అవకాశముంది.