ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఫుల్ దూకుడుమీదున్న నేతల్లో రేవంత్ ఒకరు. ఫుల్ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రేవంత్ రెడ్డి… కేసీఆర్ పై మాస్ డైలాగులు విసరడంలో ఎలా ఫుల్ మార్కులు కొట్టేస్తుంటారో.. చలోక్తులూ, పిట్ట కబుర్లు చెబుతూ కంటేంట్ ను డెలీవరీ చేయడంలోనూ అదే ఉత్సాహం ప్రదర్శిస్తుంటారు. ఇందులో భాగంగా తాజాగా ఆయన చెప్పిన ఐశ్వర్యా రాయ్, కల్పనారాయ్ కబుర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఎప్పుడూ ఘాటైన విమర్శలేనా.. ఇప్పుడు కాస్త డిఫరెంట్ గా మాట్లాడుదామని భావించారో ఏమో కానీ… తాజాగా తెలంగాణ బీజేపీని టార్గెట్ చేస్తూ హీరోయిన్ల ప్రస్తావన తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి. చాలా సీరియస్ గా ప్రెస్ మీట్ లో రాజకీయాల గురించి మాట్లాడుతున్న టైంలో సడన్ గా ఇలా మాట్లాడటంతో కొందరు మీడియా ప్రతినిధులు అవాక్కయితే.. ఇంకొందరేమో నవ్వేసి ఊరుకున్న పరిస్థితి. ఇంతకూ ఐశ్వర్యా రాయ్, కల్పనా రాయ్ లను ప్రస్థావించడం ఎందుకంటే… పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో తెలంగాణ బీజేపీ చేరికల కమిటీ భేటీ అవ్వడం.
పొంగులేటి, జూపల్లి తో తాజాగా టి.బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ భేటీపై ఓ రిపోర్టర్ రేవంత్ ను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన రేవంత్… “చూడమ్మా.. నీకు పెళ్లయ్యింది కదా.. మనం పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు.. పెళ్లి చూపులకు వెళ్లినప్పుడు ఒక్క నువ్వనే కాదు.. నేను కూడా ఐశ్వర్యరాయ్ లాంటి అమ్మాయిని చేసుకోవాలని అనుకుంటా! చూడంగా.. చూడంగా చివరికి కల్పనారాయ్ దొరికినా సరిపెట్టుకుని పెళ్లి చేసుకుంటాం. ఈటల రాజేందర్ చేరికల కమిటీ కూడా అలాంటిదే. పొంగులేటిని చేసుకోవాలని, జూపల్లిని చేర్చుకోవాలని ఇంకా గొప్ప గొప్ప వ్యక్తులను చేర్చుకోవాలని బయల్దేరుతారు.. కానీ చివరాకరికి.. ఏమవుతుందో.. ఎలాంటి వారు పార్టీలో చేరుతున్నారో అందరికీ తెలుసు” అని నవ్వుతూ ముగించారు రేవంత్!
ప్రస్తుతం ఈ కామెంట్లు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ అవుతున్నాయి.