టిఆర్ఎస్ డిఎస్ కొడుకుపై లైంగిక వేధింపుల ఫిర్యాదు

టిఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కొడుకు ధర్మపురి సంజయ్ మీద మళ్లీ లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. బాధిత అమ్మాయిలు ఏకంగా తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రగతిశీల మహిళా సమాఖ్య (పిఓడబ్ల్యూ) అధ్యక్షురాలు సంధ్య బాధిత విద్యార్థినిలను తీసుకుని సచివాలయానికి వచ్చి హోంమంత్రికి వినతిపత్రం సమర్పించారు.

వినతిపత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం డిఎస్ పెద్ద కొడుకు ధర్మపురి సంజయ్ ప్రస్తుతం శాంకరీ నర్సింగ్ కళాశాల నడుపుతున్నారు. ఆ కళాశాలలో 2018 జనవరిలో అడ్మిషన్లు పొందారు. నర్సింగ్ కోర్సు ప్రథమ సంవత్సరంలో మొత్తం 13 మంది విద్యార్థినలు జాయిన్ అయ్యారు. వారితో కళాశాల ఛైర్మన్ సంజయ్ అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు విద్యార్థినిలు వినతిపత్రంలో పేర్కొన్నారు.

13 మంది ఆ కళాశాలలో జాయిన్ అయితే ఇప్పటి వరకు 11 మందిని లైంగికంగా వేధించినట్లు అమ్మాయిలు ఆరోపించారు. కొందరిని భూతు మాటలతో వేధించినట్లు ఆరోపించారు. కొందరు అమ్మాయిలను బలవంతంగా తన గెస్ట్ హౌస్ కు తీసుకుపోయి దుస్తులు విప్పాలంటూ వేధించాడని ఆరోపించారు. విద్యార్థినిలు హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డికి ఇచ్చిన రెండు పేజీల వినతిపత్రం కింద ఉంది చదవండి.

గతంలోనూ లైంగిక వేధింపుల ఆరోపణలు

డిఎస్ పెద్ద కొడుకు ధర్మపురి సంజయ్ మీద గతంలోనూ లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఇలాంటి ఆరోపణలు రావడంతో అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. శాంకరి నర్సింగ్ కాలేజీ అమ్మాయిలను అప్పట్లో లైంగికంగా వేధించినట్లు విమర్శలు వచ్చాయి. కానీ ఆ కేసు నిలబడలేదు. తర్వాత కేసు మాయమైపోయింది. ప్రస్తుతం కూడా సంజయ్ మీద అవే ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది. బాధిత విద్యార్థినిలు ఏకంగా హోంమంత్రి దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేయడం రాజకీయ వర్గాల్లో కలవరం రేగుతోంది.

జరిగిన ఘటనపై హోంమంత్రి సీరియస్ అయ్యారు. తక్షణమే దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిజిపి మహేందర్ రెడ్డికి ఆదేశాలిచ్చారు నాయిని. అయితే ఇందులో ఏమైనా రాజకీయ కోణం ఉందా అన్న చర్చలు కూడా అప్పుడే మొదలయ్యాయి. డిఎస్ అంటే గిట్టని వారు ఎవరైనా వెనుక ఉండి ఇలా అమ్మాయిలను హైదరాబాద్ పంపించి ఫిర్యాదు చేయించారా అన్న అనుమానాలు రేగుతున్నాయి.