గూగుల్ పేలో లక్ష కొట్టిన నిజామాబాద్ వాసి !

గూగుల్ పే ద్వారా లావాదేవీలు చేసేవారు రివార్డుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఎవరికైనా డబ్బులు పంపాక వచ్చే స్క్రాచ్ కార్డు‌ను చూసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు.

కానీ చాలా సందర్భాల్లో నిరాశే మిగులుతుంది. కొన్ని సందర్భాల్లో స్క్రాచ్ కార్డు రివార్డు లభించించిన అది 100 రూపాయలలోపే ఉంటుంది. అతి కొద్ది సందర్బాల్లో మాత్రమే వంద రూపాయలకు పైగా రివార్డు లభిస్తోంది.

అయితే ఓ వ్యక్తి ఏకంగా లక్ష రూపాయల గూగుల్ పే రివార్డు లభించింది. లక్ష రూపాయల రివార్డు లభించడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన నాగమల్ల సంపత్ నగరంలో ఖిలీల్ వాడీలో సౌమ్య కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ నిర్వహిస్తున్నాడు.

సంపత్ తన బ్యాంక్, కిరాణా షాపు లావాదేవీలను నిర్వహించడానికి గూగుల్ పే బిజినెస్ యాప్ ‌ను వినియోగిస్తున్నాడు. రోజువారి తన లావాదేవీలను ఆ యాప్ ద్వారానే చేపడుతున్నాడు. సోమవారం కూడా ఓ లావాదేవీని చేసిన సంపత్‌ కు స్క్రాచ్ కార్డు వచ్చింది. అందులో ఏముందో చూడగా.. రూ. లక్ష రూపాయలు రివార్డు వచ్చినట్టు కనిపించింది. దీనితో సంపత్ ఒక్కసారిగా లక్ష రూపాయలు రావడంతో ఆశ్చర్యంలో మునిగిపోయాడు.