భారతీయ జనతా పార్టీ శరవేగంగా ప్రణాళికలు రచిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో చేసినట్టే తెలంగాణాలో కూడ తమ ట్రేడ్ మార్క్ రాజకీయాన్ని అవలంభించాలని చూస్తోంది. ఇప్పటికే దుబ్బాక ఎన్నికల్లో గెలిచి, గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటడంతో బీజేపీకి బలమైన పార్టీ అనే గుర్తింపు వచ్చింది. తెరాసకు ప్రత్యామ్నాయం తామే అనే అభిప్రాయాన్ని ప్రజల్లో ఏర్పరచగలిగారు వారు. ప్రజల్లోనే కాదు తెరాస నాయకుల్లో కూడ ప్రయతామ్నాయ గుర్తింపు పొందారు. బీజేపీకి మొదటి నుండి ఒక అలవాటు ఉంది. అదేమిటంటే ఒక రాష్ట్రం మీద పట్టు సాధించడానికి పార్టీలో నాయకులు లేనప్పుడు వేరొక పార్టీ నుండి నాయకుల్ని లాక్కోవడం. ఈ పద్దతిని అనేక రాష్ట్రాల మీద ప్రయోగించి సఫలమైంది బీజేపీ.
ఇప్పటికే తెలంగాణలో కొందరు నాయకుల్ని ఆకర్షించిన బీజేపీ అస్సాం, బెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ నేతలు, కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ నేతలు, మధ్యప్రదేశ్ రాష్ట్రం.. పలుచోట్ల ఈ వ్యూహాన్ని అమలుచేసి మంచి ఫలితాల్ని అందుకుంది బీజేపీ. అలాంటి వ్యూహాన్నే తెరాస మీద అమలుచేయాలని చూస్తోంది. ఇన్నాళ్లు తెరాసలోని నేతల్లో కేసీఆర్ అంటే ఒకరకమైన భయం ఉండేది. పదవులు దక్కినవారు కేసీఆర్ మీద విపరీతమైన భక్తి చూపిస్తే పదవులు దక్కనివారు అసంతృప్తి ఉన్నా సరే కేసీఆర్ అంటే అసామాన్యమైన లీడర్ అనే భావనతో మిన్నకుండిపోయేవారు. కానీ బీజేపీ ఇచ్చిన వరుస షాకులతో కేసీఆర్ అంటే అతీతమైన నాయకుడేమీ కాదని తేలిపోయింది. ఆయన మీదున్న భ్రమలన్నీ తొలగిపోయాయి.
ఇప్పుడు కేసీఆర్ కూడ అందరి లాంటి నాయకుడే. ఆయనకూ జయాపజయాలు ఉంటాయి. ఇదే తెరాస అసంతృప్తుల్లో ఒక విధమైన తెగింపును తీసుకొచ్చింది. అందుకే బీజేపీ వారిని ఈజీగానే టార్గెట్ చేస్తోంది. సుమారు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్ చెబుతున్నారు. ఈ తరహా మాటలు ఊపులో ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పేవే. అలాగని బండి మాటలను కొట్టిపారేయడానికి లేదు. నిజంగానే తెరాసలో అసంతృప్త ఎమ్మెల్యేలు పార్టీ మారే యోచన చేస్తున్నారేమో. ఇప్పుడిప్పుడే తెరాస భవితవ్యం మీద నమ్మకాలు పోతున్నాయి. బీజేపీ అమాంతం తెరాసను ముంచేస్తుందా అనే అనుమానాలున్నాయి చాలామందిలో. బీజేపీలో ఉంటే రానున్న రోజుల్లో భవిష్యత్తు బ్రహ్మండంగా ఉంటుందనే భావన మొదలైంది.
ఈ భావనతో భవిష్యత్తును వెతుక్కుంటూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరైతే ఈ ఫిరాయింపుల పర్వం ఎప్పుడు మొదలవ్వొచ్చు అంటే నాగార్జున సాగర్ ఎన్నికల తర్వాత అని చెప్పొచ్చు. ఈ ఉప ఎన్నికలో గెలవాలని తెరాస, కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా సృష్టి చేస్తున్నాయి. వాటిలో నెగ్గి తెరస పట్టు నిలుపుకుంటే పర్వాలేదు. ఒకవేళఓడిపోయి బీజేపీయే గనుక గెలిస్తే ప్రజెంట్ పార్టీ మారాలనే కోరిక ఉన్నారంతా బీజేపీ ఎదుగుదలను కన్ఫర్మ్ చేసేసుకుని అప్పుడు పెట్టె బేడా సర్దేసుకుంటారు. అలాగే వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు తేడా కొడితే తెరాస నుండి వలసలు ఇంకాస్త పెరిగే అవకాశముంది.