తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి దూకుడు మీద ఉన్న టిఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. కార్మిక సంఘం ఎన్నికల్లో ప్రత్యర్దుల చేత టిఆర్ఎస్ కార్మిక సంఘం ఘోర పరాజయం పాలైంది. మాజీ మంత్రి హారీష్ రావు వర్గం ప్రత్యర్దుల ఎత్తుల ముందు చతికిల పడింది. అసలు వివరాలు ఏంటంటే…
సంగారెడ్డి జిల్లాలోని సదాశివ పేట మండలంలో ఎంఆర్ ఎఫ్ పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమలో కార్మిక సంఘ ఎన్నికలు హోరాహోరిగా సాగుతాయి. ఈ పరిశ్రమ నుంచి ఓ సారి కార్మిక సంఘ అధ్యక్షుడుగా హరీష్ రావు కూడా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత మాజీ డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి భర్త దేవేందర్ రెడ్డి రెండు సార్లు అధ్యక్షునిగా గెలిచారు. 2011 నుంచి టిఆర్ఎస్ హవానే కొనసాగుతుంది.
బుధవారం నాడు కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయి. టిఆర్ఎస్ కార్మిక సంఘం తెలంగాణ మజ్దూర్ సంఘ్ నుంచి దేవేందర్ రెడ్డి బరిలోకి దిగారు. కాంగ్రెస్ బలపరిచిన కేపిఎస్, సిఐటియూ కూటమిగా బరిలోకి దిగాయి. కంపెనీలో మొత్తం 1788 ఓట్లు ఉన్నాయి. అందులో టిఎంఎస్ అభ్యర్ది దేవేందర్ రెడ్డికి 451 ఓట్లు రాగా బిఎంఎస్ బలపరిచిన మల్లేషానికి 500 ఓట్లు వచ్చాయి. కేపిఎస్, సిఐటియూ కూటమికి 821 ఓట్లు వచ్చాయి. దీంతో కూటమి విజయం సాధించింది. అధ్యక్షునిగా సిఐటియూ నేత చుక్క రాములు ఎన్నిక కాగా, ప్రధాన కార్యదర్శిగా కేపిఎస్ నుంచి కొత్తగొల్ల చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. కూటమి విజయం సాధించడంతో కంపెనీ ముందు బాణాసంచా పేల్చి సంబరాలు నిర్వహించారు.
కంపెనీలో విజయం సాధించిన విషయం తెలుసుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అక్కడకు చేరుకున్నారు. కార్మికులతో కలిసి విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. గెలిచిన అభ్యర్దులకు ఆయన అభినందనలు తెలిపారు. నమ్మకంతో గెలిపించిన కార్మికులకు రుణపడి ఉంటామని, కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.
ఎనిమిదేళ్లుగా ఎంఆర్ఎఫ్ కంపెనీలో ఎదురులేని సంఘంగా ఎదిగిన టిఎంఎస్ ఓడిపోవడంతో టిఆర్ఎస్ శ్రేణులు షాక్ కు గురయ్యారు. ప్రతి ఎన్నికల్లో చక్రం తిప్పిన హరీష్ రావు ఈ సారి ఎన్నికల పై పూర్తిస్థాయి ఫోకస్ చేయకపోవడం, ప్రచారానికి కూడా రాకపోవడం చర్చనీయాంశమైంది. హరీష్ వర్గానికి చెందిన మాజీ డిప్యూటి స్పీకర్ భర్త దేవేందర్ రెడ్డి ఓటమి పాలు కావడం పార్టీ వర్గాలను కలవరపెడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి కార్మిక సంఘం ఎన్నికల్లో ఓడిపోవడమేంటని అంతా చర్చించుకుంటున్నారు. మొత్తానికి హారీష్ వ్యూహాలు కూడా పని చేయలేదని నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల కాలంలో టిఆర్ఎస్ లో హారీష్ రావుకు ప్రాధాన్యత తగ్గుతుందన్న చర్చ కార్యకర్తల్లో జోరుగా సాగుతుంది. కేటిఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేయడంలో కూడా హరీష్ రావు ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నమేనన్న వాదన కార్యకర్తల్లో ఉంది. ఆయన ఏ ఎన్నికల్లో ప్రచారం చేసినా ఘనవిజయం సాధించే చాతురత ఆయనది. అటువంటిది కేవలం ఓ కంపెనీలో కార్మిక సంఘం ఎన్నికల్లో… అది హారీష్ వర్గం ఓడిపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని నేతలు అంటున్నారు.