తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై అధికార టిఆర్ఎస్ పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. ముగ్గురు టిఆర్ఎస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. ఎప్పటిలాగే పరుషమైన పదజాలం, తీవ్రమైన మాటలతో వాయించేశారు. ఆ విమర్శలు చేసిందెవరు? వివరాలేంటి అనుకుంటున్నారా? చదవండి. సోమవారం టిఆర్ఎస్ ఎల్పీ ఆఫీసులో ఆ పార్టీ ఎంపి బాల్క సుమన్, ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, దాసరి మనోహర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వారు ఏమన్నారంటే…
ఎంపీ బాల్క సుమన్ :
ఉత్తమ్ అసంబద్ధమైన ,అనవసరమైన నిరాధారమైన ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ అబద్ధాల పై మేము విడమరిచి చెప్పేటప్పటికి కాంగ్రెస్ నేతలు అసహనం ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో సీనియారిటీ కన్నా సిన్సియారిటీ ముఖ్యం. మా నాయకుడు కేటిఆర్ కు సీనియారిటీ లేకున్నా సిన్సియారిటీ ఉంది. టిఆర్ఎస్ కు ప్రజలకు అంకిత భావం తో పాలన అందించడం తప్ప మరో పని లేదు. కేటిఆర్ సహా నేతలంతా ఉద్యమ కేసుల్లో తిరుగుతుంటే కాంగ్రెస్ నేతలు అవినీతి కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. దేశం లో కాంగ్రెస్ నేతలంతా అవినీతి కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. .ఉత్తమ్ పచ్చ కామెర్లు ఉన్న వాడిలా వ్యవహరిస్తున్నారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో పాటియాలా హౌస్ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఉత్తమ్ కారులో మూడు కోట్ల రూపాయలు కాల్చింది నిజం కాదా? డబ్బు మదం తో ఉద్యమకారుడు శ్రీకాంత చారి తల్లిని ఉత్తమ్ ఓడించలేదా ? కేటిఆర్ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిని కేసులు ఎదుర్కొంటున్నారు ..దీనికి సాక్ష్యాలెన్నో ఉన్నాయి. ఉత్తమ్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారనడానికి ఒక్క ఆధారాన్నయినా చూపగలరా ? జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలవక పోతే రాజకీయ సన్యాసం చేస్తానని కేటిఆర్ సవాల్ విసిరి మరీ పార్టీ ని గొప్పగా గెలిపించారు. తెలంగాణ లో పారిశ్రామిక ప్రగతి ని పరుగులెత్తించడం కేటిఆర్ వల్లే సాధ్యపడింది. ప్రపంచ యవనిక మీద హైదరాబాద్ చిత్రపటాన్ని నిలబెట్టింది కేటిఆరే. టి హబ్ కేటిఆర్ ఆలోచన నుంచి పుట్టిందే. దోచుకోవడం, దాచుకోవడం కాంగ్రెస్ కు అలవాటే. కేటిఆర్ లాగా రాహుల్ ఉద్యమంలో పాల్గొన్న ఒక్క ఫోటో నైనా ఉత్తమ్ చూపగలరా ? ఉత్తమ్ సభ్యత సంస్కారం తో మాట్లాడాలి. ఉత్తమ్ ఆపద మొక్కుల హామీలు బంద్ చేయాలి. పంజాబ్ లో కాంగ్రెస్ రుణమాఫీ అమలు ఏమయ్యింది ? తెలంగాణ లో డిపాజిట్లు దక్కించుకొనేందుకే ఉత్తమ్ పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు. .ఉత్తమ్ పిచ్చి మాటలు మానక పోతే ప్రజలు తగిన బుద్ది చెబుతారు. ప్రజలకు ఎలా మేలు చేయాలని టిఆర్ఎస్ ఆలోచిస్తుంటే ఎలా దోచుకోవాలనేదే కాంగ్రెస్ ఆలోచన. తెలంగాణ అభివృద్ధి ని అడ్డుకోవాలన్నదే కాంగ్రెస్ విధానం. కాంగ్రెస్ ఎంత అడ్డు పడ్డా మా అభివృద్ధి అడుగులు ముందుకే పడతాయి.
ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి :
ఉత్తమ్ ఫేస్ బుక్ లైవ్ పేరిట ఫేక్ మాటలు, ఫాల్తూ మాటలు మాట్లాడుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు ఉత్తర కుమార్ రెడ్డి అనిపించుకున్నారు. ఒక్క హామీ టిఆర్ఎస్ అమలు చేయలేదంటున్న ఉత్తమ్ కంటి వెలుగు లో తన కండ్లు పరీక్షించుకోవాలి. ఉత్తమ్ కల్లు తాగిన కోతిలా ప్రవర్తిస్తున్నారు. నల్లగొండ జిల్లా లో ఉత్తమ్ లాంటి మతి తప్పిన నేత ఉండటం దురదృష్టకరం. ఉత్తమ్ గుడ్డిగా మాట్లాడితే ప్రజలు ఆయనకు గడ్డి పెడుతారు. కేటిఆర్ యువ నేతగా అందరిని మెప్పించి ఒప్పించి అభివృద్ధి చేస్తున్నారు. కానీ ఉత్తమ్ మాత్రం జోకర్ లా, బ్రోకర్ లా మాట్లాడుతున్నారు. టిఆర్ఎస్ గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతోంది. కాంగ్రెస్ నేతలు తాము దోచుకుని దాచుకున్న డబ్బును కేరళ లో బాధితులకు పంచితే మంచిది. కేటిఆర్ తన పనితీరు తో అందనంత ఎత్తుకు ఎదిగారు. రాహుల్ లా కేటిఆర్ పారాచూట్ రాజకీయ నేత కాదు. పాలనలో, నిబద్ధతలో కేటిఆర్ నిప్పులాంటి మనిషి. నిప్పుతో చెలగాటం ఉత్తమ్ కు మంచిది కాదు. మా ప్రభుత్వం మీద చేస్తున్న ఒక్క ఆరోపణను కూడా కాంగ్రెస్ రుజువు చేయలేక పోయింది. ఉత్తమ్ కు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయం. తీరు మార్చుకోకుంటే ఉత్తమ్ కు మేము కూడా బుద్ధి చెబుతాం.
ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి :
ఉత్తమ్ ఫేస్ బుక్ లైవ్ లో కేటిఆర్ పై చేసిన వ్యాఖ్యలు నిరాధారం. కేటిఆర్ వయసులో చిన్నవాడే కావచ్చు, కానీ వ్యక్తిత్వంలో హిమాలయాల అంతటి వాడు. కేటిఆర్ తెలంగాణ కోసం ఎంత కష్టపడుతున్నారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కేటిఆర్ పై అనవసర విమర్శలు చేసి ఉత్తమ్ తన స్థాయిని దిగజార్చుకోవద్దు.
ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ :
ఉత్తమ్ ప్రజల్లోకి వచ్చి మొహం చూపించుకోలేకనే ఫేస్ బుక్ లైవ్ లో అవాకులు చవాకులు పేలుతున్నారు. కేటిఆర్ ఉద్యమం నుంచి వచ్చారు. పదవులకు అర్హత ఎవరికుందో ప్రజలు తేల్చాలి ఉత్తమ్ కాదు . డబ్బులు ఇచ్చి ఓట్లు దండుకోవడం కాంగ్రెస్ నేతలకే చెల్లింది. 2009 కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక్కసారి ఉత్తమ్ చదువుకుని 2014 టిఆర్ఎస్ మేనిఫెస్టో గురించి మాట్లాడాలి. మేము నెరవేర్చని హామీ ఒక్కటయినా ఉందా ? కార్లో నోట్ల కట్టలతో దొరికింది ఉత్తమ్ కాదా ? ఉత్తమ్ కు ఓట్లేసి గెలిపించుకోవడం హుజుర్ నగర్ ప్రజల దురదృష్టం. కేటిఆర్ తో ఏ అంశం లోనైనా ఉత్తమ్ సరి తూగగలరా ? సబ్జెక్టు సిద్ధంగా లేదని అసెంబ్లీ చర్చ నుంచి పారిపోయిన వ్యక్తి ఉత్తమ్. ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఉత్తమ్ పిచ్చి ప్రేలాపనలు ఆపక పొతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. కాంగ్రెస్ కు వచ్చే ఎన్నికల్లో ప్రతి పక్ష హోదా కూడా రాదు . కాంగ్రెస్ లాగా సోనియాను మేము ఇటలీ నుంచి దిగుమతి చేసుకోలేదు ..కెసిఆర్ ప్రజల నుంచి ఉద్యమం నుంచి వచ్చారు.
మరో చోట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉత్తమ్ మీద, రాహుల్ గాంధీ మీద విరుచుకుపడ్డారు. ఆయనేమన్నారో చదవండి.
రాహుల్ గాంధీ బచ్చా. ఆ బచ్చా కింద పని చేస్తూ కేటీఆర్ ని బచ్చా అనే హక్కు ఉత్తమ్ కి లేదు. హనుమంతరావు వొళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఉరుకోము. ఉత్తమ్ కి రాజకీయాలలో ఏమి అనుభవం ఉంది..అని పిసిసి పదవిని వెలుగ బెడుతున్నావ్. తెలంగాణ ఉద్యమం ,ఐటీ లో తెలంగాణ రాష్ట్రం లో దూసుకుపోతున్న కేటీఆర్ ని విమర్శిస్తవా ? పార్లమెంట్ లో ఆలింగనం చేసుకోవడం..కన్ను గొట్టడం బచ్చా పనులు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు డ్వాక్రా మహిళలను పట్టించుకోలేదు. తెలంగాణ లో మిషన్ కాకతీయ ,భగీరథ తో పాటు ప్రజలందరిని అభివృద్ధి దిశగా నడిపిస్తుంటే విమర్శిస్తారా?