జగన్ వస్తున్నాడు… తెలంగాణలో జోరుగా ప్రచారం…

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఎక్కువగా కోరుకుంటున్నది తెలంగాణ రాష్ట్ర సమితి. టిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెశిడెంట్ కెటిరామారావు (కెటిఆర్) అవకాశమొచ్చినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ అధికారంలోకి వచ్చేది వైఎస్ ఆర్ సి అధినేత జగన్ మోహనే అని భరోసా ఇస్తుంటారు. జగన్ గెలుపు జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తుందని ఆయన చెబుతున్నారు. 

ఈ రోజు మహబూబా బాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారం చేస్తూ కూడా ఇదే ప్రకటించారు కెటిఆర్.
నర్సంపేట పట్టణంలో టిఆర్ ఎస్ మహబూబాబాద్ అభ్యర్థి మాలోత్ కవిత తరఫున ప్రచారం చేస్తూ ఆయన జగన్ గెలుపు, దాని పర్యవసానాల గురించి వివరించారు.

ఆంధ్రప్రదేశ్ లో కచ్ఛితంగా ఘనవిజయం సాధించేది వైఎస్ ఆర్ కాంగ్రెస్ యే నని ఆయన వ్యాఖ్యానించారు.

దీని పర్యవసానం దేశ రాజకీయల మీద కూడా ఉంటుందని ఆయన చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఏర్పాటుచేయాలనుకుంటున్న ఫెడరల్ ఫ్రంట్‌లోకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వస్తారని , ఆయన తమతోనే ఉంటారని కేటీఆర్ ధీమాగా చెప్పారు.

దేశంలో కాంగ్రెస్, బీజేపీ అంటే పడనోళ్లు చాలామంది ఉన్నారు, వారంత ఈ రెండు జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారని  ఆయన చెప్పారు. 

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నవీన్ పట్నాయక్, మమతాబెనర్జీ, అఖిలేష్ యాదవ్ కలిస్తే మొత్తం 150 స్థానాలు అవుతాయి. వీరందరితో ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటుచేసేందుకు కెసిఆర్ పనిచేస్తారని కేటీఆర్ అన్నారు.

నర్సంపేట సభలో కెటిఆర్

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ 16 లోక్‌సభ సీట్లు గెలిస్తే దిల్లీ గద్దెపై ఎవరు కూర్చోవాలో నిర్ణయించేది తెలంగాణ ప్రజలే నని కేటీఆర్ చెప్పారు.

కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలను కాపీ కొట్టి పేర్లు మార్చి మోదీ , చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని కెటిఆర్ విమర్శించారు.

చంద్రబాబు కూడా రైతుబంధును కాపీకొట్టాడు. ఆంధ్రా రైతులకు నాలుగు పైసలు ఇస్తున్నాడు అంటే అదీ కేసీఆర్‌ పుణ్యమే.

తర్వాత మోదీ గురించి మాట్లాడుతూ, ‘2014లో ఉన్న వాతావరణం ఈ రోజు దేశంలో లేదు. మోదీ నాయకత్వంలోని బిజెపి కి 150 సీట్లకు మించి రావు. రాహుల్ గాంధీ నడుపుతున్న కాంగ్రెస్‌కు 100 సీట్లు దాటవు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌, బీజేపీ అంటే ఇష్టం లేని పార్టీలయిన తృణమూల్‌ కాంగ్రెస్‌, బీఎస్పీ, ఎస్పీ, వైసీపీతో పాటు చాలా పార్టీలు మనకు (టిఆర్ ఎస్ ) అనుకూలంగా ఉన్నాయి. మనం కీలకం కాబోతున్నాం. దేశంలో జాతీయ పార్టీల ఉనికి లేదు,’ అని ఆయన అన్నారు.