సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్

సింగరేణి లాభాల్లో ఉద్యోగులకు 27 % వాటా

ఇక నుండి సింగరేణి కార్మికులు కాదు ఉద్యోగులు

బయ్యారం ఉక్కు సింగరేణి సంస్థకే

ఇతర మైనింగ్ లోనూ సింగరేణి దృష్టి పెట్టాలి

సింగరేణి సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్

2017-18 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ సాధించిన లాభాల్లో సింగరేణి కార్మికులకు 27 శాతం వాటా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. గత ఏడాది 25 శాతం వాటా ఇచ్చామని, ఈ సారి మరో రెండు శాతం పెంచి 27 శాతం వాటా కార్మికులకు ఇవ్వాలని సింగరేణి సిఎండి శ్రీధర్ ను సిఎం ఆదేశించారు. సింగరేణి అధికారులకు చెల్లించాల్సిన ఎనిమిదేళ్ల పిఆర్పి (పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే) బకాయిలను వెంటనే చెల్లించాలని సిఎం చెప్పారు. సింగరేణి అధికారులు హైదరాబాద్ లో ఇండ్లు నిర్మించుకోవడానికి అవసరమైన స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికుల మాదిరిగానే సంస్థలోని అందరు అధికారులు, ఉద్యోగులకు కూడా ఇంటి నిర్మాణం కోసం వడ్డీ లేకుండా పది లక్షల రూపాయల రుణాన్ని అందివ్వాలని అధికారులను ఆదేశించారు. ఇకపై సింగరేణిలో కార్మికులను వర్కర్లు అని పిలవవద్దని, వారిని కూడా ఉద్యోగులుగానే సంభోదించాలని సిఎం చెప్పారు. యాజమాన్యం, కార్మికులు వేర్వేరు అనే భావన విడనాడాలని, అంతా ఒక కుటుంబమనే భావన పెంపొందాలని సూచించారు.

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలు, ఎంపి కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్, టిబిజికెఎస్ నాయకులు ప్రగతి భవన్ లో బుధవారం ముఖ్యమంత్రిని కలిశారు. మాజీ సైనికుల సంక్షేమం కోసం సింగరేణి అధికారులు ఈ సందర్భంగా కోటి రూపాయల విరాళాన్ని సిఎం రిలీఫ్ ఫండ్ కు చెక్కు రూపంలో అందించారు. ఈ సందర్భంగా సిఎం నాయకులతో సమావేశమయ్యారు. గతంలో సింగరేణి ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. వాటిపట్ల కూడా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, వెంటనే నిర్ణయాలు ప్రకటించారు.

‘‘సింగరేణికి 120 సంవత్సరాల అనుభవం ఉంది. క్లిష్ట పరిస్థితుల్లో, ప్రతికూల వాతావరణంలోనూ పనిచేసే నేర్పు ఉంది. భూగర్భంలోని బొగ్గును వెలికితీసిన అనుభవం, పరిజ్ఞానంతో సింగరేణి సంస్థ మరింత ముందుకుపోవాలి. ఇతర మైనింగ్ రంగాలకు విస్తరించాలి. సింగరేణి సంస్థ ఇప్పటికే థర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి రంగాల్లోకి ప్రవేశించింది. రాష్ట్రంలో అపారంగా ఉన్న ఇసుక నిల్వలు, గ్రానైట్ నిల్వలను వెలికి తీయడానికి సింగరేణి ముందుకు రావాలి. బయ్యారం గనుల్లో కూడా తవ్వకాలు జరిపే బాధ్యతను సింగరేణికి అప్పగించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఏఏ రకమైన మైనింగ్ కార్యకలాపాల్లో సింగరేణి సంస్థ పనిచేయగలదనే విషయంపై అధ్యయనం చేసి, అధ్యయన పత్రం రూపొందించాలి. అనుభవం, పనితీరు ఉపయోగించుకుని సింగరేణి సంస్థ మరింత విస్తరించాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు.

మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, ఈటెల రాజెందర్, ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం జడ్పీ చైర్ పర్సన్ గాడిపల్లి కవిత , టిబిజికెఎస్ అధ్యక్ష కార్యదర్శులు వెంకట్రావు, రాజిరెడ్డి, కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ సింగరేణి బ్రాంచి అధ్యక్షుడు గాడిపల్లి కృష్ణ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఎన్.వి. రాజశేఖర్ రావు, నాయకులు టి.శ్రీనివాసరావు, పతంగి మోహన్ రావు, సముద్రాల శ్రీనివాస్, జనా జయరావు, ఎవి రెడ్డి, మంచాల శ్రీనివాస్, గీట్ల తిరుపతి రెడ్డి, జె.రాజశేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు.