ఆ బ్రదర్స్ 30 ఏండ్ల కింద కృష్ణా పుష్కరాల్లో తప్పిపోయినట్లు యాక్టింగ్

మొసలి కన్నీరు కార్చే మహా కూటమి నేతలకు కర్రు కాల్చి వాతలు పెట్టాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత యువతకు పిలుపునిచ్చారు. సోమవారం జగిత్యాల లో టిఆర్ఎస్ యువజన విభాగం ఏర్పాటు చేసిన సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత ను గజమాలతో సత్కరించారు యువజన నాయకులు. వీరనారి గెటప్ తలపాగా, కరవాలాన్ని కవితకు బహుకరించారు.

అనంతరం ఎంపి కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి కమిట్మెంట్ లేదని టీడీపీకి తెలంగాణ సెంటిమెంట్ లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ తో కాంగ్రెస్ జతకట్టి మహా కూటమిగా ఏర్పడడం ప్రజలు చీదరించుకుంటున్నారు అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం యువత భవిష్యత్తు కోసం ఆలోచన చేసి కార్యాచరణ అమలు చేస్తుందని తెలిపారు.

ఎన్నికల కోసం కాకుండా భవిష్యత్తు తరాల కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్న విషయం మీకందరికీ తెలుసు అన్నారు. మహా కూటమి పేరిట విపక్షాలు జట్టు కట్టి గారడీ చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆ పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎంపీ కవిత కోరారు. జగిత్యాల బ్రదర్స్ 30 ఏళ్ల కింద కృష్ణా పుష్కరాల్లో తప్పిపోయి నిన్న మహాకూటమిలో కలిసినట్లు ఆత్మీయ ఆలింగనం చేసుకుని ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎల్ రమణ కు ఓటమి తప్పదు అన్నారు. ఆయన చంద్రబాబు ఏజెంట్ అన్నారు. (ఎల్ రమణ, టి జీవన్ రెడ్డిని ఉద్దేశించి)

ప్రాంతీయ పార్టీలు ప్రజల గురించి ఆలోచన చేసే పార్టీలని అన్నారు జాతీయ పార్టీలకు మనము ఒక అంశం అని గుర్తించుకోవాలన్నారు. 2006, 2008లో కెసిఆర్ పై పోటీ చేసిన జీవన్ రెడ్డి వైఎస్ తో డబ్బుల మూట లు తీసుకుని ఓడిపోతే మంత్రి పదవి ఇవ్వాలని ఒప్పందం చేసుకొని ఎంపీగా పోటీ చేసిన విషయం మర్చిపోయారా అని ఎంపీ కవిత ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ నాయకునికి పోటీకి దిగిన జీవన్రెడ్డి ఉద్యమానికి వెన్నుపోటు పొడిచారని తెలిపారు.

మహబూబ్ నగర్ జిల్లా నీళ్లు దక్కకుండా తరలించుకుపోయే ప్రయత్నం చేసిన చంద్రబాబు గోదావరిలో 80 టీఎంసీల తెలంగాణకు అడ్డుపడుతున్న విషయాన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. మన సాగు నీళ్లను తరలించుకుపోయే వారు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.

2014 నుండి 18 వరకు ఒక లక్ష 9వేల ఉద్యోగాలభర్తీకి టిఆర్ఎస్ ప్రభుత్వం అనుమతిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చిందని ఎంపీ కవిత తెలిపారు.87 వేల ఉద్యోగాల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిందని 32 వేల 681 ఉద్యోగాలను భర్తీ చేసిందని వివరించారు. 2004 నుండి 2014 వరకు పదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేవలం 24 వేల పోస్టులు మాత్రమే భర్తీ చేసిందని విమర్శించారు 23 జిల్లాల 24000 పోస్టులు భర్తీ చేస్తే తెలంగాణ నిరుద్యోగులకు ఎంత నష్టం చేసిందో ఆ పార్టీ చెప్పాలని డిమాండ్ చేశారు.

టీఎస్ ఐపాస్ విధానం ద్వారా పరిశ్రమలకు భూతం ఇచ్చామని చెప్పారు. 8వేల పరిశ్రమల్లో గడిచిన నాలుగేళ్లలో ఒక లక్షా 34 వేల పెట్టుబడులు వచ్చాయని ఎనిమిదిన్నర లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని కవిత తెలిపారు. జగిత్యాల జిల్లాలో తెలంగాణ ఏర్పడడానికి ముందు పదిహేను రైస్ మిల్లులు ఉండేవని ఇప్పుడు 100 రైస్ మిల్లులు నడుస్తున్నాయని తెలిపారు.పారదర్శకమైన అవినీతి రహిత పాలన సమన్వయం చిత్తశుద్ధితో కూడిన పరిపాలన వల్లే తెలంగాణ పురోగమిస్తున్న విషయం గమనించాలని ఈ విషయాన్ని ప్రతి వ్యక్తికి తన బాధ్యత యువతపై ఉందని ఎంపీ కవిత అన్నారు.

నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ట్రైలర్ మాత్రమేనని మున్ముందు త్రీడీలో సినిమా మొత్తం చూపిస్తామని ఎంపీ కవిత తెలిపారు ఈ సూపర్ సినిమా చూసి దిమ్మతిరిగడం ఖాయమన్నారు.కరప్షన్ కు పుట్టిన కవల పిల్లలు టీడీపీ కాంగ్రెస్ పార్టీలకు కవిత అభివర్ణించారు. సత్య హరిచంద్రుని వారసులుగా చెప్పుకొనే టిడిపి నేతలు 50 లక్షల రూపాయలను పోలీసుల ద్వారా ఇక్కడికి చేరే విషయంపై మాట్లాడుతారని ప్రశ్నించారు. జగిత్యాలకు 50 కోట్ల స్పెషల్ ఫండ్ యోగం పై టిఆర్ఎస్ జగిత్యాల అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ ప్లానింగ్ రూపొందించారని వివరించారు. రోళ్ళ వాగు, బోర్నపల్లి బ్రిడ్జి నిర్మాణం టిఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే అవడం ఖాయమన్నారు జగిత్యాల మున్సిపాలిటీ కూడా టిఆర్ఎస్ అయితే అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని అన్నారు.

టిఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సురేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జగిత్యాల టిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్, నాయకులు బోగ వెంకటేశ్వర్లు, చకినం కిషన్, వల్లేపు మొగిలి, యూత్ నాయకులు డాక్టర్ భోగ ప్రవీణ్, అనిల్, అజిత్, వినయ్, కత్రోజి గిరి పాల్గొన్నారు.