కేసిఆర్ కేబినెట్ లో టిడిపి సండ్ర బెర్త్ పై డౌటనుమానం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినా, ఇంకా అసెంబ్లీలో సభ్యుల ప్రమాణం జరగడంలేదు. మంత్రి వర్గ విస్తరణ జరగడంలేదు. దానికి అనేక కారణాలున్నాయని టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కేసిఆర్ వ్యూహాత్మక వైఖరితోనే మంత్రివర్గ విస్తరణ ఆలస్యం చేస్తున్నారని అంటున్నారు. అంతేకాదు అసెంబ్లీలో సభ్యుల ప్రమాణాలు కూడా ఆలస్యం కావడానికి బలమైన రాజకీయ కారణాలు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో టిడిపి సభ్యుడిగా గెలిచిన సత్తుపెల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను మంత్రిగా చేయవచ్చని టాక్ నడిచింది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయిందని చెబుతున్నారు. కేసిఆర్ కేబినెట్ లో సండ్రకు చాన్స్ లేదని తాజా సమాచారంగా తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం పూర్తి వివరాలు ఇవి.

తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన తర్వాత లోకేష్ ను కలిసిన సండ్ర, మెచ్చా

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పొత్తులో భాగంగా రెండు అసెంబ్లీ సీట్లలో గెలుపు దక్కింది. అందులో ఒకటి సత్తుపల్లి, ఇంకోటి అశ్వరావుపేట. సత్తుపల్లిలో సండ్ర వెంకట వీరయ్య గెలిచారు. అశ్వరావుపేటలో మెచ్చా నాగేశ్వరరావు గెలిచారు. అయితే వీరిద్దరినీ గుండుగుత్తగా టిడిపి నుంచి టిఆర్ఎస్ లో చేర్పించుకునేందుకు కేసిఆర్ వేసిన ఎత్తు చిత్తయింది. వారిద్దరికి వల వేస్తే ఒక్క సభ్యుడే అందులో పడిపోయాడు. ఆయనే సండ్ర వెంకట వీరయ్య. సండ్ర రేపో మాపో టిఆర్ఎస్ లో చేరడం ఖాయమైంది. ఇద్దరు సభ్యులు టిడిపి దుకాణం ఖాళీ చేసి వస్తేనే సండ్రకు మంత్రి పదవి ఇస్తామని కేసిఆర్ ఆలోచించారు ఆ దిశగా యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు.

కానీ మెచ్చా నాగేశ్వరరావు తాను టిడిపిలోనే కొనసాగుతానని, టిఆర్ఎస్ లో చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు ఇద్దరు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరతాని ప్రచారం జరుగుతున్న వేళ మెచ్చా నాగేశ్వరరావు అమరావతి వెళ్లి చంద్రబాబుతో భేటీ అయ్యారు. తనకు టిఆర్ఎస్ ఆఫర్ ఇచ్చింది నిజమే కానీ తాను చేరడంలేదని క్లారిటీ ఇచ్చారు. సండ్రకు మంత్రి పదవి ఇస్తానంటే తానెందుకు టిఆర్ఎస్ లో చేరాలని ఆయన కామెంట్ చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా టిడిపిలోనే ఉంటే టిటిడి బోర్డు సభ్యుడి పదవిని మెచ్చాకు ఇస్తానని చంద్రబాబు ఆఫర్ పెట్టినట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో టిఆర్ఎస్ లోకి వచ్చేకంటే గెలిచిన టిడిపిలోనే ఉండి అసెంబ్లీలో పసుపు కుండువా వేసుకుని తిరగాలన్న ఆకాంక్షతో మెచ్చా ఉన్నారు.

రేపు కేటిఆర్ తో సండ్ర భేటీ ? చేరిక లాంఛనమేనా?

మెచ్చా రివర్స్ పంచ్ ఇవ్వడంతో సండ్ర వెంకటవీరయ్య మంత్రి పదవి ఆశలకు గండి పడిందని చెబుతున్నారు. ఇద్దరికి ఇద్దరు వస్తే సండ్రకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉండేదని, కానీ ఇప్పుడు ఒక్కరే వస్తున్నారు కాబట్టి సండ్రకు మంత్రి పదవి చాన్స్ లేదని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక టిఆర్ఎస్ నేత కామెంట్ చేశారు. మంత్రి పదవి కాకుండా అంతటి ప్రాధాన్యత కలిగిన హోదా ఇచ్చేందుకు టిఆర్ఎస్ నేతలు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. 

శుక్రవారం సండ్ర వెంకట వీరయ్య టిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటిఆర్ తో భేటీ కానున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కేటిఆర్ విదేశాల నుంచి వచ్చారు. గురువారం కూడా తెలంగాణ భవన్ లో నాయకులు, కార్యకర్తలను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సండ్ర వెంకట వీరయ్య శుక్రవారం కేటిఆర్ ను తెలంగాణ భవన్ లో కానీ, లేదంటే మరోచోట కానీ కలిసే అవకాశాలున్నట్లు ఖమ్మం జిల్లా నేతలు చెబుతున్నారు. కేటిఆర్ ను కలిసిన తర్వాత టిఆర్ఎస్ లో చేరడం లాంఛనమే అని చెబుతున్నారు. 

కేసిఆర్ కేబినెట్ లో సండ్రకు ఖమ్మం జిల్లా నుంచి చాన్స్ లేదని తేలడంతో జిల్లా ఈక్వేషన్లు చూస్తే ఇంకెవరు మంత్రివర్గంలో ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఓడిపోయిన మంత్రి తుమ్మలకే మళ్లీ చాన్స్ రావొచ్చని ఇప్పటికే టిఆర్ఎస్ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి.