తెలంగాణ కేబినెట్ లో హరీష్ రావుకు ఏ పోర్ట్ ఫోలియో ?

ముందస్తు ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో అనూహ్యమైన మార్పులు, వ్యూహాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రగతి భవన్ తో టచ్ లో ఉన్న వారికి తప్ప పార్టీ యంత్రాంగంలో చాలా మందికి తెలియని ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల ఫలితాలు రాగానే కేసిఆర్ సిఎంగా ప్రమాణస్వీకారం, ఆ తర్వాత ఆయన తనయుడు కేటిఆర్ కు పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ గా బాధ్యతలు చేపట్టడం చకచకా జరిగిపోయాయి. 2018 ఎన్నికలు టిఆర్ఎస్ లో నెంబర్ 2 పోస్టులో కేటిఆర్ ను కూర్చోబెట్టాయని చెప్పవచ్చు. ప్రాంతీయ పార్టీల్లో సహజంగానే తండ్రి తర్వాత కొడుకు ఉంటే కొడుకు లేదంటే కూతురు లేదంటే ఇతర కుటుంబసభ్యులు అనివార్యంగా నాయకులుగా ముందుకొస్తారు. ఉత్తరాది పార్టీల్లోనూ అదే జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే జరగబోతున్నది. సమాజ్ వాదీ పార్టీ అధినేత గా ఉన్న ములాయం సింగ్ యాదవ్ గతంలో తప్పుకుని తన కొడుకు అఖిలేష్ యాదవ్ కు బాధ్యతలు కట్టబెట్టారు. అదే తరహాలో తెలంగాణలో కూడా ఒక ప్రయోగానికి కేసిఆర్ తెర తీశారు. ఇంతవరకు బాగానే ఉన్నా టిఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా ఉన్న హరీష్ రావు భవితవ్యం ఏమిటి అన్న ఆసక్తి పార్టీ శ్రేణుల్లో, తెలంగాణ జనాల్లో కలుగుతున్నది. 

టిఆర్ఎస్ పార్టీ నెలకొల్పిన నాటినుంచి నేటి వరకు మామ అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగారు హరీష్ రావు. మామ కేసిఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా తనకు శిరోధార్యం అని అహర్నిషలు పార్టీ కోసం పనిచేశారు. అయినంత మాత్రాన ఆయనకు వారసత్వం ఇవ్వాలన్న ఆశ ఏమీ లేకపోవచ్చు… లేదంటే ఉండొచ్చు కూడా. కానీ కేసిఆర్ సహజంగానే కేటిఆర్ ను తన స్థానంలో నిలిపేందుకు ఒక ముందగుగు వేశారు. ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే కొత్త సర్కారులో, కేటిఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు పాత్ర ఎలా ఉండబోతున్నదో అన్న చర్చ పార్టీలో కొనసాగుతున్నది. ఇప్పుడున్న పరిస్థితులను బేరీజు వేస్తే హరీష్ రావుకు పాత శాఖలు దక్కకపోవచ్చన్న వాదన తెర మీదకు వచ్చింది. నాలుగేళ్ల టిఆర్ఎస్ పరిపాలనా కాలంలో హరీష్ రావు కీలక శాఖల్లో పనిచేశారు. ఇరిగేషన్, మార్కెటింగ్ శాఖలతోపాటు అసెంబ్లీ వ్యవహారాల శాఖను కూడా ఆయనే చూశారు. దాంతోపాటు తొలినాళ్లలో మైనింగ్ (ఇసుక) శాఖ కూడా హరీష్ రావుకే కట్టబెట్టారు కేసిఆర్. కానీ మధ్యలో ఆ శాఖను హరీష్ రావు నుంచి తొలగించి కేటిఆర్ కు అప్పగించారు. తెలంగాణలో విమర్శలను పక్కనపెడితే రాత్రింబవళ్లు హరీష్ రావు పనిచేశారు. అధికారులు, కార్మికులను పరుగులు పెట్టించి పనిచేయించారు. అందుకే సాగునీటి ప్రాజెక్టులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. 

ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏమంటే పాత కేబినెట్ స్థానంలో ఇప్పుడిప్పుడే కొత్త కేబినెట్ రూపుదిద్దుకోబోతున్నది. తొలుత సిఎం కేసిఆర్, హోంశాఖ మంత్రిగా మహమూద్ అలీ ఇద్దరే ప్రమాణ స్వీకారం చేశారు. మరో రెండు మూడు రోజుల్లోనే కేబినెట్ విస్తరణ ఉండవచ్చని అంటున్నారు. అయితే శనివారం ఒక కీలకమైన పరిణామం ప్రగతిభవన్ వేదికగా జరిగింది. సిఎం కేసిఆర్ సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష జరిపారు. అలసత్వం వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు గట్టిగానే క్లాస్ కూడా ఇచ్చారు. కాంట్రాక్టర్లను కూడా వాయించారు. కాళేశ్వరం సహా అన్ని ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగాలని ఆదేశాలిచ్చారు. అయితే ఈ సమావేశంలో హరీష్ రావు పాల్గొనలేదు. ఆయన గడిచిన నాలుగేళ్లపాటు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నందున ఆయన ఈ సమావేశంలో పాల్గొనలేదంటే? కారణాలేంటి అని కేడర్ లో అంతర్మథనం ప్రారంభమైంది. హరీష్ రావు అందుబాటులో లేక మీటింగ్ లో పాల్గొనలేదా? లేదంటే ఆయనను సిఎం కేసిఆర్ పిలవలేదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

 

హరీష్ రావు రాలేదు సరే కానీ మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొనడం ఆసక్తికరమైన అంశం. ప్రశాంత్ రెడ్డితోపాటు కరీంనగర్ ఎంపి వినోద్ కుమార్ కూడా పాల్గొన్నారు. తెలంగాణలో గడిచిన నాలుగేళ్లలో చాలా సందర్భాల్లో ఆయా శాఖల మంత్రులు లేకుండానే సిఎం కేసిఆర్ అనేక సమీక్షలు జరిపిన సందర్భాలున్నాయి. ఇది కూడా అలాంటిదే అనుకోవచ్చు కదా అన్న చర్చ కూడా కేడర్ లో సాగుతున్నది. కానీ రెండోసారి అధికారంలోకి వచ్చీ రాగానే జరుపుతున్న రివ్యూలో పాత మంత్రి కూడా ఉంటే బాగుండేది కదా అనేవారు కూడా ఉన్నారు. కేటిఆర్ ను పార్టీలో నెంబర్ 2 స్థానానికి ప్రమోట్ చేశారు సరే హరీష్ విషయం ఏమిటి? అని చాలా మంది పార్టీ నేతలు ఆరా తీస్తున్నారు. ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావుకు కొత్త ప్రభుత్వంలో ఏ పోర్ట్ పోలియో ఇవ్వబోతున్నారు అన్న ఆసక్తి కార్యకర్తల్లో నెలకొంది. 

తాజా పరిణామాలు చూస్తే ఇరిగేషన్ శాఖను వేముల ప్రశాంత్ రెడ్డికి ఇవ్వవచ్చు అని పార్టీ వర్గాల్లో టాక్ మొదలైంది. అందుకోసమే సిఎం కేసిఆర్ సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారని కూడా అంటున్నారు. మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్ గా వేముల ప్రశాంత్ రెడ్డి ఇప్పటి వరకు పనిచేశారు. ఆయనకు ఇరిగేషన్ శాఖ ఇస్తే మరి హరీష్ రావుకు ఏం శాఖలు ఇస్తారు అనేది కూడా ఇప్పుడు టిఆర్ఎస్ వర్గాల్లో బాగా చర్చలో నానుతున్న అంశం. అయితే హరీష్ రావుకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లాంటి కీలకమైన శాఖ కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయని పార్టీ నాయకులు అంటున్నారు.  ఒకవేళ కేబినెట్ లోకి తీసుకోకుండా పార్లమెంటుకు తీసుకుపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని పార్టీ వర్గాల్లో గుసగుస నడుస్తోంది. ఏది ఏమైనా మరో రెండు మూడు రోజుల్లోనే దీనికి సమాధానం దొరకవచ్చు.