కేసిఆర్ స్కెచ్ : టిడిపి సండ్ర కు టిఆర్ఎస్ లో మంత్రి పదవి

ముందస్తు ఎన్నికల్లో 88 సీట్లతో టిఆర్ఎస్ ఘన విజయం… అయినా ఆ పార్టీ ఆశ సరిపోలేదా? అసెంబ్లీలో విపక్షం అనే మాట వినబడకుండా చేసేందుకు సరికొత్త ప్రణాళికలు వేస్తున్నదా? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అనేవారు తెలంగాణ శాసనసభలో ఉండకూడదని కేసిఆర్ కంకణం కట్టుకున్నారా? పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తున్నది. టిడిపి తరుపున ఖమ్మం జిల్లాలో గెలిచిన సండ్ర వెంకట వీరయ్య, మచ్చా నాగేశ్వర రావు ఇద్దరిపై టిఆర్ఎస్ విసిరిన ఆపరేషన్ ఆకర్ష్ స్కెచ్ విజయవంతమైనట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

 

సండ్ర వెంకట వీరయ్య, సత్తుపల్లి ఎమ్మెల్యే (టిడిపి)

తెలంగాణ రెండోశాసనసభ కొలువుదీరేనాటికే టిడిపి సభ్యులెవరూ సభలో ప్రమాణస్వీకారం చేయకూడదన్న యాక్షన్ ప్లాన్ ను కేసిఆర్ రెడీ చేశారు. అందుకోసమే తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో గెలిచిన ఇద్దరు టిడిపి సభ్యులను టిఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. అయితే ఇప్పటికే సంప్రదింపులు జరిగాయని తెలుస్తోంది. వారిద్దరూ ఈనెల 28న కేసిఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నట్లు జిల్లా రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సండ్ర, మచ్చా ఇద్దరు కూడా గత రెండు రోజులుగా కార్యకర్తలతో మంతనాలు జరిపారు. పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు అని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక టిఆర్ఎస్ నేత వ్యాఖ్యానించారు.

సండ్ర వెంకట వీరయ్యకు మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు చెబుతున్నారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం దాదాపు ఖాయమైందని టిఆర్ఎస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అంతేకాకుండా అశ్వరావుపేట నుంచి గెలుపొందిన మచ్చా నాగేశ్వర్ రావుకు కూడా కీలకమైన కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తామని కమిట్ అయినట్లు చెబుతున్నారు. వీరిద్దరికీ చెరో పదవి ఇవ్వడానికైనా కేసిఆర్ వెనకాడడంలేదని చెబుతున్నారు. ఆరకమైన చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. కేసిఆర్ దేశ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే వీరిద్దరి జాయినింగ్ జరిగేలా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. 

మచ్చా నాగేశ్వర రావు, అశ్వరావుపేట ఎమ్మెల్యే (టిడిపి)

ఖమ్మం జిల్లాలో కేసిఆర్ మంత్రివర్గంలో బెర్తు కోసం ముగ్గురు నేతలు సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో ఒకరు ఖమ్మం నియోజకవర్గ సభ్యుడు, కమ్మ సామాజికవర్గానికి చెందిన పువ్వాడ అజయ్. ఈయన  కేటిఆర్ తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు. ఈయనతోపాటు కేసిఆర్ కుడి భుజం లాంటి వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు కూడా రేస్ లో ఉన్నారు. కానీ తుమ్మల ఓటమిపాలయ్యారు. వీరిద్దరే కాకుండా ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా మంత్రిపదవిని ఆశిస్తున్నారు. ఈయన ఎమ్మెల్సీగా తీసుకుని మంత్రి ఇవ్వాలన్న ఆశతో ఉన్నారు. ఖమ్మం ఎంపీగా తుమ్మల పేరును ఖరారు చేయవచ్చని అంటున్నారు. ఈ పరిస్థితే ఉంటే వీరి ముగ్గురినీ కాదని, టిడిపిలో గెలిచిన సండ్రకు మంత్రి పదవిని కేసిఆర్ ఆఫర్ చేయడం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇక సండ్రకు మంత్రి పదవి ఇస్తే జిల్లా కోటాలో మరొకరికి చాన్స్ ఉంటుందా అన్నది అనుమానమే కానుంది.

అందుకేనా సభ్యుల ప్రమాణం ఆసల్యమయ్యేది ?

ఎన్నికల ఫలితాలు వచ్చి పది రోజులు గడిచిపోయినా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని చేపట్టలేదు. రెండో శాసనసభ ఎప్పుడెప్పుడు కొలువుదీరుతుందా? అసెంబ్లీలో అధ్యక్షా అని ఎప్పుడు పలకాలా అని కొందరు కొత్త సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విషయంలో కావాలనే జాప్యం జరుగుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టిన తర్వాతే కొత్త అసెంబ్లీ కొలువుదీరబోతున్నట్లు వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ శాసనసభలో టిఆర్ఎస్ 88 సీట్లు గెలుచుకోగా ఇద్దరు ఇండిపెండెంట్లు కారెక్కారు. అంటే వారి సంఖ్య 90కి చేరింది. బిజెపి ఒకరు ఉన్నారు. టిడిపి ఇద్దరు ఉన్నారు. కాంగ్రెస్ 19 మంది సభ్యులు ఉన్నారు. ఎంఐఎం సభ్యులు ఏడుగురు ఉన్నారు. ఈ నేపథ్యంలో 90 సీట్లతో ఉన్న టిఆర్ఎస్ మరో రెండు టిడిపి సభ్యులను కలుపుకుంటే 92 కానుంది. 

 

తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి

 

దీంతోపాటు కాంగ్రెస్ నుంచి కూడా 12 మంది సభ్యులు రాబోతున్నట్లు టిఆర్ఎస్ నేతలు లీక్ లు ఇస్తున్నారు. 8 మంది సభ్యులు ఇప్పుడంటే ఇప్పుడు వచ్చి గులాబీ కండువా కప్పుకోబోతున్నట్లు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ లో గెలిచిన 12 మంది నిజంగానే కారెక్కే పరిస్థితే ఉంటే వారిపై అనర్హత వేటు ఆప్షన్ లేకుండా ఉంటుంది. ఎందుకంటే 19 మందిలో మూడింట రెండో వంతు సభ్యులు చీలిపోతే వారిపై అనర్హత వేటు ఆప్షన్ వర్తించదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి 12 లేదా 13 మంది కానీ టిఆర్ఎస్ లో చేరిపోతే అప్పుడు టిఆర్ఎస్ బలం 104 వరకు చేరుతుంది. ఇక ఎలాగూ ఏడుగురు సభ్యులున్న ఎంఐఎం మిత్రపక్షమే కానుంది. మహా అంటే సభలో పట్టుమని పది మంది కూడా విపక్ష సభ్యులు లేకుండా చేయాలన్న ప్లాన్ తో టిఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే అసెంబ్లీలో సభ్యుల ప్రమాణం కార్యక్రమం వాయిదా పడుకుంటూ వస్తోందని అంటున్నారు. దాంతోపాటు మంత్రి వర్గ విస్తరణ కూడా పెండింగ్ లో పడిందని చెబుతున్నారు.  

 

పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం ఎమ్మెల్యే
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం ఎంపీ