తెలంగాణ మంత్రివర్గంలో ప్రస్తుతం ఇద్దరే ఉన్నారు. ఒకరు సిఎం కేసిఆర్, మరొకరు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ. మిగతా 16 మంది కేబినెట్ ఎప్పుడు కొలువుదీరుతుందో? ఎవరికి బెర్తులు ఖరారవుతాయో అన్న ఉత్కంఠ పార్టీలో రేగుతున్నది. ఫలితాలు వెలువడిన వెంటనే కేసిఆర్ కార్యాచరణ వేగవంతం చేశారు. తాను సిఎంగా ప్రమాణం చేస్తూనే తన తనయుడు కేటిఆర్ కు వర్కింగ్ ప్రసిడెంట్ పదవిని కట్టబెట్టారు. ఇక పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించబోతున్నారు. అయితే కేబినెట్ లో ఎవరెవరికి చాన్స్ ఉంటుంది అని పార్టీ నేతల్లో క్యూరియాసిటీ పెరిగిపోతున్నది.
విశ్వసనీయ సమాచారం మేరకు కేసిఆర్ ఏర్పాటు చేయబోయే కేబినెట్ లో ఈసారి పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటిఆర్ కే చాన్స్ లేదని చెబుతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ గా నియమితులైన కేటిఆర్ పూర్తి స్థాయి బాధ్యతలు పార్టీలోనే చేపడతారని అంటున్నారు. కేటిఆర్ సోమవారం అంటే 17వ తేదీన వర్కింగ్ ప్రసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత ఆయన జిల్లాల్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. పనిలో పనిగా పంచాయతీ ఎన్నికలు కూడా ఉన్నందున జిల్లాల్లో కేటిఆర్ పర్యటించి పార్టీ బలోపేతం పై దృష్టి సారించనున్నారు.
టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటై 17 ఏండ్లు గడుస్తున్నది. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నది. అయినప్పటికీ టిఆర్ఎస్ పార్టీకి బలమైన కేడర్ పునాదులు ఇంకా రూపుదాల్చలేదు. ఉద్యమ సమయంలో ఉద్యమకారుల మద్దతుతో పార్టీ నడిచింది. తర్వాత ప్రభుత్వ బలంతో నడిచింది. కానీ కిందిస్థాయిలో పటిష్టమైన యంత్రాంగం మాత్రం లేదన్న చర్చ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జనాలు ఇచ్చిన భారీ విజయాన్ని ఆసరాగా తీసుకుని క్షేత్ర స్థాయిలో పార్టీకి పటిష్టమైన పునాదులు వేసేందుకు కేటిఆర్ వ్యూహరచన చేయవచ్చిన చెబుతున్నారు. అందుకోసమే కేసిఆర్ కేబినెట్ లో కేటిఆర్ కు చాన్స్ లేదంటున్నారు.
మరి ఈ పరిస్థితుల్లో కేబినెట మంత్రులు ఎవరు అన్న ఉత్కంత మాత్రం కంటిన్యూ అవుతున్నది. ముందస్తు ఎన్నికల ముందు కేబినెట్ లో ఉన్న నలుగురు మంత్రులు ఓటమిపాలయ్యారు. వారిలో ఎవరికీ అవకాశం లేదని అంటున్నారు. ఉంటే గింటే తుమ్మలకు చాన్స్ రావొచ్చన్న ఊహాగానాలున్నాయి. ఇక గెలిచిన మంత్రుల్లో హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జోగు రామన్న, గుంతకండ్ల జగదీష్ రెడ్డి, అవంచ లక్ష్మారెడ్డి, పద్మారావు గౌడ్ ఉన్నారు. వీరిలో ఎవరికి మళ్లీ అవకాశం దక్కొచ్చు అన్న దానిపై ఆసక్తి నెలకొంది.
ఇక వీరితోపాటు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉంటూ మంత్రులుగా ఉన్నవారు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉన్నారు. హోంమంత్రి హోదాలో ఉన్న నాయిని నర్సింహ్మారెడ్డి ఉన్నారు. అయితే మహమూద్ అలీకి హోంశాఖ ఇచ్చిన తర్వాత ఇక నాయిని మాజీ మంత్రి అయిపోయినట్లే అంటున్నారు. ఇక కడియం శ్రీహరిని తిరిగి కొత్త కేబినెట్ లోకి తీసుకుంటారా లేదా అన్న చర్చ ఉంది. నాయిని నర్సింహ్మారెడ్డికి కొత్త కేబినెట్ లో చాన్స్ లేనట్లే అని పార్టీ వర్గాల్లో టాక్ వినబడుతున్నది. నాయిని తన అల్లుడి కోసం ముషీరాబాద్ సీటును ఆశించారు. దానికోసం తీవ్రంగా ప్రయత్నించి కేసిఆర్ నజర్ లో పడ్డారు. దీంతో ఆయనకు ఇక పార్టీలో పదవులు తప్ప ప్రభుత్వంలో చాన్స్ లేదంటున్నారు. అలాగే గత టర్మ్ మంత్రుల్లో జగదీష్ రెడ్డికి, పద్మారావు గౌడ్, జోగు రామన్న కు అనుమానమే అంటున్నారు.
కొత్తగా గెలిచిన వారిలో కొందరికి మంత్రి పదవులు రావొచ్చని అంటున్నారు. ఆ జాబితాలో కొప్పుల ఈశ్వర్ పేరు ప్రముఖంగా వినబడుతున్నది. వనపర్తి నిరంజన్ రెడ్డి, దానం నాగేందర్, ఆరూరి రమేష్, రేఖా నాయక్, పద్మా దేవేందర్ రెడ్డి పేర్లు కూడా వినబడుతున్నాయి. అయితే కొత్త కేబినెట్ లో ఆసక్తికరమైన విషయమేమంటే కేటిఆర్ లేకుండానే కేబినెట్ రూపుదిద్దుకోబోతున్నట్లు తెలుస్తుండగా ఆ కేబినెట్ అంతా కేటిఆర్ సూచించిన వారితోనే ఉండబోతున్నట్లు చెబుతున్నారు. ఆయన లేకుండానే ఆయన సూచించినవారే కేబినెట్ లో ఉండవచ్చని పార్టీ నేత ఒకరు తెలిపారు. ఎమ్మెల్సీ కోటాలో పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినబడుతుండగా నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేయవచ్చని ప్రచారం సాగుతున్నది.
ఇంకో విషయం ఏమంటే? పార్లమెంటు ఎన్నికల వరకు కేసిఆర్ కేబినెట్ కొనసాగబోతున్నదని, పార్లమెంటు ఎన్నికలకు అటూ ఇటూగా కేటిఆర్ ముఖ్యమంత్రి అవుతారని కూడా టాక్ నడుస్తోంది. అంటే తన కేబినెట్ ను ఇప్పుడే పదవుల్లో ఉంచబోతున్నారు కేటిఆర్ అన్నమాట. అయితే హరీష్ రావు కు కూడా కీలకమైన శాఖలు కట్టబెట్టే చాన్స్ ఉందంటున్నారు. అందుకే పేరుకే కేసిఆర్ కేబినెట్ అయినా ప్రాధాన్యత మాత్రం కేటిఆర్ దే అని అంటున్నారు. ఇక పార్లమెంటు ఎన్నికల వేళ కేసిఆర్ తప్పుకుని కేటిఆర్ ను డైరెక్ట్ సిఎం కుర్చీలో కూర్చోబెడతారని చెబుతున్నారు. వందకు వంద శాతం కేసిఆర్ ఫ్యామిలీకి విధేయులైన వారిని, పాలిటిక్స్ లో ఫేస్ వాల్యూ ఉన్న వారిని ఈసారి కేబినెట్ లో తీసుకోబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. దీంతో 88 మంది ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీలు, కేబినెట్ బెర్తులు ఆశించే వారంతా లబ్ డబ్ అని ఎదురుచూస్తున్నారు.