ఇది హైదరాబాద్ హాట్ న్యూస్. జిహెచ్ఎంసి పరిధిలోని హయత్ నగర్ (13వ) డివిజన్ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డి ఎవరూ సాహసం చేయని వినూత్న నిరసన కార్యక్రమం చేసి సంచలనం రేపారు. సామాన్య మనుషులు బురద దగ్గరకు పోవాలంటేనే వాసనకు భయపడిపోతారు. బురద అంటిందంటే చాలు ఎన్ని సబ్బులు పెట్టినా ఆ గబ్బు వాసన పోగొట్టడం కష్టమే.
కానీ అధికార టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అయినప్పటికీ అధికారుల తీరుతో విసిగి వేసారి చివరకు బురదలో దిగారు. బురదలో పొర్లి నిరసన తెలిపారు. స్థానిక ప్రజలకు రోడ్లు సదుపాయం కల్పించేందుకు తాను ఎంతగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని సామ తిరుమల్ రెడ్డి ఆరోపించారు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అధికారులు స్పందించకపోవడంతో విధిలేని పరిస్థితుల్లోనే తాను బురదలోకి దిగి బురదలో కూర్చుని నిరసన తెలిపినట్లు పేర్కొన్నారు.
జిహెచ్ఎంసి ఇంజనీర్లు నిర్లక్ష్యం కారణంగా సాయి పద్మాలయ కాలనీ, మైత్రి విహార్ కాలనీలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సదుపాయం లేదు. మురుగు నీరు ఇండ్ల మధ్యలో నిలిచిపోతున్నది. కుంటల మాదిరిగా తయారయి దుర్గందం వెదజల్లుతున్నది. జనాలు రోగాలబారిన పడుతున్నారు. ఈ రెండు కాలనీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని గత ఏడాది కాలంగా నెత్తి నోరు కొట్టుకుంటున్నా.. ఇంజనీర్లు ఎస్టిమేషన్స్ రెడీ చేయలేదని సామ తిరుమల రెడ్డి తెలిపారు. దీంతో వారి తీరును నిరసిస్తూ మురుగునీటిలోనే కూసోని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సామ తిరుమల్ రెడ్డి ఏమన్నారో కింద వీడియోలో చూడండి.
ఆదినుంచీ సామ తిరుమల్ రెడ్డి హల్ చలే..
సామ తిరుమల్ రెడ్డి హయత్ నగర పరిసర ప్రాంతాల్లో రోజు ఏదో ఒక ఇష్యూతో హల్ చల్ చేస్తుంటారు. రోడ్ల మీద చెత్త కాలుస్తారు. రోడ్ల మీద తిరుగుతూ ఎవరైనా చెత్త పడేస్తే వారికి క్లాస్ పీకుతారు. అలా ఆయన చాలా సందర్భాల్లో జనాలను ఆకట్టుకునే పనులు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటారు. అయితే పలుమార్లు ఆయన చేసిన పనులు బూమరాంగ్ అయి అభాసుపాలైన దాఖలాలు కూడా ఉన్నాయి. హయత్ నగర్ లో ఒక వ్యక్తి బహిరంగ మల విసర్జన చేస్తున్న సందర్భంలో ఆ వ్యక్తి వద్దకు వెళ్లి సామ తిరుమల్ రెడ్డి సెల్ఫీ దిగాడు. అంతేకాదు.. ఆ సెల్పీని వైరల్ చేశాడు. ఆ మల విసర్జన చేసే వ్యక్తిని చెడా మడా కడిగి పారేశాడు. కానీ ఆ సెల్ఫీ సోషల్ మీడియాలోకి వదలడంతో.. జనాల్లో వ్యతిరేకత వచ్చింది. అధికార పార్టీ కార్పొరేటర్ అయి ఉండి టాయిలెట్లు కట్టించకుండా ఇలా బహిరంగ మల విసర్జన చేసే పరిస్థితి కల్పించింది కాక.. జనాలు బయట టాయిలెట్ పోతుంటే సెల్ఫీలు దిగడానికి సిగ్గు లేదా అన జనాలు సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు.
అలాగే ఇంకో సందర్భంలో ఒక మహిళ ఇంట్లోని చెత్తను బయట పారేశారని ఆరోపిస్తూ వారి ఇంట్లోకి జొరబడి నానా హడావిడి చేశారు. దీంతో ఈ విషయంలో హర్ట్ అయిన ఆ ఫ్యామిలీ కార్పొరేటర్ మీద పోలీసు స్టేషన్ లో కేసు కూడ పెట్టారు.
మొత్తానికి కార్పొరేటర్ మంచో, చెడో కానీ నిత్యం జనాల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. బురదలో పొర్లి నిరసన తర్వాత ఇంకా ఎలాంటి నిరసన చెబుతారో చూడాలి.