ఈ టిఆర్ఎస్ కార్పొరేటర్ ఏం చేస్తుండో చూడండి (వీడియో)

 

 

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఈయన ఒక కార్పొరేటర్. ఈయన పేరు సామ తిరుమల్ రెడ్డి. హయత్ నగర్ కు ఈయన కార్పొరేటర్. నిత్యం ఏదో ఒక హల్ చల్ చేస్తూ చర్చల్లో ఉంటారు సామ తిరుమల్ రెడ్డి. మొన్నటికి మొన్న మురుగు నీటిలో పొర్లుతూ అధికారుల తీరును ఎండగట్టారు. రోడ్డు పనులు షురూ చేయాలని అలా చేశారు. తాజాగా రవాణా శాఖ అధికారి కాళ్లు పట్టుకున్నాడు. ఎందుకు కాళ్లు పట్టుకున్నాడు.. ఎప్పటిదాంక పట్టుకున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. కార్పొరేటర్ కాళ్లు పట్టుకోవడంతో ఆ రవాణా శాఖ అధికారి పరిస్థితి ఎలా ఉంది.. ఈ వివరాలన్నీ కింద చదవండి.

కంకర టిప్పర్ కు అడ్డంగా కూర్చున్న హయత్ నగర్ కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి

పెద్ద అంబర్ పేట్ మీదుగా హయత్ నగర్, ఎల్ బి నగర్ వైపు టిప్పర్ లు కంకర ఓవర్ లోడ్ తో వస్తున్నాయి. రోజూ ఇలా అధిక బరువుతో కంకర లారీలు వస్తుండటంతో ప్రభుత్వం వేసిన రోడ్లు పూర్తిగా ధ్వంసం అవుతున్నది. ఓవర్ లోడ్ తో కంకర టిప్పర్ లు రానీయొద్దని స్థానిక ప్రజలు విన్నవిస్తున్నా రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఈ విషయం హయత్ నగర్ కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి నోటీసుకు వచ్చింది. అసలే ఆయన వెరైటీ మనిషి. దానికితోడు కంకర లారీల విషయంలో ఆగ్రహంగా ఉన్నాడు కూడా.

కంకర టిప్పర్ ను ఆపుతూ నిరసన వ్యక్తం చేస్తున్న కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి

దీంతో సోమవారం ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కంకర టిప్పర్ ను అడ్డుకున్నారు సామ తిరుమల్ రెడ్డి. అంతేకాదు స్థానిక ఇబ్రహీంపట్నం రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు తిరుమల్ రెడ్డి. అయితే అక్కడకి వచ్చిన అధికారులు అలా ఆగి ఉన్న టిప్పర్లను చూసి ఏమీ చేయకుండా వెళ్లిపోతున్నారు. దీంతో రవాణాశాఖ అధికారులను వెళ్లకుండా అడ్డుకున్నాడు తిరుమల్ రెడ్డి. వారిపై చిందులేశారు.

రవాణా శాఖ అధికారులు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారని విమర్శలు గుప్పించారు. మీరు టిప్పర్ యజమానులకు భయపడి పారిపోతున్నారు అంటూ ఫైర్ అయ్యారు.  ఎలాగైనా కేస్ లు రాయండి అంటూ డిమాండ్ చేస్తూనే సదరు రవాణా శాఖ అధికారి కాళ్లపై పడి ప్రాధేయ పడ్డాడు. తిరుమల్ రెడ్డి కాళ్ల మీద నుంచి ఎంతకూ లేవకపోవడంతో రవణా శాఖ అధికారి బిత్తరపోయాడు. అప్పుడు సదరు అధికారి అధిక లోడ్ తో వస్తున్న టిప్పర్ లపై కేసులు నమోదు చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత కాళ్లు వదిలిపెట్టాడు సదరు కార్పొరేటర్.

కంకర టిప్పర్ ను ఆపి నిరసన తెలుపుతున్న సామ తిరుమల్ రెడ్డి

అంతకముందు సామ తిరుమల్ రెడ్డి చేసిన కొన్ని ప్రయత్నాలు బెడిసికొట్టిన సందర్భాలున్నాయి. ఒకసారి ఆయన రాత్రిపూట ఒక ఇంట్లోకి జొరబడి ఆ ఇంటివాళ్లు రోడ్డు మీద చెత్త వేయొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అప్పుడు ఆ ఇంటి యజమాని ఆగ్రహంతో పోలీసు కేసు పెట్టేందుకు ప్రయత్నం చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహిళల భయపెట్టాడని వారు సీరియస్ అయ్యారు. మరో సందర్భంలో రోడ్డు పక్కన మల విసర్జన చేస్తున్న వ్యక్తి వద్దకు వెళ్లి సెల్ఫీ దిగి నానా హడావిడి చేసి విమర్శల పాలయ్యారు.

తాజాగా ఈ ఘటనతో సామ తిరుమల్ రెడ్డి మళ్లీ హైదరాబాద్ వార్తల్లోకి వచ్చారు.