బ్రేకింగ్ : టిఆర్ఎస్ లోనే దానం నాగేందర్ కు లైన్ క్లియర్

ఇటు టిఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీల్లో సోమవారం ఉదయం నుంచి కలవరం రేపిన దానం నాగేందర్ కు కేసిఆర్ లైన్ క్లియర్ చేశారా? దానం ఇక టిఆర్ఎస్ లోనే కొనసాగే చాన్స్ ఉందా? దానం నాగేందర్ కు సీటెక్కడ? ఉత్తమ్ ను హోటల్ లో దానం కలిసింది నిజమేనా? దానం హోటల్ రాజకీయం వర్కవుట్ అయిందా? దానం స్కెచ్ కు టిఆర్ఎస్ పెద్దలు దిగొచ్చారా?  ఈ పరిణామాలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి.

దానం నాగేందర్ కు తొలి జాబితాలో టిఆర్ఎస్ టికెట్ దొరకలేదు. అయితే ఆయనను ఎక్కడ పోటీ చేయించాలనేదానిపై క్లారిటీ రాలేదని, అందుకే ఆయన పేరు తొలి జాబితాలో లేదని టిఆర్ఎస్ ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పుడు దానం నాగేందర్ కు టిఆర్ఎస్ లో లైన్ క్లియర్ అయినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. దానం నాగేందర్ కు గోషామహల్ టికెట్ కన్ ఫాం చేసినట్లు టిఆర్ఎస్ వర్గాల నుంచి సమాచారం అందుతున్నది. ఉత్తమ్, దానం మధ్య హోటల్ రాజకీయం దానంకు కలిసొచ్చిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

దానం నాగేందర్ ముందు నుంచీ ఖైరతాబాద్ టికెట్ కోరుతున్నారు. ఆయన టిఆర్ఎస్ లో చేరిన సమయంలో ఈ అంశాన్ని పార్టీ నేతల వద్ద ప్రస్తావించారు. అయితే ఖైరతాబాద్ లో ఇప్పటికే పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి కూడా రేస్ లో ఉన్నారు. ఆమె ప్రస్తుతం కార్పొరేటర్ గా పనిచేస్తున్నారు. ఆమెతోపాటు టిఆర్ఎస్ పార్టీలో ఎప్పటినుంచో పనిచేస్తున్న మన్నె గోవర్దన్ రెడ్డి కూడా రేస్ లో ఉన్నారు. ఆయన సతీమణి ప్రస్తుతం కార్పొరేటర్ గా ఉన్నారు. మన్నె గోవర్దన్ రెడ్డికి కానీ, ఆయన సతీమణికి కానీ ఖైరతాబాద్ టికెట్ అడుగుతున్నారు.

ఈ పరిస్థితుల్లో దానం నాగేందర్ టిఆర్ఎస్ లోకి ఆలస్యంగా చేరడంతో ఆయనకు ఖైరతాబాద్ విషయంపై పార్టీ వర్గాలు హామీ ఇవ్వలేదని తెలిసింది. ఈ పరిస్థితుల్లోనే తొలి జాబితాలో దానం పేరు లేదు. అయితే దానం నాగేందర్ కు సీటొస్తుందా రాదా అన్న నేఫథ్యంలో తాజాగా టిఆర్ఎస్ వర్గాల నుంచి ఒక లీక్ మీడియాకు చేరింది. దానం నాగేందర్ కు గోషామహల్ టికెట్ ఇస్తున్నామని, 13వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నామని సమాచారం అందింది.

దానం నాగేందర్ కు గోషా మహల్ అంత ఈజీగా గెలిచే సీటేం కాదు. ఎందుకంటే అక్కడ దానం నాగేందర్ కు అత్యంత సన్నిహితుడైన ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగనున్నారు. ముఖేష్ గౌడ్ ఒక దశలో టిఆర్ఎస్ గూటికి చేరవచ్చని ప్రచారం సాగింది. కానీ ముఖేష్ చివరి నిమిషంలో కాంగ్రెస్ లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ముఖేష్ ను టిఆర్ఎస్ లోకి తీసుకొచ్చేందుకు దానం నాగేందర్ కూడా గట్టిగానే ప్రయత్నించారు. కానీ ముఖేస్ రాలేదు. ఈ పరిస్థితుల్లో పాత దోస్తులే ఇప్పుడు పోటీ పడనుండడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇదే గోషామహల్ లో ప్రస్తుత ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా బలమైన అభ్యర్థిగా బిజెపి నుంచి బరిలో ఉండే చాన్స్ ఉంది. 

దానం నాగేందర్ మిమ్మల్ని కలిశారా? అని గాంధీభవన్ లో మీడియా వారు పిసిసి చీఫ్ ఉత్తమ్ ను ప్రశ్నించగా ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు. దానం నాగేందర్ మమ్మల్ని కలిస్తే తప్పా? ఇందులో తప్పేముంది అని ఆయన మీడియాను ఎదురు ప్రశ్నించారు. 

మొత్తానికి దానం నాగేందర్ ఎపిసోడ్ కు టిఆర్ఎస్ ముగింపు పలికినట్లేనా? ఇంకేమైనా సంచలనాలు ఉంటాయా అన్నది మరో మూడు రోజుల్లో తేలనుంది.