జనగామ సీటుపై కోదండరాం షాకింగ్ డిషిషన్

తెలంగాణ జన సమితి అధినేత కోదండరా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఎక్కడ పోటీ చేయాలన్నదానిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. కూటమిలో కాంగ్రెస్ పార్టీ సీట్లలో కోత విధిస్తున్నప్పటికీ కోదండరాం కూటమిని అంటిపెట్టుకుని ఉన్నారు. కూటమి నుంచి వైదొలిగితే తెలంగాణలో రాచరిక, కుటుంబ పాలన అంతం చేయలేమన్న ఉద్దేశంతో కోదండరాం కూటమికి కట్టుబడి ఉన్నారు. 

ఈ నేపథ్యంలో కూటమిలో భాగంగా కోదండరాం జనగామలో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ అక్కడ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య సీటు త్యాగం చేయాల్సి వస్తున్నది. పొన్నాల బిసి మున్నూరు కాపు కులానికి చెందిన వ్యక్తి. ఆయన కాంగ్రెస్ లో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. దీంతో జనగామలో కోదండరాం పోటీ చేయబోతున్నారన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ 65 సీట్ల తొలి జాబితాలో కోదండరాం కోసం జనగామ ను పెండింగ్ లో పెట్టింది.

ponnala laxmaiah

దీంతో పొన్నాల ఈ విషయమై సీరియస్ అయ్యారు. కూటమిలో బిసి సీట్లన్నింటికీ కోత పెడతారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బిసి సీటులో కోదండరాం రెడ్డిని ఎలా పోటీ చేయిస్తారని ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్ కు మంచి పరిణామం కాదని ఆయన హెచ్చరించారు. పైగా కోదండరాం స్థానికేతరుడు కూడా కావడంతో మరింత దుమారం రేగింది. అంతేకాకుండా తాడో పేడో తేల్చుకునేందుకు పొన్నాల ఢిల్లీకి వెళ్లారు. అక్కడ అధిష్టానం పెద్దలను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు.

ఈ పరిస్థితుల్లో బిసి సీటులో బిసిని పక్కకు నెట్టి తాను పోటీ చేయడం భావ్యం కాదని కోదండరాం తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది కూటమిని అభాసుపాలు చేసే ప్రమాదం ఉందని కోదండరాం ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కూటమి సీట్లలో అగ్రవర్ణాలకే పెద్ద పీట వేశారన్న విమర్శలు గుప్పమంటున్నాయి. రెడ్డి సాజామిక వర్గానికి సింహభాగం సీట్లు దక్కాయన్న విమర్శ ఉంది.

ఈ పరిస్థితుల్లో జనగామ నుంచి పొన్నాలను తప్పించి తాను పోటీ చేయరాదని కోదండరాం నిర్ణయించుకున్నట్లు తెలంగాణ జన సమితి వర్గాల నుంచి విశ్వసనీయంగా సమాచారం అందింది. కూటమి సీట్లలో క్లారిటీ వస్తున్న తరుణంలో అది మహా కూటమా? రెడ్డి కూటమా అన్న విమర్శలు భగ్గుమంటున్నాయి. దీంతో కోదండరాం అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఈ పరిస్థితుల్లో కోదండరాం ఎక్కడ పోటీ చేస్తారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆయన రామగుండంలో పోటీ చేస్తారని ఇప్పటికే ఒక ప్రచారం సాగింది. కానీ రామగుండంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక బిసి అభ్యర్థిని ప్రకటించింది. యువ నేత అయిన రాజ్ ఠాకూర్ ను రామగుండం నుంచి పోటీ చేయించబోతున్నట్లు నిన్న 65 మంది జాబితాలో కాంగ్రెస్ వెల్లడించింది. రాజ్ ఠాకూర్ బిసి వర్గానికి చెందిన  క్షత్రియ కులస్తుడు.

మరి ఈ పరిస్థితుల్లో కోదండరాం పోటీ చేస్తారా? లేదా అన్నది ఇప్పుడు మళ్లీ సస్పెన్స్ గా మారింది. ఒకవేళ వరంగల్ జిల్లా కేంద్రంలో కోదండరాం పోటీ చేస్తారా అన్నది కూడా చర్చనీయాంశమైంది. తాజా పరిస్థితులు బేరీజు వేస్తే కోదండరాం పోటీ చేయకుండా కూటమి సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది.

మొత్తానికి రెడ్డి కూటమి అన్న ముద్ర పడకుండా ఉండేందుకే కోదండరాం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

కోదండరాం కు మొహం చాటేసిన కాంగ్రెస్ పెద్దలు 

సీట్ల సర్దుబాటుపై మాట్లాడేందుకు ప్రయత్నం చేయగా కాంగ్రెస్ పెద్దలు ఫోన్లో అందుబాటులోకి రాలేదని కోదండరాం హైదరాబాద్ లో మీడియాతో చిట్ చాట్ లో చెప్పారు. తమకు, కాంగ్రెస్ కు మధ్య ఇంకా కొన్ని సీట్ల విషయంలో క్లియరెన్స్ రాలేదన్నారు. అందుకే తాము సీట్లను ఇంకా ప్రకటించలేదన్నారు. ఇప్పటి వరకు 6 సీట్లు క్లియర్ గా ఉన్నాయన్నారు. మరో రెండిoటి విషయం లో క్లియరెన్స్ రాలేదని చెప్పారు. మేము నిలబడే వాటి మీద ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఏమి ఉండదు అని తెలిపారు. 

జనగామ గురించి నేను ఏమి మాట్లాడను అని కోదండరాం ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాంగ్రెస్ వాళ్లు ఫోన్ కి అందుబాటులో కి రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ నుంచి జన సమితి కి క్లియరెన్స్ ఇచ్చిన సీట్లు

1.మల్కాజ్ గిరి

2.మెదక్

3.దుబ్బాక

4.సిద్ధిపేట

5.వర్ధన్నపేట

6.అంబర్ పేట

ఎస్సీ, ఎస్టీ కి కూడా సీట్ కేటాయించాలి అని కాంగ్రెస్ ను కోరినట్లు కోదండరాం వెల్లడించారు.