కాంగ్రెస్ పార్టీకి రేవంత్ వుండగా వేరే శతృవు ఎందుకు.?

కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య, గులాబీ పార్టీ గూటికి చేరబోతున్నారట.! వాస్తవానికి పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారతారన్నది ఇప్పటి మాట కాదు.! ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే ఆ ప్రచారం జరిగింది.

ఎలాగోలా కాంగ్రెస్ పార్టీలో పొన్నాల లక్ష్మయ్య నెట్టుకొచ్చేస్తున్నారు. పార్టీలో యాక్టివ్‌గానే వున్నారా.? అంటే, వున్నారంటే.. వున్నారంతే.! ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో మంత్రిగా పని చేశారు.. తెలంగాణలో ఆయన పీసీసీ చీఫ్‌గానూ పని చేశారు.

ఇప్పుడాయన పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది.? అంటే, ‘పార్టీలో సీనియర్లకు తగిన ప్రాధాన్యత దక్కడంలేదు’ అని అట. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్లను గౌరవించడంలేదంట.! రేవంత్ మీద తరచూ ఈ ఆరోపణ వస్తోంది. కానీ, కాంగ్రెస్ అధిష్టానం ఆయన్నే నమ్ముతోంది.

సరే, రేవంత్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవరూ సహకరించడంలేదన్నది బహిరంగ రహస్యం. కోమటిరెడ్డి బ్రదర్స్ తరచూ రేవంత్ రెడ్డితో గొడవలు పడేవారు. ఇద్దరూ కలిసి బీజేపీలోకి దూకేద్దామనుకున్నా, రాజగోపాల్ రెడ్డి మాత్రమే సాహసం చేశారు.. బొక్క బోర్లా పడ్డారు.

వాళ్ళ లెక్క వేరు.! పొన్నాల లక్ష్మయ్య పంచాయితీ వేరు. బీసీ నేత కావడంతో పొన్నాల వ్యవహారం, కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారుతోంది. దానికి తోడు, ‘నీకేం మాయ రోగం వచ్చింది.? చావడానికి దగ్గరవుతున్న వయసులో పార్టీ మారుతున్నావ్.?’ అంటూ పొన్నాల లక్ష్మయ్య మీద రేవంత్ రెడ్డి మండిపడిపోయారు.

ఇదే, ఈ నోటి దూలే.. రేవంత్ రెడ్డిని రాజకీయంగా ఇరికించేస్తోంది ప్రతిసారీ.! రేవంత్ రెడ్డి వుండగా, కాంగ్రెస్ పార్టీకి వేరే శతృవు లేదు. శతవిధాలా ప్రయత్నిస్తున్నాడాయన కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి.