ఆస్ట్రేలియాలో ముగ్గురు తెలుగువారు మృతి చెందడంతో నల్లగొండలో విషాదం నెలకొంది. ఆస్ట్రేలియాలోని మోనో బీచ్ లో సరదాగా ఆడుతూ అలల ప్రవాహానికి వారు నీటిలో గల్లంతయ్యారు. దీంతో ముగ్గురు ఆ నీటిలో కొట్టుకుపోయారు. వీరిలో ఇద్దరి మృతదేహాలు దొరకగా మరొకరి కోసం గాలిస్తున్నారు.
నల్లగొండ జిల్లాలోని మన్యం చెల్కకు చెందిన గౌసుద్దీన్, అతని అల్లుడు జునేద్, హైదరాబాద్ లోని బిహెచ్ ఈఎల్ కు చెందిన రాహత్ లు స్నేహితులు. వీరు సరదాగా బీచ్ కు వెళ్లారు. అలల ప్రవాహానికి కొట్టుకుపోవడంతో పోలీసులు వారి కోసం గాలింపు చేపట్టారు. గౌసుద్దీన్, రాహత్ ల మృతదేహాలు లభించగా జునేద్ మృతదేహం లభించలేదు. జునేద్ కోసం గాలిస్తున్నారు.
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు విదేశాల్లో మృతి చెందడంతో మన్యం చెల్కలో విషాద చాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గౌసుద్దీన్ కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించారు. ఆస్ట్రేలియాలో చనిపోయిన వారికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అన్నారు. వీలైనంత త్వరగా మృతదేహాలను భారత్‌కు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని ఆయన కోరారు.