‘‘తెలంగాణ జన సమితి అనే పార్టీ తెలంగాణ కోసం పుట్టింది కాదు.. ఆ పార్టీకి తెర మీద ఉన్న నాయకుడు కోదండరాం.. కానీ తెర వెనుక ముగ్గురు పెద్ద రెడ్లు ఉన్నారు. తెలంగాణలో ఒక బలమైన సామాజికవర్గం ప్రయోజనాలు కాపాడడమే ఆ పార్టీ ఉద్దేశం. జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఆ సామాజికవర్గం ప్రాధాన్యత తగ్గే పరిస్థితి ఉంటే కోదండరాం పార్టీని వారు బలోపేతం చేస్తారు. తక్షణమే కోదండరాం పార్టీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలంతా బయటకు రావాలి. కుల ప్రయోజనాల కోసం పెట్టిన ఆ పార్టీలో మిగతా బహుజన వర్గాలకు మేలు చేకూరదు’’
ఈ మాటలు అన్నది ఎవరో కాదు బహుజన మేధావి ప్రొఫెసర్ కంచ ఐలయ్య. తాజాగా వికారాబాద్ టి మాస్ సభలో ఆయన తెలంగాణ జన సమితి పార్టీతోపాటు, అధికార టిఆర్ఎస్ పార్టీలపై తీవ్రమైన విమర్శలు చేశారు. వికారాబాద్ సభలో ఐలయ్య మాట్లాడిన మాటలపై తెలుగు రాజ్యం వివరణ కోరిన సందర్భంలో ఆయన మరిన్ని అంశాలను వెల్లడించారు. ఆయన చెప్పిన అంశాలపై తెలుగు రాజ్యం సమగ్ర కథనం. చదవండి ఆయన మాటల్లోనే..
తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన తెలంగాణ జన సమితి కేవలం రెడ్డి సామాజికవర్గం వారి ప్రయోజనాలు కాపాడేందుకే తప్ప తెలంగాణ ప్రజల కోసం పుట్టింది కాదు. ఆ పార్టీకి తెర ముందు కనిపిస్తున్న నాయకుడు కోదండరాం అయితే తెర వెనుక ఉన్నది కాంగ్రెస్ సీనియర్ నేతలు జైపాల్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. వీరి ఫండింగ్ తోనే తెలంగాణ జన సమితి నడిపిస్తున్నారు. వారు ముగ్గురూ ప్రస్తుతం జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.
రేపటినాడు ఆ పార్టీ తెలంగాణలో ఆదరణ కోల్పోయినా లేకపోతే ఇంతకాలం రెడ్డీల పార్టీగా ఉన్న ఆ పార్టీ మిగతా వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి ఉన్నా అప్పుడు రెడ్లకు ఆల్ట్రనేట్ పార్టీగా జన సమితి ఉండాలన్న ముందుచూపుతోనే ఏర్పాటు చేశారు. ఈ మర్మాన్ని గుర్తించి వెంటనే కోదండరాం పార్టీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ కార్యకర్తలు, నాయకులంతా బయటకు రావాలి. ఆ పార్టీలో నాయకుడు కోదండరాం అయితే కార్యకర్తలు మాత్రం బడుగు, బలహీనవర్గాల వారే.
ఇక మరో ముఖ్యమైన విషయం ఏమంటే అసలు కోదండరాం రాజకీయ పార్టా నడపడానికి అర్హత కలిగిన మనిషి కాదు. ఎందుకంటే ఆయన ప్రభుత్వం నుంచి పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారు. ప్రభుత్వ పెన్షన్ తీసుకుంటూ ఒక రాజకీయ పార్టీని ఎట్లా నడుపుతాడు? రిటైర్డ్ అయిన ప్రొఫెసర్లు ప్రజల కోసం పనిచేయడంలో తప్పులేదు చేయాలి కూడా. కానీ ప్రభుత్వ సదుపాయాలు పొందుతూ ఒక రాజకీయ పార్టీని నడపడం మాత్రం తగదు. అసలు కోదండరాం నడిపే రాజకీయ పార్టీ యాంటీ నేషనల్ పార్టీ. యాంటీ నేషనల్ పార్టీగా జనాలు గుర్తించాలి. ఆ పార్టీని అలా అనుకోకుండా ఉండాలంటే కోదండరాం తక్షణమే ప్రభుత్వం నుంచి వచ్చే బెన్ఫిట్స్ తీసుకోకుండా ఉండాలి. లేదంటే రాజకీయ పార్టీ నుంచైనా ఆయన వైదొలగాలి. కోదండరాం ఇటు పెన్షన్ తీసుకుంటూ అటు రాజకీయ పార్టీ నడపడం యాంటీ నేషన్ కిందే లెక్క. పౌర వేదికలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల ద్వారా రిటైర్ అయిన పంతుళ్లు స్వచ్ఛందంగా పనిచేయవచ్చు. ఈ విషయంలో కోదండరాం స్పందించాలి.
ఇక ప్రజా కవి గద్దర్ రాసిన పాటలను టిఆర్ఎస్ పార్టీ కానీ, ప్రభుత్వం కానీ వాడుకోవడానికి వీలు లేదు. గద్దర్ రాసిన పాటలన్నీ ప్రజల ఆస్థి. వాటిని టిఆర్ఎస్ పార్టీ వేదికల మీద పాడితే సహించబోము. అలాగే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లోనూ గద్దర్ రాసిన పాటలు వాడుకోవడానికి వీలు లేదు. ఒకవేళ టిఆర్ఎస్ కు పాటలు కావాలంటే రాయించుకోవాలి తప్ప గద్దర్ రాసిన పాటలను మాత్రం వాడుకోరాదు.
అయినా వాడుకుంటే టి మాస్ కార్యకర్తలు నిరసన తెలుపుతారు. ఈ విషయంలో టిఆర్ఎస్ పార్టీ నేతలు జాగ్రత్తలు తీసుకోవాలి. టిఆర్ఎస్ అనే పార్టీ దొరల పార్టీ. ఫ్యూడలిస్టుల ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీ అయిన టిఆర్ఎస్ కు ప్రజల కోసం గద్దర్ రాసిన పాటలను వాడుకునే హక్కు లేదు.
ఈ అంశాలపై త్వరలోనే వాస్తవాలను జనాల ముందు ఉంచుతాం.