టేకుల కృష్ణారెడ్డి… వెలిమినేడు ప్రజలకు, ఆంజనేయ స్వామి దేవస్థాన భక్తులందరకి గుడి కాడ పంతులుగా సుపరిచితం. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులోని ఆంజనేయ స్వామి గుడిలో పూజలతో మంచి పేరును సంపాదించాడు. ఇప్పుడా గుడికాడ పంతులిక లేడు. అనారోగ్య సమస్యతో తనువు చాలించాడు. దీంతో అనేక మంది భక్తులు, ప్రజలు విషాదంలో మునిగి పోయారు. ఇంతకీ ఆ గుడి కాడ పంతులు కృష్ణారెడ్డి చరిత్ర ఏంటంటే….
వెలిమినేడు హైవే పక్కకు కొన్నేళ్ల కిందట ఆంజనేయ స్వామి వెలిశాడు. చిన్న బండరాయిగా ఉన్న ఆంజనేయ స్వామికి కృష్టారెడ్డి నిత్యం పూజలు చేసేవాడు. కృష్ణారెడ్డికి కళ్లు లేవు. అయినా కూడా నిత్యం అక్కడ పూజలు చేసేవాడు. తనకు చూపు లేకున్నా చేయి పట్టుకునే జాతకం చెప్పటంలో కృష్టారెడ్డి ప్రత్యేకత. క్రిష్టారెడ్డికి వివాహం కాలేదు. ఏ బండి వాహనం పూజకు వచ్చినా దూరంగా ఉన్న బండి నంబర్ ను కూడా చెప్పేవారని గ్రామస్థులు అంటున్నారు.
కాలక్రమంలో గుడికి వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో గుడి అభివృద్దిని గుర్తించిన ప్రభుత్వం దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం నియామకాలు జరిగాయి. అయినా కూడా కృష్టారెడ్డికి ఉన్నా ప్రత్యేకతతో అక్కడే అతనిని కూడా కొనసాగిస్తూ ఉద్యోగిగా తీసుకున్నారు. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే హైవే పక్కకు గుడి ఉండటంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అక్కడ ఆగేవారు. గుడికాడ పంతులు బాగా జాతకం చూస్తాడని నమ్మి చాలా మంది వచ్చేవారు. అవి నిజంగా కూడా జరిగేయని పలువురు భక్తులు అంటున్నారు.
మంచి పంతులుగా పేరు సాధించిన కృష్టారెడ్డి మరణంలో వింత జరిగింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ చనిపోయాడని డాక్టర్లు చెప్పగా అతనిని ఇంటికి తీసుకువస్తుండగా బ్రతికాడట.. శరీరం కదలడంతో వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కు తీసుకుపోయారు. అక్కడ చికిత్స పొందుతూ అర్దరాత్రి మరణించాడు. గుడికాడ పంతులు మరణంతో అంతా విషాదంలో మునిగిపోయారు.