లారీని తప్పించబోయి బోల్తా పడిన ట్రాక్టర్.. ప్రమాదంలో మరణించిన వ్యక్తి!

ప్రతిరోజు జరుగుతున్న రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటే మరి కొంతమంది తీవ్ర గాయాలు పాలై ప్రాణాలతో బయటపడినా కూడా జీవితాంతం అవిటివారిగా జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కొన్ని సందర్భాల్లో అనుకోని ప్రమాదం వల్ల నిమిషాలలో ప్రాణాలు కోల్పోతున్నారు.ఇటీవల తలుపుల మండలంలో జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు మరొక వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. తలుపుల మండలం గంజి వారి పల్లికి చెందిన షాబ్జాన్ అనే రాళ్ల వ్యాపారి గృహ నిర్మాణం కోసం ఉపయోగపడే రాళ్లను ట్రాక్టర్ లో తలుపులకు తరలిస్తున్నారు. అయితే తలుపులకు ఒక కిలోమీటర్ దూరంలో వెళుతుండగా ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ట్రాక్టర్ అదుపుతప్పి బోర్లా పడింది. ఈ ప్రమాదంలో షాబ్ జాన్ ట్రాక్టర్ డ్రైవర్ బాబర్ తో సహా మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాదం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని వెంటనే పులివెందుల ఆసుపత్రికి తరలించారు. షాబ్ జాన్ పులివెందుల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ట్రాక్టర్ డ్రైవర్ బాబర్ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.