మామ వేధింపులు భరించలేక అఘాయిత్యానికి పాల్పడిన అల్లుడు..?

సాధారణంగా పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్లిన అమ్మాయిలకు అత్తింటి వారి తరఫునుండి వేధింపులు ఉండటం సహజం. అయితే కొంతమంది వారి వేధింపులను భరిస్తూ భర్తతో కలిసి జీవిస్తూ ఉంటారు. మరి కొంతమంది అమ్మాయిలు వారి వేధింపులు భరించలేక విడాకులు తీసుకుని భర్తకు దూరంగా ఉంటారు. అయితే మరి కొంతమంది మాత్రం ఆ వేధింపులకు మనస్థాపం చెంది ప్రాణాలు తీసుకుంటారు. అయితే ప్రస్తుత కాలంలో అమ్మాయిలకు మాత్రమే కాకుండా అబ్బాయిలకి కూడా అత్తింటి వారి నుండి వేధింపులు ఉన్నాయి. ఇటీవల ఇటువంటి ఎన్నో సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా కూడా ఇటువంటి సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మామ వేధింపులు భరించలేక అల్లుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది.

వివరాలలోకి వెళితే… నిజామాబాద్ జిల్లాకి చెందిన సందీప్ అనే వ్యక్తికి నవీపేట మండలానికి చెందిన ప్రియ అనే మహిళతో కొంతకాలం క్రితం వివాహం జరిగింది. వివాహం తర్వాత వ్యాపారం ప్రారంభించడానికి సందీప్ తన మామ సహాయంతో ఐదు లక్షల రూపాయలు ఇతరుల వద్ద అప్పు తీసుకున్నాడు. అయితే సందీప్ ప్రారంభించిన వ్యాపారంలో నష్టాలు రావడంతో అనుకున్న సమయానికి తిరిగి అప్పు చెల్లించలేకపోయాడు. అయితే ఐదు లక్షల రూపాయలు అప్పు ఇప్పించిన మామ మాత్రం తరచు అప్పు చెల్లించమని అల్లుడి ని వేదిస్తూ ఉండేవాడు.

ఈ క్రమం లో ఇటీవల కూడా మరదలు పెళ్లికి వెళ్లిన సందీప్ ను అందరి ముందు అప్పు గురించి నిలదీస్తూ తన మామ అవమానించాడు. ఇలా అందరి ముందు తనని అవమానించడంతో సందీప్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. డబ్బుల కోసం కన్న కూతురి పసుపు కుంకాలు తెగిపోయే పరిస్థితిని తీసుకొచ్చాడు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సందీప్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక సందీప్ చావుకు కారణమైన అతని మామ మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.