విద్యార్థుల పాలిట మృత్యువులా మారిన స్కూల్ వ్యాన్.. ఒకరి మృతి మరొకరికి తీవ్ర గాయాలు..!

దేశంలో రోజురోజుకీ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది. ఈ ప్రమాదాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలలో తీరనిలోటు మిగులుస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల మరికొంతమంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారుతున్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టటానికి ఎన్ని చర్యలు తీసుకున్న కూడా రోజురోజుకీ ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మంగళవారం ఉదయం ఇబ్రహీంపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా మరొక విద్యార్థి తీవ్ర గాయాలతో ప్రాణాలతో పోరాడుతున్నాడు.

వివరాలలోకి వెళితే…ఇబ్రహీంపట్నం పరిధిలోని శేరిగుడలో మంగళవారం ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థుల పైకి ఓ ప్రైవేట్‌ స్కూల్ వ్యాన్‌ దూసుకెళ్లాటంతో ఒక విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నిమిషాల వ్యాధిలో జరిగిన ఈ ప్రమాదం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా.. మృతి చెందిన విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదం గురించి పోలీసులు విచారణ చేయడంతో ఈ ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థి స్థానికుడు కాదని అతను బీహార్ కుటుంబానికి చెందిన వ్యక్తిగా స్థానికులు వెల్లడించారు. ఇక మరొక విద్యార్థి వివరాలు తెలుసుకొని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యాడు. దీంతో స్థానికులు, బాధితుల కుటుంబ సభ్యులు సాగర్ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగి వారికి సర్ది చెప్పి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.