బీహార్‌లోని పూర్ణియా జిల్లాలో మోహని గ్రామం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కారణం అక్కడ ఓ నకిలీ పోలీస్ స్టేషన్ నెలకొల్పడం. పోలీసులు కాదని భావించిన వారే అక్రమ రవాణాకారులు, స్థానిక యువతని మభ్యపెట్టి ఉద్యోగాలు ఇప్పిస్తామని వసూళ్లకు పాల్పడటం చూసినవారంతా నోరెళ్లబెట్టారు. రాహుల్‌కుమార్ షా అనే వ్యక్తి ఈ మొత్తం నాటకం వెనుక సూత్రధారి. పోలీస్ అధికారిగా నటిస్తూ గ్రామంలో భయపెట్టే స్థాయిలో వ్యవహరించడమే కాకుండా, యథేచ్ఛగా రెయిడ్లు, వసూళ్లు చేసేశాడు.
అతడి ఎత్తుగడలు మాత్రం చాలా ప్లాన్‌తో సాగాయి. “గ్రామీణ రక్షాదళ్‌లో జాబ్ ఇప్పిస్తాను” అనే నమ్మకంతో వందల మందిని ఆకట్టుకున్నాడు. ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 2,500 నుంచి రూ. 5,000 వరకు వసూలు చేశాడు. వారు ఉద్యోగంలో చేరిన భావనలో నకిలీ పోలీసు యూనిఫాంలు, లాఠీలు, ఐడీ కార్డులు ధరిస్తూ అసలైన పోలీసుల్లా గ్రామాల్లో గస్తీలు వేశారు. అక్కడే ఆగలేదు, మద్యం అక్రమ రవాణాపై దాడులు, దొరికిన బాటిళ్లను లంచాలు తీసుకుని తిరిగి వదలడం, వాటిలో వచ్చిన డబ్బును షేర్ చేసుకోవడం ఇలా ఫుల్ స్కెచ్ చేశాడు.
ఈ నకిలీ పోలీస్ వ్యవస్థ దాదాపు ఏడాది పాటు ఏ మాత్రం సందేహం కలగకుండా కొనసాగడం పోలీసు వ్యవస్థపై ప్రశ్నల్ని రేపింది. గ్రామస్తులెవరూ ఏనాడు అనుమానం వ్యక్తం చేయలేకపోవడం అతని నటనకు నిదర్శనం. ఈ వ్యవహారం బయటపడిన వెంటనే రాహుల్ కుమార్ షా పరారయ్యాడు. ప్రస్తుతం పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
ఇంతవరకూ కనిపించని కొత్త తరహా మోసం ఇది. నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటుచేయడం, నకిలీ అధికారులతో రాబడి పొందడం సినిమా కథకంటే తక్కువేమీ కాదు. ప్రజలు ఇకపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మోసగాళ్ల తెలివితేటలకు బలయ్యే ముందు అధికారిక సమాచారం తీసుకోవాలన్న హెచ్చరిక మరోసారి నిజమైంది.