అంచనాలను తారుమారు చేసిన బీహార్ మహిళలు..! ఎన్డీఏ విజయానికి అసలు కారణం ఇదే..!

బీహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఈసారి పూర్తిగా మహిళా ఓటర్ల ఆధీనంలో జరిగాయని చెప్పాలి. రెండు దశాబ్దాల అధికారానికి వ్యతిరేకత పెరుగుతుందన్న అంచనాలన్నీ చెదరగొట్టుతూ.. ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. ఈ విజయానికి నిజమైన బలం మహిళా ఓటర్లు. ప్రచార దశలో ప్రకటించిన ‘ముఖ్యమంత్రి మహిళా రోత్‌గార్ యోజన’ కింద 75 లక్షల మహిళల బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరికీ రూ.10,000 చొప్పున జమ కావడం ఎన్నికల వాతావరణాన్నే మార్చేసిందని విశ్లేషకులు అంటున్నారు.

ఇదే తరహా నగదు బదిలీ పథకాలు మధ్యప్రదేశ్‌లో ‘లాడ్లీ బహన్’, మహారాష్ట్రలో ‘లాడ్కీ బహిన్’ రూపంలో భారీ ఫలితాలను ఇచ్చాయి. ఆ రాష్ట్రాల్లోలాగే బీహార్‌లో కూడా మహిళలకు ప్రత్యక్ష లాభం చేరిన క్షణం నుంచే ఎన్నికల గాలి ఎన్డీఏ వైపు తిరిగింది. ఈసారి పోలింగ్ శాతం 66.91 శాతంగా నమోదైనప్పటికీ, మహిళల ఓటింగ్ మాత్రం 71.6% దాటడం ప్రత్యేకత. ప్రత్యర్థి ఆర్జేడీ చివరి నిమిషంలో ప్రకటించిన రూ.30,000 హామీ కూడా మహిళా ఓటర్ల నిర్ణయాన్ని మార్చలేకపోయింది.

మొత్తం మీద, బీహార్ ఫలితాలు ఒక స్పష్టమైన సందేశం ఇస్తున్నాయి.. ప్రత్యక్ష నగదు బదిలీలు ఇప్పుడు రాజకీయాల్లో అత్యంత ప్రభావశీలమైన ఆయుధం. మహిళల మనసు గెలిచినవారే ఎన్నికల యుద్ధంలో గెలుస్తున్నారనడానికి బీహార్ మరో తాజా ఉదాహరణగా నిలిచింది.