ముసలోల్ల ఓట్లు సరే, కేసిఆర్ నోట ఆ ముచ్చటే రాదే ?

తెలంగాణలో మరో మూడు రోజుల్లోనే ప్రచార పర్వానికి తెర పడనుంది. ముందస్తు ఎన్నికలకు తెర తీసిన కేసిఆర్ తెలంగాణ అంతటా కలియదిరుగుతున్నారు. గాలి మోటార్ లో కుసోని మెరుపు వేగంతో జిల్లాలన్నీ చక్కర్లు కొడుతున్నారు. జనాలకు ఏం చేస్తున్నామో చెబుతున్నారు. ఏం చేశామో చెబుతున్నారు. ఏం చేయబోతున్నామో చెబుతున్నారు. కానీ తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష, ఉద్యమ ట్యాగ్ లైన్ లో భాగమైన ఒక కీలకమైన అంశం మీద మాత్రం కేసిఆర్ నోరు విప్పడంలేదు. ఎక్కడా ఆ ముచ్చటే మాట్లాడ్తలేరు. కావాలని మరుగునపరుస్తున్నరా? లేదంటే మరచిపోయి మాట్లాడ్తలేరా? ఎందుకు ఆ ముచ్చటెత్తడంలేదు? తెలంగాణ యూత్ గురించి కేసిఆర్ మాట్లాడలేని పరిస్థితి ఉందా? పూర్తి వివరాలు చదవండి.

నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడు తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్ లైన్స్. ఈ మూడు అంశాల చుట్టే తెలంగాణ ఉద్యమం సాగింది. తెలంగాణ నీళ్లు ఆంధ్రులు దోచుకుపోతున్నారని, తెలంగాణ నిధులు కొల్లగొడుతున్నారని (మిగులు బడ్జెట్ తో ఉన్న విషయం), తెలంగాణ యువతకు రావాల్సిన ఉద్యోగాలు ఆంధ్రోళ్లు చేజిక్కించుకుంటున్నారని యావత్ తెలంగాణవాదులు ఉద్యమ సమయంలో ప్రస్తావించారు. టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ కాలంలో పొద్దున లేస్తే ఈ మూడు ముచ్చట్ల చుట్టే రాజకీయం నడిపింది. అంతిమంగా తెలంగాణ వచ్చింది. మరి ఈ ఆకాంక్షల్లో కీలకమైన నియామకాల గురించి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో కలవరం రేగుతున్నది. కేసిఆర్ సైతం ఆ ముచ్చట ఎత్తేందుకు బహిరంగసభల్లో జంకుతున్న పరిస్థితి ఉంది. మరి ఆ ముచ్చట మాట్లాడకుండానే ముందస్తు ఎన్నికల గోదా ఈదుదామని టిఆర్ఎస్ అధినేత భావిస్తున్నారా?

గులాబీ దళపతి ఏ బహిరంగసభలో నైనా తన నాలుగున్నరేళ్ల పాలనలో ఎన్ని కొలువులు ఇచ్చారు? ఎన్ని కొలువులు ఇవ్వాలనుకున్నారు? ఎన్ని కొలువులు ఇవ్వలేకపోయారు? భవిష్యత్తులో మళ్లీ అధికారంలోకి వస్తే ఎన్ని కొలువులు ఇవ్వాలనుకుంటున్నారు. ఈ అంశాల మీద ఎక్కడ కూడా సింగిల్ కామెంట్ కూడా చేయడంలేదు. ముసలోళ్లకు వెయ్యి పించన్ ఇచ్చినం అని వెయ్యిసార్లు చెప్పుకొచ్చారు. యాదవులకు గొర్లు ఇచ్చామని, లక్షల గొర్రెపిల్లలు పుట్టినయని చెబుతున్నరు. 24 గంటల కరెంటు గురించి గొప్పలు చెప్పుకున్నరు. రైతు బంధు గురించి, రైతు భీమా గురించి మాట్లాడినారు. కానీ నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలిచ్చామన్న ముచ్చటను స్కిప్ చేసేస్తున్నారు.

తెలంగాణ రాకముందు ఉద్యమకాలంలో కేసిఆర్ గొంతెత్తి నినదించిన ముచ్చటేందంటే తెలంగాణ వస్తే ఒక్కటంటే ఒక్క దెబ్బకు లక్ష ఉద్యోగాలు వస్తాయని యువతకు లేని ఆశలు చూపారు. కానీ నాలుగున్నరేళ్ల తన పాలనలో ఆ ఒక్క దెబ్బ కొట్టలేదు. లక్ష కొలువులు ఇయ్యలేదు. గిచ్చి గిచ్చి గిల్లి గిల్లి ఇచ్చిన కొలువులెన్ని అంటే అంతా కలిపితే 25వేలు దాటలేదు. మరి ఉద్యమంలో అలా మాట్లాడి, తర్వాత పాలనలో ఎందుకు చేతులెత్తేశారు? అన్నదానికి సమాధానం చెప్పకుండానే ఎన్నికల తతంగం ముగించేయాలనుకుంటున్నట్లు కనబడుతున్నది.

మరీ దారుణమైన విషయం ఏమంటే? కూటమి నేతలు ఎప్పటినుంచో నిరుద్యోగ భృతి ఇస్తామని అంటున్నారు. నిరుద్యోగ భృతి మీద అప్పట్లో కేసిఆర్ ఏతేష్కం చేశారు. అసలు ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో కాంగ్రెసోళ్లకు లెక్క తెలుసా అని ఎగతాళి చేశారు. యూత్ అంతా కూటమికే జై కొడతదేమో అని భయంతో కూటమి 3వేల భృతి ఇస్తానంటే మేము 3016 కట్నం ఇస్తామని మాటలు చెబుతున్నారు. కానీ ఏ లెక్కన ఇస్తారో, ఎంత మందికి ఇస్తారో, ఎప్పటి నుంచి ఇస్తారో మాత్రం చెప్పడంలేదు. ఈ స్కీమ్ మరో నాలుగేళ్లయినా షురూ అయితదో కాదో అని యూత్ జోక్స్ వేసుకుంటున్నారు.

ఇక కూటమి మాత్రం స్పష్టంగా తొలి ఏడాదిలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని, 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తామని అంటున్నారు. లక్షలోనే 20వేల తో మెగా డిఎస్సీ వేస్తామని భరోసా కల్పిస్తున్నారు. ఉద్యోగ క్యాలెండర్ ఇస్తామని స్పష్టమైన హామీ ఇస్తున్నారు. కానీ కేసిఆర్ మాత్రం యూత్ ను అసలు లెక్క చేయకుండానే ముసలి ఓట్లతోనే గెలిచిపోదామన్న భావనలో ఉన్నట్లు కనబడుతున్నది. ఉద్యోగాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో గొర్లు, బర్ల ముచ్చట చెబుతుంటే యువత ఆందోళనతో రగిలిపోతున్నది. దేశంలోనే నెంబర్ వన్ అని చెప్పుకుంటున్న టిఎస్పిఎస్సీ అభాసుపాలైంది. యువత జీవితాలతో చెలగాటమాడుతున్నది. వేసిన ప్రతి నోటిఫికేషన్లో కొర్రీలు పెట్టడంతో కోర్టుల్లో చివాట్లు తింటున్నది. ఈ పరిస్థితుల్లో యూత్ కు నిరుద్యోగ భృతి పేరుతో మాయ చేసే ప్రయత్నం చేస్తున్నది టిఆర్ఎస్. 

చైతన్యానికి పెట్టింది పేరైన తెలంగాణలో యూత్ చుట్టే రాజకీయాలు తిరుగుతున్న ఈ సయమంలో ముసలి ఓట్లు వస్తే చాలు, ఆసరా పెన్షనర్ల ఓట్లొస్తే చాలు గెలిచిపోతామని భ్రమల్లో ఉన్న టిఆర్ఎస్ ఏరకంగా గట్టెక్కుతుందో అన్న చర్చ జరుగుతున్నది. ఉద్యోగాలు ఇవ్వలేని విషయం చెప్పక, మళ్లీ వస్తే ఉద్యోగాలు ఎలా ఇస్తారో చెప్పకుండా అధికారం సాధ్యమేనా అన్నది చూడాలి.

యూత్ ను మోసం చేసిన కేసిఆర్ ఎట్లొస్తడో చూస్తాం : ఓయు బాలలక్ష్మి

రాహుల్ గాంధీతో బాల లక్ష్మి

తెలంగాణ వస్తే ఉద్యోగాలొస్తాయని మాయ మాటలు చెప్పిన కేసిఆర్ అధికారంలోకి రాగానే ఉద్యోగాల ముచ్చటే మరచిపోయిండని ఓయూ జెఎసి నాయకురాలు బాల లక్ష్మి ఆరోపించారు. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇయ్యలేదు కానీ ఆయన బిడ్డలకు, అల్లుడికి పెద్ద ఉద్యోగాలు ఇచ్చుకున్నడు అని విమర్శించారు. పెన్షన్ తీసుకునే తల్లిదండ్రులు తమకు పెన్షన్ రాకపోయినా సరే తమ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చి వాళ్లు బాగుండాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఇంట్లో కొడుకు బిడ్డ కొలువులు లేక అవస్థలు పడుతుంటే కేసిఆర్ సర్కారు ఇచ్చిన వెయ్యి రూపాయల పెన్షన్ తీసుకున్న తల్లిదండ్రులు టిఆర్ఎస్ కు సంతోషంగా ఓట్లెలా వేస్తారని ప్రశ్నించారు. ప్రకృతిలో ప్రతి జీవి భవిష్యత్ తరాలు బాగుండాలని కోరుకుంటాయని, తాము కష్టాలు పడ్డా సరే తమ బిడ్డలకు మంచి జరగాలని ప్రతి తల్లిదండ్రులు కోరతారని అన్నారు. అలాంటిది ముసలోల్లకు పెన్షన్లు ఇస్తే వాళ్ల బిడ్డలకు కడుపు నిండిపోయిందా అని ఆమె ప్రశ్నించారు. యువత సత్తా ఏంటో మరోసారి రుజువు చేయబోతున్నామని కేసిఆర్ ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకోకతప్పదని హెచ్చరించారు బాలలక్ష్మి.

జాతీయ మీడియాలో ఓయూ స్టూడెంట్స్ ఇంటర్వ్యూ కింద ఉంది.