ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన దంపతులు.. చావులో కూడా ఒకరికొకరు తోడుగా..!

దేశానికి వెన్నెముకల నిలుస్తూ అందరికీ అన్నం పెడుతున్న రైతులే కష్టాల పాలవుతున్నారు. వర్షాలు సరిగా పడక పెట్టిన పంటలు చేతికందకపోవటంతో నష్టాలు ఎదుర్కొంటున్నారు. మరి కొంతమంది రైతులు అప్పులు చేసి మరి పెట్టుబడి పెట్టి పంటలు వేస్తుంటే నష్టాలు రావడంతో అప్పుల బాధ పెరిగి వాటిని తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇటువంటి విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పుల బాధతో భార్యాభర్తలిద్దరూ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

వివరాలలోకి వెళితే…ముట్రాజ్ పల్లి గ్రామానికి చెందిన ఆకుల భాషయ్య , ఆకుల శివమ్మ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు. ముగ్గురు పిల్లలకు పెళ్లిళ్లు అయి జీవితంలో స్థిరపడ్డారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భాషయ్య శివమ్మ దంపతులు పంట పెట్టుబడి కోసం, పొలంలో బోర్ తవ్వించటం కోసం తెలిసిన వారి దగ్గర దాదాపు రూ. 4 లక్షల వరకు అప్పులు చేశారు. అయితే బోరు బావిలో చుక్క నీరు రాకపోగా పెట్టిన పంట చేతికందక నష్టాలు ఎదురయ్యాయి.

దీంతో దంపతులిద్దరూ అప్పులు ఎలా తీర్చాలో తెలియక సతమతమవుతూ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున వారు నివసిస్తున్న ఇంట్లో దూలానికి ఉరి వేసుకొని ఇద్దరూ ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం తెల్లారిన తర్వాత చాకలి మంగమ్మ బట్టలు ఉతకడానికి ఇంటికి వచ్చి ఎంతసేపటికి తలుపు తీయకపోవటంతో బలవంతంగా తలుపులు తీసి చూసింది. ఆ సమయంలో ఇద్దరు ఒకే తాడుకి ఉరివేసుకొని కనిపించడంతో ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి తెలియజేసింది. ఈ విషయం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని స్థానికులను విచారించిన అప్పుల బాధ భరించలేక ఈ దంపతులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. కుమారుడు నరేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దంపతులిద్దరూ ఇలా ఒకేసారి మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.