తెలంగాణ ఎన్నికల్లో ఈ మూడు చోట్ల ఉత్కంఠ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు నియోజకవర్గాల ఫలితం లేలకుండా పెండింగ్ లో పడింది. ఈ మూడు చోట్ల తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హోరాహోరీగా సాగడంతో గెలుపు ఎవరిదన్న ముచ్చట తేల్చడానికి బాగా సమయం పట్టింది. ఆ మూడు నియోజకవర్గాలేవి? చదవండి.

రంగారెడ్డి జిల్లాలో 14 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాల్లో కౌంటింగ్ పూర్తయింది. 10 సీట్లలో టిఆర్ఎస్ మూడు సీట్లలో కాంగ్రెస్ గెలిచింది. కానీ ఇబ్రహింపట్నంలో ఉత్కంఠ కొనసాగుతున్నది. ఈ కైంటింగ్ లో 22 రౌండ్లు కౌంటింగ్ జరగాల్సి ఉంది. అయితే కొన్ని ఇవిఎం లు మొరాయించాయి. దీంతో కౌంటింగ్ ఆలస్యమవుతున్నది. ఇక్కడ పోస్టల్ బ్యాలెట్లను రెండుసార్లు లెక్కపెట్టారు. అయినా క్లారిటీ రాలేదు. ఇబ్రహింపట్నంలో టిఆర్ఎస్ తరుపున మంచిరెడ్డి కిషన్ రెడ్డి పోటీ చేశారు. అలాగే బిఎస్పీ తరుపున మల్ రెడ్డి రంగారెడ్డి (కాంగ్రెస్ రెబెల్) ఉన్నారు. ఈ నియోజకవర్గంలో రౌండ్ రౌండ్ కూ ఆధిక్యతలు మారి కౌంటింగ్ ఉత్కంఠ రేపింది.  ప్రస్తుతం లీడ్ లో ఉన్నారు. ఇక్కడ వివి ప్యాట్ లను లెక్కించారు. తుదకు మంచిరెడ్డి కిషన్ రెడ్డి 800 ఓట్ల తేడాతో గెలిచినట్లు ప్రకటించారు. 

ఇక కోదాడలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డి, టిఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ మధ్య గెలుపు దోబూచులాడింది. చివరకు 668 ఓట్లతో బొల్లం మల్లయ్య యాదవ్ గెలిచారు. ఇక్కడ కూడా ఇవిఎం లు మొరాయించాయి. ఒక దశలో కౌంటింగ్ ను ఆపాలని ఉత్తమ్ పద్మావతిరెడ్డి డిమాండ్ చేశారు. అన్ని ఇవీఎం లను రీకౌంటింగ్ చేయాలని పద్మావతిరెడ్డి డిమాండ్ చేశారు. అయితే రజత్ కుమార్ కు లేఖ రాశారు పద్మావతిరెడ్డి. కోదాడలో ఇవిఎంలు పనిచేయకపోవడంతో వివి ప్యాట్ లను లెక్కించారు. తుదకు బొల్లం మల్లయ్య యాదవ్ గెలుపును ఖరారు చేశారు.

ఇక నల్లగొండ నియోజకవర్గంలోని తుంగతూర్తిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తుంగతూర్తిలో ఈవీఎం లు మొరాయించాయి. దీంతో వివి ప్యాట్ లను లెక్కించారు. దీంతో ఫలితం ఆలస్యమైంది. సాయంత్రం 7.30 గంటల సమయానికి తుంగతూర్తి మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో కౌంటింగ్ పూర్తయింది. 

తెలంగాణలో టిఆర్ఎస్ 87 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ 19 సీట్లకు పరిమితం అయింది. టిడిపి 2 సీట్లకే పరిమితం కాగా బిజెపి ఒక స్థానానికి పరిమితమైంది. ఇక ఎంఐఎం సత్తా చాటి 7 సీట్లలో గెలిచింది. ఇద్దరు ఇండిపెండెంట్లు గెలిచారు. తెలంగాణలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీల్లో టిఆర్ఎస్, కాంగ్రెస్, టిడిపి, బిజెపి, ఎంఐఎం పార్టీలకు చోటు దక్కింది. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ జన సమితి అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయింది. అంతేకాకుండా సిపిఐ, సిపిఎం కూడా కాలు పెట్టలేకపోయాయి.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే తెలంగాణ అసెంబ్లీలో టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి, ఎంఐఎం, వైసిపి,  సిపిఐ, సిపిఎం, బిఎస్పీ పార్టీలు కాలు పెట్టగా అసెంబ్లీ రద్దు నాటికి సిపిఐ, బిఎస్పీ,  వైసిపి పార్టీలు టిఆర్ఎస్ లో విలీనమయ్యాయి. ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బతో కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలు పోటీ పడి టిఆర్ఎస్ లో చేరిపోయారు.