తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఒక పార్టీలో సీటు ఆశిస్తే ఇంకో పార్టీలో టికెట్ దక్కడం సంచలనం రేపుతున్నది. తెలంగాణలో యాదవ సామాజికవర్గానికి కాంగ్రెస్ నేతృత్వంలోని మహా కూటమి అన్యాయం చేసింది. గొల్ల, కుర్మ సామాజికవర్గానికి చెందిన వారికి కేవలం ఒకే సీటు ఇచ్చింది మహా కూటమి. మహా కూటమి పొత్తులో భాగంగా కొందరు నేతలు సీట్లు త్యాగం చేయాలని కాంగ్రెస్ సూచించింది. అయితే త్యాగం చేసే సీట్ల జాబితాలో యాదవ నేతల పేర్లు ఉంచింది.
దీంతో తెలంగాణలో కేవలం ముషీరాబాద్ లో మాత్రమే అనీల్ కుమార్ యాదవ్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. మిగిలిన స్థానాల్లో మొండిచేయి చూపింది. ఒకవైపు కూటమి కోసం త్యాగం చేయాలంటూనే పిసిసి చీఫ్ మళ్లీ తన కుటుంబంలో ఇద్దరుంటే ఇద్దరికి టికెట్లు తెచ్చుకున్నారు. ఉత్తమ్ హుజూర్ నగర్ లో, ఆయన సతీమణి కోదాడలో పోటీ చేయబోతున్నారు.
దీంతో కోదాడలో బలమైన అభ్యర్థిగా ఉన్న టిడిపి నేత బొల్లం మల్లయ్య యాదవ్ తన దారి తాను చూసుకున్నారు. రెబెల్ గా బరిలోకి దిగాలనుకున్నాడు. కానీ టిడిపి అంగీకరించలేదు. దీంతో చేసేదిలేక ఆయన టిఆర్ఎస్ గూటికి చేరారు. ఆయనకు కండువా కప్పిన టిఆర్ఎస్ పార్టీ గంటల తేడాతోనే కోదాడ సీటును బొల్లం మల్లయ్య యాదవ్ కు అనౌన్స్ చేసింది.
బొల్లం మల్లయ్య యాదవ్ కు టికెట్ ఇవ్వడంతో టిఆర్ఎస్ అధికారికంగా ఆరు సీట్లు యాదవ సామాజికవర్గానికి కట్టబెట్టినట్లైంది. నఃల్లగొండ జిల్లాలోనే రెండు సీట్లు యాదవులకు ఇచ్చింది టిఆర్ఎస్. నాగార్జున సాగర్ లో నోముల నర్సింహ్మయ్యకు ఇవ్వగా, కోదాడలో బొల్లం మల్లయ్య యాదవ్ కు ఇచ్చింది.
దాంతోపాటు మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తిలో జైపాల్ యాదవ్ కు సీటు ఇచ్చింది. షాద్ నగర్ సీటును తిరిగి అంజయ్య యాదవ్ కు ఇచ్చింది. ఇక హైదరాబాద్ లోని నాంపల్లి సీటును సతీష్ కుమార్ కు కట్టబెట్టింది టిఆర్ఎస్. సనత్ నగర్ సీటును తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఇచ్చింది.
ఒకవైపు యాదవులను కాంగ్రెస్ పార్టీ అవమానించిందంటూ ఆ సామాజికవర్గం నేతలు గాంధీభవన్ ముందు ఆందోళన చేస్తుండగా టిఆర్ఎస్ మాత్రం వ్యూహాత్మకంగా గతంలో ఐదు సీట్లకు తోడు మరో సీటును యాదవ సామాజికవర్గానికి కేటాయించి కాంగ్రెస్ గొంతులో పచ్చి వెలక్కాయ వేశారు. మరి యాదవులకు ఎందుకు అవకాశాలు కల్పించలేకపోయారో కాంగ్రెస్ నేతలు ఏం జవాబు చెబుతారో చూడాలి.
ముఠాగోపాల్ కు ముషీరాబాద్
టిఆర్ఎస్ పార్టీలో చేరిన టిడిపి నేత ముఠా గోపాల్ కు ముషీరాబాద్ సీటును కేటాయించారు కేసిఆర్. ఆ సీటులో హోంంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి ఆశించారు. ఆయనేకాదు ఆయన అల్లుడు శ్రీనివాస్ రెడ్డి కూడా రేస్ లో ఉన్నారు. కానీ వారిద్దరినీ కాదని బిసి మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన ముఠా గోపాల్ కు కేసిఆర్ సీటును ఖరారు చేశారు. ఈ సీటు కోసం నాయిని గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ ఆయనను బుజ్జగించిన తర్వాతే కేసిఆర్ ముషీరాబాద్ సీటును అనౌన్స్ చేశారు.
ముషీరాబాద్ సీటు విషయంలో గత కొంతకాలంగా నాయిని ఆవేదనతో ఉన్నారు. తనకు కానీ, తన అల్లుడు శ్రీనివాస్ రెడ్డికి కానీ ఇవ్వాలని కోరుతున్నాడు. కానీ ఆయనకు మొండిచేయి చూపారు. ఆయనను బుజ్జగించి ముఠాగోపాల్ కు ఇచ్చారు. రేపు నాయిని చేతుల మీదుగానే ముఠా గోపాల్ కు బి ఫామ్ ఇవ్వాలని కేసిఆర్ నాయినిని ఆదేశించారు.
కోదాడలో అనూహ్య పరిణామాలు
కోదాడ నియోజకవర్గంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. గతంలో టిడిపి తరుపున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన బొల్లం మల్లయ్య యాదవ్ ఈసారి టిఆర్ఎస్ తరుపున పోటీలో ఉండబోతున్నారు. గతంలో కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన ఉత్తమ్ పద్మావతిరెడ్డి తిరిగి కాంగ్రెస్ కూటమి తరుపున పోటీలో ఉన్నారు. అయితే బొల్లం మల్లయ్య యాదవ్ కు కూటమిలో భాగంగా టిడిపి టికెట్ వస్తుందని ప్రచారం సాగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఫ్యామిలీలో ఒక సీటు త్యాగం చేస్తారని ప్రచారం నడిచింది. కానీ సిట్టింగ్ లకు సీట్లు అనే కోటాలో ఉత్తమ్ పద్మావతికి టికెట్ దక్కింది. దీంతో బొల్లం మల్లయ్య యాదవ్ కు మొండి చేయి చూపారు.
బొల్లం వెంటనే టిఆర్ఎస్ లో చేరిపోయారు. ఆయన రాకతో అప్పటి వరకు టిఆర్ఎస్ లో సీటు ఆశిస్తున్న శశిధర్ రెడ్డి, వేనేపల్లి చందర్ రావు ల బదులు బొల్లం మల్లయ్యకు సీటు దక్కింది. కొద్దిసేపటి క్రితమే టిఆర్ఎస్ అధికారికంగా బొల్లం మల్లయ్య యాదవ్ పేరు, ముఠా గోపాల్ పేరు (ముషీరాబాద్) ను వెల్లడించింది.
మహా కూటమిలో అవకాశం కోల్పోయిన యాదవ ప్రముఖ నాయకులు
భిక్షపతి యాదవ్ – శేర్ లింగంపల్లి
తోటకూర జంగయ్య యాదవ్ – మేడ్చల్
రాజారాం యాదవ్ – బాల్కొండ
క్యామ మల్లేష్ – ఇబ్రహింపట్నం