కూటమి పొగ, టిఆర్ఎస్ లో చేరిన మరో బిసి నేత

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ చేరికలు ఇంకా సద్దుమణగలేదు. ఇప్పటి వరకు పనిచేసిన పార్టీలో టికెట్ రాని వారు ఆగ్రహంతో, ఆవేశంతో, భవిష్యత్తు కోసం, తనకు కాదని టికెట్ ఇచ్చిన అభ్యర్థిని ఓడగొట్టడం కోసం ఇంకా పార్టీలు మారుతూనే ఉన్నారు. పోను పోనంటూనే పోతున్నారు… లేదు లేదంటూనే ఉన్న పార్టీకి గుడ్ బై చెప్పి పక్క పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు.

తాజాగా ఇబ్రహింపట్నంలో టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ బహిరంగసభలో పాల్గొన్నారు. ఇబ్రహింపట్నం తాజా మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి కి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత, మాజీ రంగారెడ్డి డిసిసి అధ్యక్షులు క్యామ మల్లేష్ కేసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. క్యామ మల్లేష్ చేరిన తర్వాత టిఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపరేలరని కేసిఆర్ సభలో పేర్కొన్నారు. క్యామ మల్లేష్ కూడా చేరడంతో ఇబ్రహీంపట్నంలో లక్ష మెజార్టీతో గెలవడం ఖాయం. క్యామ మల్లేష్ కు టిఆర్ఎస్ లో అతి త్వరలోనే మంచి స్థానం కల్పిస్తామని కేసిఆర్ హామీ ఇచ్చారు. క్యామ మల్లేష్ చదవుకున్నవాడు. ఆయనకు తప్పకుండా టిఆర్ఎస్ లో సముచిత స్థానం కల్పించే బాధ్యత నాది అని కేసిఆర్ స్పష్టం చేశారు. 

క్యామ మల్లేష్, మాజీ కాంగ్రెస్ నేత

క్యామ మల్లేష్ చేరిక చివరి వరకు సస్పెన్స్ :

క్యామ మల్లేష్ కాంగ్రెస్ పార్టీ తరుపున తనకు ఇబ్రహింపట్నం సీటు రావొచ్చని ఆశించారు. డిసిసి అధ్యక్షుడిగా ఉన్న తనకు సీటు పక్కాగా వస్తదని ఎదురుచూశారు. కానీ ఆ సీటును కూటమిలో భాగంగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన టిడిపి నేతకు కట్టబెట్టారు. సామ రంగారెడ్డిని కూటమి అభ్యర్థిగా ఇబ్రహింపట్నం నుంచి పోటీకి దింపారు. కానీ సామ రంగారెడ్డి ఎల్బీ నగర్ లో పోటీ చేసేందుకు చివరి వరకు ప్రయత్నించారు. ఎల్బీ నగర్ లో సీరియస్ గా గత కొంతకాలంగా పనిచేసుకుంటూ వచ్చారు.

అనూహ్యంగా సామ రంగారెడ్డిని ఇబ్రహింపట్నం బరిలోకి దింపింది టిడిపి. దీంతో తనకు టికెట్ వస్తుందని ఆశపడ్డ క్యామ మల్లేష్ కాంగ్రెస్ పార్టీ నేతలను తూర్పారపట్టారు. కాంగ్రెస్ పార్టీ స్ర్కీనింగ్ కమిటీ సభ్యుడు భక్తచరణ్ దాస్ మూడు కోట్లు డిమాండ్ చేశాడని విమర్శలు గుప్పించారు. మూడు కోట్ల రూపాయల తాలూకు ఫోన్ రికార్డింగ్స్ ఇవే అని కొన్ని ఆడియోలు వెలువరించారు. అయితే ఆ ఆడియోల్లో మధ్యవర్తుల మధ్య జరిగిన మాటల సంభాషన మాత్రమే ఉంది. 

సామ రంగారెడ్డి, ఇబ్రహింపట్నం కూటమి (టిడిపి) అభ్యర్థి

అలాగే తాను పార్టీ కోసమే జీవితమంతా పనిచేస్తే తనకు టికెట్ ఇవ్వలేదని, కాంగ్రెస్ లో యాదవ సామాజికవర్గాన్ని అనిచిపారేస్తున్నారని క్యామ మల్లేష్ మండిప్డడారు. తనతోపాటు భిక్షపతి యాదవ్, బొల్లం మల్లయ్య యాదవ్, రాజారాం యాదవ్ లాంటి వాళ్లకు కాంగ్రెస్ లో సీటు ఇవ్వలేదని ఆరోపించారు. ఇది యాదవ నేతలకు అవమానమే అని ఆవేదన వ్యక్తం చేశారు. మరో్వైపు కేసిఆర్ యాదవులకు పెద్ద పీట వేశారని అభినందించారు. కాంగ్రెస్ కూటమి ఒక్క సీటు యాదవులకు కేటాయిస్తే, టిఆర్ఎస్ లో 6 సీట్లు యాదవులకు కట్టబెట్టారని కొనియాడారు. 

ఈ పరిస్థితుల్లో క్యామ మల్లేష్ కామెంట్స్ ను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వెంటనే ఆయనను డిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే షోకాజ్ నోటీసుకు బదులు ఇవ్వకపోతే పార్టీ నుంచి తొలగిస్తామని పిసిసి వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఆయన కొద్దిగా మెత్తబడ్డారు. ఉత్తమ్ తో ఫోన్ లో మాట్లాడారు. కాంగ్రెస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. 

మల్ రెడ్డి రంగారెడ్డి, కూటమి రెబెల్

అసలు కిటుకు ఇదేనా ?

ఇదిలా ఉంటే కూటమిలో భాగంగా సామ రంగారెడ్డి టిడిపి నుంచి బరిలో ఉండగా కాంగ్రెస్ సీనియర్ నేత మల్ రెడ్డి రంగారెడ్డి కూడా బరిలో ఉన్నారు. మల్ రెడ్డి కాంగ్రెస్ తరుపున కాకుండా బిఎస్పీ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే మల్ రెడ్డి రంగారెడ్డి రాహుల్ గాంధీ బొమ్మలు, కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకుని ప్రచారం చేస్తారని, ఆయనకు ఇబ్రహింపట్నం వరకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందని పిసిసి పెద్దలు క్యామ మల్లేష్ కు చెప్పారు. కాంగ్రెస్ లో ఉండాలంటే కూటమి అభ్యర్థి సామ రంగారెడ్డికి బదులు రెబెల్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డికి సపోర్ట్ చేయాలంటూ క్యామకు ఆదేశించినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో క్యామ మల్లేష్ ను మల్ రెడ్డి రంగారెడ్డి సోదరుడు మల్ రెడ్డి రామిరెడ్డి రెబెల్ గా పోటీ చేసి ఓడించారు. 

ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థి సామ రంగారెడ్డికి కాకుండా రెబెల్ అభ్యర్థి, తన ప్రత్యర్థి వర్గమైన మల్ రెడ్డికి సపోర్ట్ చేయాలని కాంగ్రెస్ పెద్దల వత్తిడి రావడంతో క్యామ జీర్ణించుకోలేకోయారు. దీంతో ఇక కాంగ్రెస్ లో ఉండలేక ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కాంగ్రెస్ అధిష్టానానికి రాజీనామా లేఖ పంపి కేసిఆర్ సమక్షంలో ఇబ్రహింపట్నం సభలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.