టిఆర్ఎస్ కు మరో షాక్,  హైకోర్టులో పిటిషన్ వేసిన కాంగ్రెస్ మహిళా నేత

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ మహిళా నేత, మాజీ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోదాడ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధినిగా పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి  బరిలోకి దిగారు. అక్కడ ఆమె 2018 అసెంబ్లీ ఎన్నికల్లో  ఓటమి పాలయ్యారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యే గా బొల్లం మల్లయ్య యాదవ్ విజయం సాధించారు. అయితే అధికార పార్టీ అక్రమంగా గెలిచిందని దీంతో రీ కౌంటింగ్ కు అనుమతించాలని పద్మావతి పిటిషన్ లో కోరారు. దీంతో కోర్డు బుధవారం  ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

కోదాడలో జరిగిన కౌంటింగ్ లో మూడు ఈవీఎంలు మొరాయించాయి. దీంతో కౌంటింగ్ రోజు సాయంత్రం 7 దాటినా కోదాడ ఫలితం తేలలేదు. దీంతో వీవీ ప్యాట్ లు లెక్కించాలని పద్మావతి అధికారులను డిమాండ్ చేశారు.  కానీ అధికారులు అలా ఏం చేయకుండా ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. టిఆర్ఎస్ అభ్యర్ధి బొల్లం మల్లయ్య గెలిచినట్టుగా ప్రకటించారు. దీంతో ఉత్తమ్ అభ్యంతరం వ్యక్తం చేసి అధికారులతో గొడవ పెట్టుకున్నారు. అయినా ఫలితం లేదు. దీంతో రీకౌంటింగ్ జరపాలని, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన అధికారుల పై చర్యలు తీసుకోవాలని పద్మావతి పిటిషన్ లో పేర్కొన్నారు.

ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నేతలంతా విడివిడిగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. టిఆర్ ఎస్ అక్రమాలు చేసి గెలిచిందని వారు ఆరోపించారు. తాము ఓడిపోయిన స్థానాల్లో మళ్లీ రీకౌంటింగ్ చేయించాలని లేని పక్షంలో వీవీ ప్యాట్ లను లెక్కించాలన్నారు. ఎన్నికల్లో ఈవీఎంలను రిగ్గింగ్ చేశారని వారు ఆరోపించారు. వారి పిటిషన్లన్ని ప్రస్తుతం హైకోర్టులో ఉన్నాయి. వాటి పై కోర్టు ఇంకా విచారణ ప్రారంభించలేదు. దీంతో పద్మావతి పిటిషన్ కూడా ఆలస్యంగానే విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఒకవేళ హైకోర్టు రీకౌంటింగ్ కు అనుమతిస్తే టిఆర్ఎస్ జాతకం బయటపడుతుందని కాంగ్రెస్ నేతలు అన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా పలు ప్రాంతాలలో అక్రమాలకు పాల్పడిందో ప్రజలకు తెలుసన్నారు. హైకోర్టులో తీర్పు తమకు అనుకూలంగానే వస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు.