ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం గత నాలుగేండ్లుగా చకోర పక్షుల మాదిరిగా ఎదురుచూస్తున్న తెలంగాణ నిరుద్యోగులకు టిఆర్ఎస్ సర్కారు తీపి కబురు అందించింది. వారికి కొత్త సంవత్సరం తీపికబురు అందించేందుకు ప్లాన్ చేస్తోంది. వారం రోజుల్లో 1800 గురుకుల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసేందుకు కసరత్తు జరుగుతున్నది. ఈ పోస్టుల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఉంటాయని తెలిపింది. పూర్తి వివరాలు చదవండి.
నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమం పుట్టింది. తెలంగాణ సాధన వరకు ఇవే మూడు ట్యాగ్ లైన్లు సింహభాగాన నిలిచాయి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నియామకాల ట్యాగ్ లైన్ విషయంలో తొలి నాలుగున్నరేళ్ల టిఆర్ఎస్ సర్కారు ఘోరంగా విఫలమైంది. తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలంగాణ రాకముందు చెప్పిన మాటలు ఆచరణలో సాధ్యం కాలేదు. ఉద్యమ కాలంలో నోటిఫికేషన్లు వేయకుండా అడ్డుపడిన దాఖలాలున్నాయి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తొలి టర్మ్ లో నిరుద్యోగులకు ఏమాత్రం రుచించని పాలన సాగింది. అందుకే నిరుద్యోగులకు మేలు చేకూరేందుకు ఉద్యోగ ప్రకటనలపై దృష్టి సారించింది.
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 119 మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాసంస్థల్లో 1800 టీచింగ్ పోస్టులకు జనవరిలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిసింది. ఈ స్కూళ్లు 2019-20 విద్యాసంవత్సరంలో ప్రారంభమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ గురుకులాల నిర్వహణ కోసం టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు కలుపుకుని ఒక్కో గురుకులంలో 34 టీచర్ పోస్టులు చొప్పున 4046 పోస్టులు అవసరమని గుర్తించారు. అలాగే ఒక్కో స్కూల్ కు ఐసిటి పోస్టు మంజూరు చేయడంతో మరో 119 పోస్టులు కలిశాయి. మొత్తం కలిపి 4165 పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి బిసి సంక్షేమ శాఖ ఫైల్ పంపింది.
అయితే 2019-20 విద్యా సంవత్సరంలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ప్రారంభం కానున్న 119 బిసి గురుకులాల్లో 5,6 తరగతులు మాత్రమే ప్రారంభిస్తారు. దీంతో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 1800 టీచింగ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో ఎక్కువగా టిజిటి పోస్టులు భర్తీ చేసే అవకాశాలున్నాయి. అలాగే మరో 300 నాన్ టీచింగ్ పోస్టులను ఔట్ సోర్సింగ్ తరహాలో భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టుల భర్తీకి వారం రోజుల్లోగా ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించే అవకాశం ఉన్నట్లు బిసి సంక్షేమ శాఖ వర్గాలు తెలిపాయి. అయితే 4165 పోస్టుల్లో 1800 ఖాళీలు పోనూ మిగిలిన పోస్టులను వచ్చే విద్యాసంవత్సరంలో భర్తీ చేయవచ్చని తెలుస్తోంది.
కొత్త గురుకులాల్లో పోస్టుల భర్తీ ఇలా ఉండొచ్చు :
ప్రిన్సిపాల్ 1
టీజిటి 9
పిజిటి 7
జెఎల్ 7
పిఇటి 1
పిడి 1
స్టాఫ్ నర్స్ 1
సీనియర్ అసిస్టెంట్ 1
జూనియర్ అసిస్టెంట్ 1
లైబ్రేరియన్ 1
ఐసిటి 1
అటెండర్ 1
ల్యాబ్ అటెండర్ 1
ఆర్ట్ అండ్ క్రాప్ట్ టీచర్ 1
ముందస్తులో బ్రహ్మరథం పట్టినా… ఆ వెలితి గుర్తించిన కేసిఆర్
రెండోసారి అధికారం చేపట్టిన టిఆర్ఎస్ సర్కారు నిరుద్యోగ యువత టిఆర్ఎస్ విధానాల పట్ల ఆగ్రహంగా ఉన్నారని గుర్తెరిగింది. అందుకే రెండోటర్మ్ మేనిఫెస్టోలో ఉద్యోగాల ప్రస్తావన చేయకపోయినా కేసిఆర్ మీడియా ముందు నిరుద్యోగుల విషయంలో గత టర్మ్ లో ఉద్యోగాల భర్తీ చేయలేకపోయామని కానీ ఈ టర్మ్ లో వీలైనంత తొందరగా ఖాళీగా ఉన్న లక్ష పైచిలుకు పోస్టులన్నీ భర్తీ చేస్తామని ప్రకటన చేశారు.
అంతేకాకుండా జర్నలిస్టులు కూడా టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నారని గుర్తించిన ఆయన జర్నలిస్టులకు గత టర్మ్ లో ఇచ్చిన హామీ అమలు చేయలేకపోయామని, ఈ టర్మ్ లో వారికి న్యాయం చేస్తామని ప్రకటించారు. అలాగే పోడు భూముల విషయంలో గిరిజనులకు అన్యాయం జరిగిందని గుర్తించారు కేసిఆర్. ఈ విషయంలో కేటిఆర్ కూడా తమ తొలిటర్మ్ పాలనలో జర్నలిస్టులను పట్టించుకోలేదని అంగీకరించారు. ఈసారి జర్నలిస్టులకు గతంలో ఇచ్చిన హామీని అమలు చేస్తామని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ ది ప్రెస్ లో అంగీకరించారు.
పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులు టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటేశారని తేలిపోయింది. అందుకే వారి సమస్యను కూడా యుద్ధ ప్రాతిపాదికన పరిష్కరిస్తామని అన్నారు. 88 సీట్లతో గెలిచిన తర్వాత కేసిఆర్ సిఎంగా ప్రమాణ స్వీకారం చేేయకముందే తెలంగాణ భవన్ లో ఈ మూడు వర్గాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారిలో ఉన్న నిరాశా నిస్ర్పృహను గుర్తు పట్టి కార్యాచరణను ప్రకటించారు.