తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వస్తాయని రాజకీయ పార్టీలు, పార్టీల మీద ఆధార పడిన వాళ్లు ఆనందంగా ఉన్నారు. వాళ్ళకి ఎన్నికలంటే పండగ. బాగా డబ్బులొస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. రేపు వాళ్ల పార్టీ అధికారంలోకి వస్తే పదవుల పందారం జరుగుతుంది.
అయితే నిరుద్యోగులు మాత్రం తెగ ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే, ఎన్నికలు ముందు జరిగితే, ఎన్నికల నియమావళి అమలులోకి వస్తుంది. అప్పుడు ప్రభుత్వం ఎలాంటి నియామకాలు చేపట్టలేదు. అందువల్ల ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన రానున్న నోటిఫికేషన్లన్ని ఆగిపోతాయి. ప్రధానంగా ఎంతో కాలంగా ఎదరుచూస్తూ వచ్చిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల నియామకం ఆగిపోయే ప్రమాదం ఉంది. ఈ ఆందోళన ఇప్పుడు సర్వత్రా నెలకొంది. కోచింగ్ తీసుకుని నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్న్న వేలాది నిరుద్యోగులు ముందస్తు పథకం నిజమవుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.
నీళ్లు, నిధులు, ఉద్యోగాల పేరుతో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాక నాలుగున్నరేళ్లకు వస్తున్నదనుకున్న నోటిఫికేషన్ వాయిదా పడితే ఎలా అన్న ఆందోళన ‘తెలుగు రాజ్యం’ పరిశీలనలో వెల్లడయింది. దిల్ షుక్ నగర్, ఆర్టీసి క్రాస్ రోడ్స్,అమీర్ పేట, కూకట్ పల్లి లలో కోచింగ్ సెంటర్లు ఉన్న అనేక చోట్ల నిరుద్యోగులను ఎంక్వయిరీ చేస్తే వాళ్లంతా ముందస్తు ఎన్నికల వస్తాయోమోనని, ఎన్నికలొచ్చి తమ కలలను భగ్నం చేస్తాయోమోనని ఆందోళన, భయం వ్యక్తం చేశారు.
ముందస్తు ఎన్నికలొస్తే కనీసం మరొక ఆరునెలలు నోటిఫికేషన్ వాయిదా పడే అవకాశం ఉంది. ఈ ఎన్నిల తర్వాత లోక్ సభ ఎన్నికలొస్తాయి. అప్పుడు కూడా ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. తాజాగా ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వడానికి వీలుండదు. అంటే కనీసం 2019, మే దాకా ఎలాంటి నోటిఫికేషన్ రాదేమో నని , అప్పటికి తెలంగాణ ఏర్పడి 5 సంవత్సరాలు పూర్తవుతుందని వారు చెబుతున్నారు. అంటే, ఈ చిన్న ఉద్యోగాల కోసం నిరుద్యోగులు అయిదేండ్లు ఎదురు చూడాల్సి వచ్చిందని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా మందికి వయసు రుతుందని కూడా వారు అంటున్నారు.
సెప్టెంబర్ 2వ తేదీన ప్రగతి నివేదిక పేరుతో ముఖ్యమంత్రి కే . చంద్రశేఖరరావు తలపెట్టిన భారీ బహిరంగ సభ తర్వాత ఏ క్షణంలోనైనా అసెంబ్లీని రద్దు చేసే అవకాశాలున్నాయని గత మూడు రోజులుగా పలు కథనాలు వస్తున్న కొద్ది తెలంగాణ నిరుద్యోగుల్లో భయాందోళనలు ఎక్కువవుతున్నాయి.
సీఎం కేసీఆర్ మంత్రులు, టీఆర్‌ఎస్‌ఎల్పీ, ఎంపీలతో ఎమర్జన్సీ సమావేశాలు నిర్వహించడం, ఆగమేఘాల మీద సీఎం కేసీఆర్ తనయుడు మంత్రి కే. తారక రామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవడం, సీఎం కేసీఆర్ కూడా ఢిల్లీకి వెళ్లి అక్కడ ప్రధానమంత్రి, ఆర్థికశాఖామంత్రులతో సమావేశం కావడంతో చాలా మంది విద్యార్థులు నోటిఫికేషన్ రాదేమోనని బెంబేలు పడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టం తీసుకురావడం, 4వేలకు పైగా నూతన గ్రామ పంచాయతీలు, తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశాక ప్రతి గ్రామ పంచాయతీకి కార్యదర్శి ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో అంతా జై కెసియార్ అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 9355 పోస్టులు ఖాళీలుగా ఉండడంతో, అయా పోస్టులను ఒకటే నెలలో భర్తీ చేయాలని, దానికి సంబంధించిన ప్రక్రియను చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించడంతో తెలంగాణ నిరుద్యోగుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
దీనికి తోడు అధికారులు కూడా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల విధి, విధానాలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. ఈ పోస్టులకు సంబంధించి ఆర్థికశాఖ ఈనెల 24వ తేదీన అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఒకటి, రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ అవుతుందని నిరుద్యోగులు వేయికళ్ల తో ఎదురుచూస్తున్నపుడు ముందుస్తు మేఘాలు కమ్ముకున్నాయి.
భారీగా పంచాయతీ కార్యదర్శుల నియామకం జరుగుతుందని ఆశించిన నిరుద్యోగ యువతకు ఒక్క సారిగా నిరాశకు లోనవుతున్నారు. డిప్రెషన్ లో పడిపోతున్నారు. ఎన్నికల కోడ్ వస్తే అన్ని నోటిఫికేషన్ లతో పాటు జరిగే ిఇంటర్వ్యూలు, నియామకాలు అన్ని కూడా ఆగిపోెయే ప్రమాదం ఉంది.
‘ తెలుంగాణ వచ్చినప్పటి నుంచి నాలుగేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం ఎదురుచూస్తున్నాం. ఇప్పటి వరకూ ఇంజనీరింగు, పోలీసు ఉద్యోగాల తప్ప రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా జనరల్ నియామకాలు చేపట్టలేదు. ఇప్పుడు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పోస్టులనే సరికి ఏదో ఒక ఉద్యోగం వస్తుందని ఆశపడ్డాం. కోచింగ్ తీసుకుంటూ సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నాం. తీరా ఇప్పుడు ప్రభుత్వం ముందస్తు అని నియామకాలు ఆపేస్తే ఎలా,’ అని విద్యార్థులంతా ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులకు లేనిపోని ఆశలు చెప్పి రెచ్చగొట్టిన టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే హామీలన్నింటినీ విస్మరించడం న్యాయమా అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో మానసికంగా బాధపడుతున్నామని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విధానంతో నిరుద్యోగులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. అటు ఊళ్లకు పోలేక హైదరాబాద్ లో ఏ పని చేయలేక ఇబ్బంది పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిరుద్యోగుల గురించి ఆలోచించాలని వారు కోరుతున్నారు.