రెండు సీట్లతో రెండో లిస్ట్ ప్రకటించిన తెలంగాణ టిడిపి

తెలంగాణ టిడిపి మరో రెండు సీట్లలో అభ్యర్థులను ప్రకటించింది. మహా కూటమిలో భాగంగా టిడిపికి 14 సీట్లు ఖరారు చేసింది కూటమి. అయితే ఇప్పటికే తొలి జాబితాలో 9 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన టిడిపి మరో రెండు సీట్లకు బుధవారం సాయంత్రం అభ్యర్థులను ఖరారు చేసి వెలువరించింది. ఈ రెండు సీట్లలో ఒక సీటును ఆశిస్తున్న బిసి నేతకు షాక్ ఇచ్చింది మహా కూటమి.

రెండో జాబితాలో ఉన్న సీట్ల లిస్ట్ ఇది

ఇబ్రహింపట్నం – సామ రంగారెడ్డి

రాజేంద్ర నగర్ – గణేష్ గుప్త 

ఈ రెండు సీట్ల కేటాయింపులో నాటకీయత చోటు చేసుకున్నది. ఇబ్రహింపట్నం సీటులో పోటీకి దిగబోతున్న సామ రంగారెడ్డి తాను ముందునుంచీ ఎల్బీ నగర్ సీటును ఆశిస్తున్నారు. తనకు ఎల్బీ నగర్ సీటు ఇవ్వాలంటూ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు ధర్నాకు కూడా దిగారు. వందలాది మంది ఆయన అనుచరులను వెంట తెచ్చుకుని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ధర్నా చేశారు. అంతేకాకుండా ఎల్బీ నగర్ చౌరస్తాలో కూడా ధర్నా చేపట్టారు.

సామ రంగారెడ్డి, ఇబ్రహింపట్నం అభ్యర్థి

ఈ పరిస్థితుల్లో ఆయన అడిగిన సీటును వదిలేసి పక్క సీటును కేటాయించింది టిడిపి నాయకత్వం. అయితే ఇందులో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సామ రంగారెడ్డి సొంత ఊరు ఇబ్రహింపట్నం కావడంతో ఆయనను ఇబ్రహింపట్నంకు మార్చినట్లు చెబుతున్నారు. అయితే ఎల్బీ నగర్ సీటులో కాంగ్రెస్ తరుపున మాజీ ఎమ్మెల్యే, మాజీ హుడా ఛైర్మన్ సుధీర్ రెడ్డి పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ చెబుతూ వచ్చింది. ఎల్బీ నగర్ సీటులో ఇప్పటికే సర్వేలు చేసినా కాంగ్రెస్ కు సానుకూల వాతావరణం ఉన్నట్లు ఆ పార్టీ చెబుతున్నది. అందుకే ఎల్బీ నగర్ సీటును ఇరు పార్టీల నేతలు ఆశించడంతో ఆ సీటుపై పీఠముడి పడింది.

చివరకు ఇబ్రహింపట్నం సీటును సామ రంగారెడ్డికి కేటాయించడంతో సుధీర్ రెడ్డికి లైన్ క్లియర్ అయింది. అయితే 14 సీట్లలో భాగంగా ఇప్పటి వరకు టిడిపి 11 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. మరో మూడు సీట్లకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. టిడిపి కోరిన స్థానాల్లో జూబ్లిహిల్స్ ఉన్నప్పటికీ ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ విష్ణు వర్దన్ రెడ్డిని ప్రకటించింది. ఇక టిడిపి కి ఏ మూడు సీట్లు ఇస్తారన్నది తేలాల్సి ఉంది. 

మరో బిసి నేతకు కూటమి షాక్ : 

తెలంగాణలో కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, తెలంగాణ జన సమితి పార్టీలతో ఏర్పాటైన కూటమిని మహా కూటమిగానూ, ప్రజా కూటమిగానూ బయటకు పిలుస్తున్నారు. కానీ ఈ కూటమి తెలంగాణ రెడ్డి కూటమిగా ఆవిర్భవించిందని బిసి వర్గాల నుంచి తీవ్రమైన విమర్శలు మూటగట్టుకుంటన్నది. కూటమిలో అన్ని పార్టీల్లోనూ రెడ్డి అభ్యర్థులే లెక్కలేనంత మంది కనబడుతున్నారు. ఈ కూటమిపై బిసి వర్గాల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇక కూటమి తీరును నిరసిస్తూ బిసి సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ధర్నాకు సైతం పిలుపునిచ్చారు.

ఒకవైపు సీనియర్ బిసి నేతగా ఉన్న పొన్నాల లక్ష్మయ్యకు పొగ పెట్టారు. ఆయన సీటు ఇంకా ఎటూ తేలని పరిస్థితి ఉంది. అలాగే శేర్ లింగంపల్లి సీటులో ఆశావహుడైన బిసి నేత భిక్షపతి యాదవ్ కు మొండిచేయి చూపారు. ఆయనకే కాకుండా మేడ్చల్  సీటు ఆశించిన (రేవంత్ వర్గం) తోటకూర జంగయ్య యాదవ్ కు సీటు రాలేదు. కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి దక్కింది. ఇక కోదాడ సీటులో టిడిపి నేత బొల్లం మల్లయ్య యాదవ్ కు టికెట్ వస్తుందని ఆశించినా ఆయనకు రాలేదు. ఉత్తమ్ ఇంట్లో రెండు టికెట్లు తీసుకున్నారు. 

క్యామ మల్లేష్, ఇబ్రహింపట్నం కాంగ్రెస్ నేత

 ఇబ్రహింపట్నం సీటును కాంగ్రెస్ పార్టీ తరుపున బిసి నేత క్యామ మల్లేష్ ఆశిస్తున్నారు. ఆయన ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. కానీ ఆయనకు కాదని కూటమి సీటును టిడిపి తీసుకుని రెడ్డి కి కట్టబెట్టింది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కూడా ఇబ్రహింపట్నం సీటును ఆశించారు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లారు. కురుమ సామాజికవర్గానికి చెందిన క్యామ మల్లేష్ ఇబ్రహింపట్నంలో మంచి ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. యాదవ, కురమ కులాల ఓటు బ్యాంక్ ఈ నియోజకవర్గంలో బలంగా ఉంది. అయినప్పటికీ సీటును కూటమి రెడ్డి నేతకు కట్టబెట్టిందని క్యామ మల్లేష్ అనుచరులు గుర్రుగా ఉన్నారు. ఆయన తిరుగుబాటు బావుటా ఎగురవేసే అవకాశాలున్నట్లు ఆయన వర్గం నేతలు చెబుతున్నారు.