తెలంగాణ సెర్ప్ ఉద్యోగుల డిమాండ్లపై సస్పెన్స్

సిఎం ఆఫీస్ కు తెలంగాణ సెర్ప్ ఉద్యోగుల ఫైలు

సానుకూలమే అంటున్న పాలకపక్షం

జిఓలు వస్తేనే కార్యాచరణ ఉపసంహరణ అంటున్న జెఎసి

శనివారం జెఎసి అత్యవసర భేటీలో కీలక నిర్ణయాలు

తెలంగాణ సెర్ప్ ఉద్యోగుల డిమాండ్లపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఐదు ప్రధాన డిమాండ్లతో సెర్ప్ ఉద్యోగులు జెఎసి గా ఏర్పాటై సమ్మె నోటీసు ఇచ్చారు. డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మెకు దిగడమే కాకుండా ఆమరణ దీక్ష చేస్తామని స్పష్టంగా చెప్పారు. కుటుంబసభ్యులను కూడా తీసుకొచ్చి దీక్ష చేపడతామన్నారు.

సెర్ప్ ఉద్యోగుల సమ్మె నోటీసుపై తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తున్నప్పటికీ ఇంకా స్పష్టత రాలేదు. జెఎసి నేతలు అందిస్తున్న వివరాల ప్రకారం తమ డిమాండ్లకు సంబంధించిన ఫైలు సిఎం ఆఫీసుకు చేరిందని అన్నారు. ఈ విషయాన్ని సంబంధిత శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారని అన్నారు. సర్కారు వైఖరి, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు సెర్ప్ ఉద్యోగుల జెఎసి అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లో జరగనుంది.  

పే స్కేల్ ప్రతిపాదనల తాలూకు ఫైల్ సిఎం ఆఫీసుకు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో చేరిందని మంత్రి జూపల్లి కృష్ణారావు నుంచి సమాచారం వచ్చిందని జెఎసి నేతలు కుంట గంగాధర్, ఏపూరి నర్సయ్య, తాటికొండ సుదర్శన్, జానయ్య, సుభాష్, మధు రాజప్ప, దుర్గా కృష్ణ తెలిపారు.

హెచ్ ఆర్ పాలసీలో 58 ఏళ్లపాటు సర్వీసు కొనసాగే క్రమంలో అడ్డుగా ఉన్న ఐదు సంవత్సరాల నిబంధనను తొలగింపు ఫైలుపై ఇప్పటికే అడ్వొకెట్ జనరల్ అభిప్రాయాన్ని వెల్లడించారని అన్నారు. ఆ ఫైలు సంబంధిత అడ్మిన్ డిపార్ట్ మెంట్ కు చేరిందన్నారు. మిగతా పదోన్నతులు, పాలసీ ఇంక్రిమెంట్ డిమాండ్ల విషయంలో సిఎం అనుమతితో మంత్రి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం అందిందన్నారు.

అంతా సానుకూలంగానే కనిపిస్తున్నప్పటికీ ఈ డిమాండ్లన్నీ జిఓల రూపంలో తమకు వస్తేనే తమ సమ్మె, కుటుంబాలతో ఆమరణ దీక్షల కార్యాచరణ ఉపంసహరించుకుంటామన్నారు జెఎసి నేతలు. తాము 30వ తేదీ వరకు డెడ్ లైన్ పెట్టినప్పటికీ ఇంకా సర్కారు వైపు నుంచి క్లారిటీ రాలేదన్నారు.

ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో తమ కార్యాచరణ ఏరకంగా ఉండాలన్నదానిపై శనివారం హైదరాబాద్ నాంపల్లిలోని గోపి హోటల్ మీటింగ్ హాలులో సమావేశం జరుపుతున్నట్లు చెప్పారు. తమకు జిఓల రూపంలో ఎప్పటిలోగా సర్కారు అందిస్తుంది.. ఒకవేళ సర్కారు డిలే చేస్తే ఏం చేయాలి అన్న అంశాలపై సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఈ అత్యవసర సమావేశానికి 31 జిల్లాల నుంచి జిల్లాకు ఐదుగురు చొప్పున ప్రతినిధులు హాజరవుతారని వివరించారు. సర్కారు ప్రతిస్పందనపై చర్చించడంతోపాటు తాము ఏం చేయాలన్నదానిపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. 

తమ హక్కులు నెరవేరే విషయంలో సర్కారు నుంచి ఏమాత్రం తేడా వచ్చినా ఆమరణ దీక్షలు తప్పవని వారు హెచ్చరించారు. సమ్మె ప్రకటన, జెఎసి అత్యవసర సమావేశం నేపథ్యంలో ఎప్పుడేం జరగుతుందా అని సెర్ప్ ఉద్యోగులు టెన్షన్ తో ఉన్నారు. ఎమర్జెన్సీ మీటింగ్ తర్వాత సెర్ప్ ఉద్యోగుల వైఖరి మరింత స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది.