కేటిఆర్ ను వదల బొమ్మాలీ అంటున్న తెలంగాణ డాక్టర్లు

తెలంగాణ ఐటి శాఖ మంత్రి, సిరిసిల్ల నియోజకవర్గ టిఆర్ఎస్ అభ్యర్థి కేటిఆర్ వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణ డాక్టర్లు ఆయనపై గుర్రుగా ఉన్నారు. కేటిఆర్ సిరిసిల్లలో చేసిన కామెంట్స్ డాక్టర్లకు ఆగ్రహాన్ని తెప్పించాయి. ఈ విషయంలోవారం రోజుల క్రితం తెలంగాణ హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ నేతలు ఏకంగా ఎలక్షన్ కమిషన్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కేటిఆర్ ను ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. తాజాగా కేటిఆర్ మీద చర్యలు తీసుకోవాలంటూ జూనియర్ డాక్టర్లు రంగంలోకి దిగారు. 

కేటిఆర్ మీద చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ లోని ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు ఒకరోజు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మద్దతు పలికింది. అలాగే గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కూడా మద్దతు ప్రకటించింది. ఇక మరోవైపు ఎలక్షన్ కమిషన్ స్పందించకపోతే కోర్టుకు వెళ్లేందుకు డాక్టర్లు సిద్ధమవుతున్నారు. సంచలనం రేపుతున్న ఈ కేసులో అసలు వివరాలు ఇవి…

సిరిసిల్లలో మంత్రి కేటిఆర్ ఆర్ఎంపి, పిఎంపి ల సమావేశంలో చేసిన కామెంట్స్ పై ఆందోళన వ్యక్తం చేస్తూ తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించారు. నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణాల్లో వారు ధర్నా చేశారు. తక్షణమే కేటిఆర్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిఓ 428 సవరణ చేయాలన్న ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కేటిఆర్ ను ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలని వారు నినాదాలు చేశారు.  జూనియర్ డాక్టర్లు పెద్ద ఎత్తున బైకాట్ చేసి ఆందోళనలో పాల్గొనడంతో ఉస్మానియా, గాంధీ ఆసుపత్రి ఆవరణలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

అసలు కేటిఆర్ ఏం చెప్పారంటే…?

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ మంత్రి కేటిఆర్ సిరిసిల్లలో ఆర్ఎంపి, పిిఎంపి ల సమావేశంలో పాల్గొని వివాదాస్పదమైన కామెంట్స్ చేశారు. ఆర్ఎంపిలు, పిఎంపిలకు సర్టిఫికెట్లు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. వారు ప్రిస్కిప్షన్ రాయడం, ఆపరేషన్లు కూడా చేసే వెసులుబాటు కల్పించేందుకు ప్రయత్నం చేస్తానన్నారు. అంతేకాకుండా వారికి ఈ రకమైన వెసులుబాటు కల్పించేందుకు జిఓ 428 లో సవరణలు తీసుకొస్తామన్నారు. అన్నిటికంటే కీలకమైనదేమంటే… ఒక్కొక్క ఆర్ఎంపి, పిఎంపిలు 500 మందితో టచ్ లో ఉంటారని, వారందరితో తమ పార్టీకి ఓట్లేయించాలని వారిని ప్రలోభాలకు గురిచేసేలా కేటిఆర్ మాట్లాడినందుకు ఆయన మీద చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. 

వారికి కమ్యూనిటీ పారా మెడిక్ ట్రైనింగ్ ఇవ్వాలన్న ప్రతిపాదన ఉంది. అలా ట్రైనింగ్ ఇచ్చి ఆర్ఎంపిలకు సర్టిఫికెట్లు గా ఇస్తే ప్రజల ప్రాణాలకు ప్రమాదమని ప్రొఫెషనల్ డాక్టర్స్ వాదిస్తున్నారు. గుడ్డిగా ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు జారీ చేస్తే వారు చేసే వైద్యం తో జనాల ప్రాణాలకు ముప్పు వాటిల్ల వచ్చని హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో, పట్టణాల్లో ఆర్ఎంపిలు, పిఎంపిలు మితిమీరిన వైద్యం చేయడం వల్ల అనేక ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో వారికి మరింత వెసులుబాటు ఇవ్వడం కారణంగా మరిన్ని కష్టాలు తప్పవంటున్నారు. 

డాక్టర్లు ఆందోళన ఉధృతం చేయడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇది ఏరకమైన పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

డాక్టర్లు ఎన్నికల సంఘం రాష్ట్ర సిఇఓ రజత్ కుమార్ కు ఈనెల 12న ఇచ్చిన వినతిపత్రం కాపీ కింద ఉంది.