ఎస్ఈసీకి హైకోర్టు బిగ్ షాక్ .. ఆ గుర్తు ఉంటేనే ఓటు చెల్లుబాటు !

గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ ఈ రోజు ఉదయం 8 గంటలకి ప్రారంభం అయింది. ఈ సమయంలో తాజాగా తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. . అర్ధరాత్రి ఎన్నికల సంఘం జారీచేసిన ఉత్తర్వులను నిలిపి వేయాలని స్పష్టం చేసింది.

బ్యాలెట్ పేపర్‌ పై స్వస్తిక్ గుర్తు ఉన్న ఓట్లను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.జీహెచ్‌ఎంసీ కౌంటింగ్‌ లో స్వస్తిక్ గుర్తు కాకుండా, ఏ గుర్తు ఉన్నా ఓటుగా పరిగణించాలంటూ ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు తోసిపుచ్చింది. స్వస్తిక్ గుర్తు ఉన్న ఓట్లను మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది.

పోలింగ్ సమయంలో ఓటర్లకు స్వస్తిక్‌ ముద్రకు బదులు పొరపాటున పోలింగ్‌ కేంద్రం సంఖ్య తెలిపే ముద్రల్ని ఇచ్చామని.. ఎన్నికల సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో పలువురు ఉద్యోగులు ఈసీ దృష్టికి తీసుకువచ్చారు. ఐతే అలాంటి ఓట్లనూ పరిగణలోకి తీసుకోవాలని ఎన్నికల అధికారులు అర్ధరాత్రి ఆదేశిలిచ్చారు. దీనిపై బీజేపీతో పాటు ఇతర ప్రతి పక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశాయి. బీజేపీ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం స్వస్తిక్ గుర్తు ఉన్న ఓట్లను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది.

ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న 150 డివిజన్లలో కౌంటింగ్ కొనసాగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. అన్ని డివిజన్లలో కలిపి 1926 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక ఉదయం 10.40 నిమిషాల వరకు .. బీజేపీ 88, టీఆర్ఎస్ 35, ఎంఐఎం 17 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో మాత్రమే ఆధిక్యంలో ఉంది.