Corona update in India: దేశంలో 7,495 న్యూ కరోనా పాజిటివ్ కేసులు… తెలంగాణలో క్రిస్మ‌స్, న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై ఆంక్షలు

Corona update in India

Corona update in India:దేశంలో గడిచిన 24 గంటల్లో 7,495 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న 12,05,775 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించినట్లు బులిటెన్‌ లో తెలిపింది. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 3,47,65,976 కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న6,960 మంది కోలుకోగా వారితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 3,42,08,926 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

ప్రస్తుతం 78,291యాక్టివ్‌ కేసులు ఉండగా ఇది గడిచిన 576 రోజులలో కనిష్టమని, కాగా ఇప్పటివరకు దేశంలో 66,86,43,929 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 236కు చేరింది. 236 మంది ఒమిక్రాన్ బాధితుల్లో 104 మంది కోలుకున్నారు. మ‌హారాష్ట్ర‌లో 65, ఢిల్లీలో 64, తెలంగాణ‌లో 24, రాజ‌స్థాన్‌లో 21, క‌ర్ణాట‌క‌లో 19, కేర‌ళ‌లో 15, గుజ‌రాత్‌లో 14 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కరోనా నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. అయితే రాష్ట్రంలో కొవిడ్ ప‌రిస్థితుల‌పై తెలంగాణ హైకోర్టు గురువారం విచార‌ణ చేప‌ట్టింది. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్ర‌మంలో… క్రిస్మ‌స్, న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై ఆంక్ష‌లు విధించాల‌ని కోర్టు పేర్కొన్న‌ది. రెండు, మూడు రోజుల్లో ఈ వేడుక‌ల‌పై ఆంక్ష‌లు విధిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేయాల‌ని ఆదేశించింది.