పరిషత్ ఎన్నికలకు అడ్డంకి తొలగిపోయింది. పరిషత్ ఎన్నికలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ డివిజనల్ బెంచ్‌లో సవాల్ చేసిన విషయం విదితమే. సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టే ఆదేశాల్ని కొట్టి పారేసిన డివిజనల్ బెంచ్, పరిషత్ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఫలితాల్ని ప్రకటించవద్దని డివిజనల్ బెంచ్ పేర్కొనడం గమనార్హం. రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు గత ఏడాది జరగాల్సి వుండగా, కరోనా నేపథ్యంలో మధ్యలోనే ప్రక్రియ వాయిదా పడింది.
ఈ క్రమంలో నానా యాగీ జరిగింది కూడా. అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద కులం పేరుతో అధికార పార్టీ విమర్శల దాడి చేయడం చూశాం. అదే సమయంలో, నిమ్మగడ్డ రమేష్ కుమార్ సైతం, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేశారన్న వాదనలూ తెరపైకొచ్చాయి. ప్రభుత్వం, నిమ్మగడ్డపై గుస్సా అవడం.. ఆయన స్థానంలో మరొకర్ని ఎస్ఈసీగా నియమించడం, ఈ క్రమంలో ప్రభుత్వానికి చుక్కెదురై తిరిగి నిమ్మగడ్డ, ఎస్ఈసీగా కొనసాగడం, పంచాయితీ అలాగే మునిసిపల్ ఎన్నికలు ఆయన హయాంలోనే జరగడం చూశాం.
పరిషత్ ఎన్నికల విషయంలో మాత్రం నిమ్మగడ్డ చొరవ చూపలేకపోయారు. నిమ్మగడ్డ చొరవ తీసుకుని వుంటే, ఈపాటికే పరిషత్ ఎన్నికలు పూర్తయిపోయి వుండేవి. కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోతే, వేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఎస్ఈసీ నీలం సహానీ, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించి, పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తమ్మీద, డివిజన్ బెంచ్ తీర్పుతో, రేపు యధాతథంగా పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. ఏకగ్రీవాలతో జోరు మీదున్న వైసీపీ, విపక్షాల్ని ఇంకోసారి మట్టికరిపించేందుకు సిద్ధమవుతోంది. నిన్నటి తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు, రాజ్యాంగ విజయమని అభివర్ణించారు. తాము ఎన్నికల్ని బహిష్కరించడం సబబేనని కోర్టు తేల్చి చెప్పినట్లుగా ఉప్పొంగిపోయారు. మరిప్పుడు, చంద్రబాబు ఏమంటారు.? దీన్ని రాజ్యాంగ ఓటమి అని చంద్రబాబు అనగలరా.?