నిమ్మగడ్డ నిజాయితీగా పని చేసుంటే వైసీపీ పరిస్థితి మరోలా ఉండేది: చంద్రబాబు నాయుడు

Chandrababu, Lokesh unhappy with EC

ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో వైసీపీ పార్టీ పతనం ప్రారంభమైందని… ఇది ఆరంభం మాత్రమేనని… వైసీపీని ఎవరూ కాపాడలేరని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. వైకాపా నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని , అరాచకాలు సృష్టించారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వం కొనసాగడానికి ఇక వీల్లేదన్నారు. ఇకపై వారు తలకిందులుగా తపస్సు చేసినా అధికారంలోకి రాలేరని.. ఇదే ఫైనల్ అన్నారు.

Chandrababu naidu said that the Unfair polls led to 10% vote loss to TDP

మంగళగిరి తెదేపా కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడుతూ… పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో వీరోచితంగా పోరాడారని, ప్రాంతాలు, కులాలకు అతీతంగా పోరాటం చేశారని కొనియాడారు. ఎన్నికల కమిషన్ చొరవ తీసుకుని పంచాయతీ ఎన్నికలు సక్రమంగా జరిపి ఉంటే టీడీపీకి ఇంకా 10శాతం ఫలితాలు పెరిగేవని, అదే జరిగితే వైసీపీ ఇప్పుడే పతనం అయ్యేదని చంద్రబాబు అన్నారు. వైసీపీ నేతలు రెండేళ్లకే మిడిసిపడుతున్నారని, తప్పుడు కేసులు పెట్టి ఓట్లు వేయించుకోవడం ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగాయా? అని ప్రశ్నించారు. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఎన్నికల కమిషన్‌ ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. టీడీపీ ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా ఎస్‌ఈసీ చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. రోడ్డుపై ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఓటర్లు ప్రయత్నం చేస్తుంటే.. ఎన్నికల కమిషన్ నిర్వీర్యమైపోయందని విమర్శించారు. కొత్తవలస టీడీపీ అభ్యర్థికి 250 ఓట్ల మెజారిటీ వచ్చినా రీకౌంటింగ్‌ కోరతారా? టీడీపీ గెలిస్తే రీకౌంటింగ్‌.. వైసీపీ గెలిస్తే ఉండదా? అని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఒక దొంగకి తాళాలు ఇస్తే ఏం జరుగుతుందో రాష్ట్రంలో ప్రస్తుతం కూడా ఇదే పరిస్తితి నెలకొందని చంద్రబాబు ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల కోసం తిరుపతి లడ్డూలు పంపిణీ చేయడం దారుణమన్నారు. పూర్తి ఆధారాలతో కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తామన్నారు. వేరే మతస్తుల్ని వెనకేసుకు వస్తున్న స్వామిజీని ఆ దేవుడు కూడా క్షమించరన్నారు. ఆ స్వామీజీ చేసేవి అన్ని క్షుద్ర పూజలే అని ఆరోపించారు. ఏపీలో పరిస్థితి చూస్తే రౌడీయిజంలో బీహార్ ను మించిపోయినట్టు అనిపిస్తోందని, త్వరలోనే సీఎం జగన్ కు రాష్ట్ర ప్రజలు తగిన బుద్ది చెబుతారని చంద్రబాబు అన్నారు.