పరిషత్ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదనీ, అందుకు కోర్టు కేసులు సహా కరోనా సెకెండ్ వేవ్ కూడా కారణమనీ విపక్షాలు అంచనా వేశాయి. కానీ, ఆంధ్రపదేశ్‌లోని అధికార వైసీపీ అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదిపింది. కేవలం ఆరు రోజుల ప్రక్రియ మాత్రమే మిగిలి వున్నట్లు వైసీపీ చెబుతూ వస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూఢా ఇదే విషయమై పదే పదే వ్యాఖ్యలు చేస్తూ వున్నారు. పంచాయితీ, మునిసిపల్ ఎన్నికలతోపాటే పరిషత్ ఎన్నికలు కూడా జరగాల్సి వున్నా తన హయాంలో ఎస్ఈసీ, పరిషత్ ఎన్నికలు నిర్వహించలేకపోయిన విషయం విదితమే. నిన్న ఉదయమే నీలం సాహ్నీ కొత్త ఎస్ఈసీగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. సాయంత్రానికి పరిణామాలు వేగంగా మారిపోయాయి.
రాత్రి నోటిఫికేషన్ వచ్చేసింది. ఎక్కడైతే గత ఏడాది పక్రియ ఆగిందో, అక్కడి నుంచే తిరిగి ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే, న్యాయ స్థానాల తీర్పులకు లోబడి నోటిఫికేషన్ వుంటుందని ఎస్ఈసీ నీలం సాహ్నీ తాజా నోటిఫికేషన్ విడుదల చేయడం గమనార్హం. రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల నేపథ్యంలో బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయనీ, అధికార పార్టీ అరాచకాలకు పాల్పడిందనీ అభియోగాలున్నాయి. మరోపక్క, టీడీపీ సహా ఇతర రాజకీయ పార్టీలన్నీ కొత్త నోటిఫికేషన్ కోసం డిమాండ్ చేశాయి. ఈ మేరకు పలు పలు పిటిషన్లు కూడా న్యాయస్థానాల్లో నమోదయ్యాయి. 526 జెడ్పీటీసీ స్థానాలకీ, 7321 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కొత్త నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఎన్నికల్ని బహిష్కరిస్తామని టీడీపీ అంటోంది. మరోపక్క, కొత్త నోటిఫికేషన్‌తో కాకుండా పాత నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నందున ఎస్ఈసీతో భేటీకి వెళ్ళకూడదనే ఆలోచనలో వుంది జనసేన పార్టీ. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఎస్ఈసీ నీలం సాహ్నీ, వివిధ రాజకీయ పక్షాలతో భేటీ కానున్నారు.