ఆ శాఖ ఉద్యోగులు ఇచ్చిన నోటీసు తెలంగాణ సర్కారులో కదలికలు తెచ్చింది. ఆగస్టు 30 వరకు సర్కారు స్పందించకపోతే కుటుంబాలతో వచ్చి ఆమరణ దీక్ష చేస్తామన్న హెచ్చరికలపై సర్కారు స్పందించింది. స్వయంగా ఆ శాఖ మంత్రి ఈ మేరకు ఆ శాఖ ఉద్యోగుల డిమాండ్లపై ప్రతిపాదనలు రెడీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాలు చదవండి.
సెర్ప్ ఉద్యోగుల డిమాండ్లపై తగు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శాఖాపరమైన పలు అంశాలపై అధికారులతో సోమవారం మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా సెర్ప్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లతో పాటు…జూనియర్ గ్రామ కార్యదర్శులు, పారిశుద్ధ్య కార్మికుల నియామకం తదితర అంశాలపై ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, సెర్ప్ సీఈఓ పౌసమి బసులతో చర్చించారు.
వెయ్యి, 750 రూపాయల చొప్పున ఎల్ 1, ఎల్ 2 లకు ఇవ్వాల్సిన పెండింగ్ ఇంక్రిమెంట్ ను ఉద్యోగుల వేతనంతో కలిపేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐదేళ్లకు ఒకసారి ఒప్పందం పునరుద్దరించుకునేలా ఉన్న నిబంధనను కూడా తొలిగించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. అలాగే ఇతర డిమాండ్లపైనా అధికారులతోనూ, సెర్ప్ సిబ్బందితోనూ చర్చించి నిర్ణయం తీసుకోవాలని ముఖ్య కార్యదర్శి, సీఈఓలను ఆదేశించారు.
పారిశుద్ధ్య కార్మికులు, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నిమాయకానికి సంబంధించిన నియమ నిబంధనలు, నోటిఫికేషన్ జారీకి సంబంధించి జరుగుతున్న కసరత్తుపై కమిషనర్ నీతూప్రసాద్‌తో చర్చించారు. జోనల్ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వగానే జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
పారిశుద్ధ్య కార్మికుల నియామకానికి సంబంధించి కసరత్తు పూర్తి కావచ్చిందని… విద్యార్హతగా ఏడవ తరగతిని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. సమీక్షలో స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్‌రెడ్డి, సెర్ప్ హెచ్ ఆర్ డైరెక్టర్ బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
మంత్రులను కలిసిన జెఎసి బృందం
తెలంగాణ సెర్ప్ లో పనిచేస్తున్న ఉద్యోగులంతా జెఎసి గా ఏర్పాటైన విషయం తెలిసిందే. వారంతా తమ డిమాండ్లను ఈనెల 30 లోగా నెరవేర్చకపోతే 31వ తేదీ నుంచి సమ్మెతోపాటు ఆమరణ దీక్షలు చేస్తామని ప్రకటించారు కూడా. అంతేకాకుండా ఇప్్పటికే ప్రభుత్వంపై వత్తిడి పెంచే ప్రయత్నాలు చేపట్టారు. సోమవారం సచివాయలంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, కేటిఆర్, జగదీష్ రెడ్డిని కలిసి తమ సమస్యలను విన్నవించారు.
ఈ సందర్భంగా మంత్రులు అతి తొందరలోనే సమస్యను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ విషయం సిఎం నోటీసుకు పోయిందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని మంత్రులు వారికి హామీ ఇచ్చారు. తమ ఐదు డిమాండ్లు పరిష్కారమైతేనే సమ్మె విమరణ చేస్తామని అందులో ఒక్కటి పరిష్కారం కాకపోయినా సమ్మె జరిపి తీరతామని ఉద్యోగ సంఘాల జెఎసి నేత ఏపూరి నర్సయ్య ‘తెలుగురాజ్యం’కు తెలిపారు.
సెర్ప్ ఉద్యోగుల సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో వారి డిమాండ్లపై తెలుగురాజ్యం ప్రత్యేక కథనం పబ్లిష్ చేసిన విషయం తెలిసిందే. సెర్ప్ ఉద్యోగుల ఆందోళన తాలూకు తెలుగు రాజ్యం సైట్ లో రాసిన స్టోరీ కింద లింక్ లో ఉంది చూడండి.