తెలంగాణలో ఇద్దరు డిప్యూటి సీఎంలకు టెన్షన్ మొదలైందని తెలుస్తోంది. తెలంగాణలో డిప్యూటి సీఎంలు గా ఉన్న కడియం శ్రీహరి, మహ్మద్ అలీ ఇద్దరూ కూడా తర్వాత వచ్చే ప్రభుత్వంలో తమ స్థానాలు దక్కేనా లేక ఉత్తదేనా అని హైరానా పడుతున్నారు. సెప్టెంబర్ 6 న సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి అదే రోజు 105 మంది అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించారు. ఈ జాబితాలో కడియం శ్రీహరి పేరు కానీ మహ్మద్ అలీ పేరు కానీ లేదు.
వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహరి 2014 ఎన్నికల్లో టిఆర్ ఎస్ తరపున వరంగల్ ఎంపీగా గెలిచారు. స్టేషన్ ఘన్ పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న టి. రాజయ్యను ఉపముఖ్యమంత్రిగా కేసీఆర్ నియమించారు. అయితే 2015లో పలు కారణాలతో రాజయ్యను పదవి నుంచి తొలగించి ఎంపీగా ఉన్న కడియం శ్రీహరిని ఎమ్మెల్సీ గా నియమించి ఉపముఖ్యమంత్రిగా నియమించారు. శ్రీహరి పదవి కాలం మరో రెండేళ్లలో ముగుస్తుంది. దీంతో మళ్లీ డిప్యూటి సీఎంగా నియమిస్తారో లేదో అని శ్రీహరి అనుకుంటున్నారట.
ఈ సారి జరిగే ఎన్నికల్లో కడియం శ్రీహరి తనకు కానీ తన కూతురు కావ్యకి కానీ ఎమ్మెల్యే టికెట్ కావాలని ఆశించారు. ప్రకటించి ఎమ్మెల్యే జాబితాలో ఈ రెండు పేర్లు కూడా లేవు. స్టేషన్ ఘన్ పూర్ నుంచి రాజయ్యను అభ్యర్ధిగా కేసీఆర్ ప్రకటించారు. దీంతో కడియం శ్రీహరి డైలమాలో పడ్డాడు. కొద్ది రోజుల క్రితం స్టేషన్ ఘన్ పూర్ ప్రజలు కడియమే పోటి చేయాలని ఆయన ఇంటికి కార్యకర్తుల భారీగా చేరుకొని ఆందోళన చేశారు. అయినా కూడా సీఎం కేసీఆర్ దీని పై స్పందించలేదు. కడియం శ్రీహరే కావాలని జనాలను రప్పించుకొని ఆడిన నాటకం అని పలువురు స్వంత పార్టీ నేతలే విమర్శించారు.
రాజయ్య పై వ్యతిరేకత రావడంతో పాటు ఇటీవల పలు అసాంఘీక కార్యక్రమాలకు సంబంధించి రాజయ్య మాట్లాడిన ఆడియో టేపు సంచలనం రేపింది. ఇవన్నీ జరగడంతో రాజయ్యను మారుస్తారని అంతా అనుకున్నారు. కానీ అన్నింటిని తలదన్నేలా కేసీఆర్ ధూతను రాజయ్య దగ్గరికి పంపి అభయమిచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరికి టెన్షన్ ఎక్కువైందని తెలుస్తోంది. ఎన్నికలలో టిఆర్ ఎస్ ప్రభుత్వం వస్తే మళ్లీ డిప్యూటి సీఎంలుగా నియమిస్తారో లేదో అని అంతర్మదన పడుతున్నట్టుగా పలువురు నేతల ద్వారా తెలుస్తోంది.
మరో డిప్యూటి సీఎం మహ్మద్ అలీ. ఈయన కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ ఎన్నికలలో మలక్ పేట నుంచి పోటి చేయాలని భావించారు. తనకు రాని పక్షంలో తన కుమారుడు అజం అలీకైనా టికెట్ వస్తుందని ఆశించారు. కానీ కేసీఆర్ ప్రకటించిన జాబితాలో మలక్ పేట అభ్యర్ధిని ప్రకటించలేదు. ఇక్కడ ఎంఐఎం ఎమ్మెల్యేగా అహ్మద్ బిన్ బలాల ఉన్నారు. కేసీఆర్ పలుసార్లు మాట్లాడుతూ ఎంఐఎం తమకు మిత్ర పక్షం అని వ్యాఖ్యానించారు. దీంతో వారికే మద్దతిస్తారని నాయకులు అంటున్నారు.
ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న బలాలకు మరియు మహ్ముద్ అలీకి కుటుంబ గొడవలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎంఐఎం మళ్లీ బలాలను రంగంలోకి దింపితే కేసీఆర్ మలక్ పేట నుంచి ఎవరిని దింపకుండా ఉండే అవకాశం కూడా ఉంది. పలువురు కీలక నేతలను దూరం పెడుతున్న కేసీఆర్ ఈ మధ్య హరీష్ ను కూడా పక్కకు పెట్టినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరిని పక్కకు పెట్టినా ఆశ్చర్య పోనక్కర్లేదని పలువురు అంటున్నారు.
మొత్తానికి తెలంగాణలో ఇద్దరు ఉపముఖ్యమంత్రులకు డైలామా పరిస్థితి వచ్చిందని, ఎన్నికల తర్వాత వారి పరిస్థితేంటని అంతా చర్చించుకుంటున్నారు. వీరిద్దరిని కేసీఆర్ తప్పిస్తారనే చర్చ జోరందుకుంది. అందుకే వారికి టికెట్ ఇవ్వలేదని తెలుస్తోంది. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా అంతా సంచలనమే కదా… మరీ వీరి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోనున్నారని తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.